రిటైర్మెంట్ నిధికి ఈక్విటీలే బెస్ట్ | Best Retirement Equities Fund | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ నిధికి ఈక్విటీలే బెస్ట్

Published Mon, Nov 30 2015 12:51 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

రిటైర్మెంట్ నిధికి ఈక్విటీలే బెస్ట్ - Sakshi

రిటైర్మెంట్ నిధికి ఈక్విటీలే బెస్ట్

అందరికీ పదవీ విరమణ తరవాత పెన్షన్ వస్తుందనో, లేకపోతే అప్పటికే సంపాదించిన ఆస్తులపై వడ్డీయో, అద్దెలో వస్తాయనో ఆశించలేం. మరి అలాంటపుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా జీవితం కొనసాగించాలంటే దానికి ముందు నుంచే ప్రణాళిక తప్పనిసరి. అందుకే మనలో చాలా మంది  సంపాదనలో ఎక్కువ మొత్తం రిటైర్మెంట్ కోసమే కేటాయిస్తారు. కాకపోతే ఈ మొత్తాన్ని ఈక్విటీలకు (షేర్లు) కేటాయించాలా లేక డెట్ పథకాలకు కేటాయించాలా? అనేది ప్రతి ఒక్కరికీ సందిగ్ధమే. గతంలో అయితే రిటైర్మెంట్ కోసం దాచేటపుడు ఎటువంటి రిస్కూ లేని సాధనాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మునుపటిలా లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. అందుకని ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తూ అధిక రాబడులను పొందడానికి ఈక్విటీలే అత్యుత్తమం అని చెప్పాలి.

ప్రత్యేక లక్ష్యం
రిటైర్మెంట్ నిధిని ప్రత్యేక ఆర్థిక లక్ష్యంగా నిర్దేశించుకుని దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగంలో చేరగానే తొలి జీతం నుంచీ పీఎఫ్ ఖాతాకు  కొంత మొత్తం ఎలా జమ అవుతుందో అదే విధంగా మొదటి నెల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రారంభించాలి. ఇలా ఈక్విటీల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడంతో అటు ఆర్థిక క్రమశిక్షణ అలవాటు కావటంతో పాటు ఇటు ద్రవ్యోల్బణాన్ని అధిగమించి అధిక రాబడులను పొందవచ్చు. అలాగే మీ జీతం పెరిగినప్పుడల్లా పీఎఫ్ ఖాతాకు జమ చేసే మొత్తం ఏవిధంగా పెరుగుతుందో అదే విధంగా జీతం పెరిగినప్పుడల్లా సిప్ మొత్తాన్ని కూడా పెంచాలి. ఇంకా రిటైర్మెంట్ నిధిని మరింత పెంచుకోవడానికి ఏడాదిలో వచ్చే బోనస్‌లు, ఇన్సెంటివ్‌లను కూడా ఈక్విటీలకు కేటాయించండి. ఈ మొత్తాలను ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌కు కేటాయించడం ద్వారా అటు పన్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు.

పెరిగే రేట్లు..: రిటైర్మెంట్ ప్రణాళిక తయారు చేసుకునేటప్పుడు పెరుగుతున్న ధరలను  (ద్రవ్యోల్బణాన్ని) కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఉద్యోగంలో చేరకముందు మీ చిన్నప్పటి నుంచి ధరలు ఇప్పటి వరకు ఏవిధంగా పెరిగాయో చర్చించుకోండి. దీని వల్ల భవిష్యత్తులో ధరలు ఏవిధంగా పెరుగుతాయన్న దానిమీద మీకొక అంచనా వస్తుంది. దీన్ని బట్టి రిటైర్మెంట్ నిధి ఎంత ఉండాలన్న దానిపై అవగాహన వస్తుంది. ప్రస్తుత వ్యయాలు, సగటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత నిధి కావాలన్నది తెలుసుకోవచ్చు.
 
దగ్గరకొచ్చేకొద్దీ తగ్గించండి..
సహజ సిద్ధంగానే స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులుంటాయి. కొన్ని సందర్భాల్లో నష్టాలు అందించినా... మరికొన్ని సమయాల్లో అధిక రాబడులనిస్తాయి. దీర్ఘకాలంలో చూస్తే మంచి రాబడులను పొందే వీలుంటుంది. కానీ పదవీ విరమణ సమయం దగ్గరకొచ్చేకొద్దీ మీలో ఈ రిస్క్ సామర్థ్యం తగ్గుతుంది. అందుకే చిన్న వయస్సులో ఈక్విటీలకు ఎక్కువ కేటాయించి... రిటైర్మెంట్ దగ్గరకొచ్చే కొద్దీ ఈక్విటీలో పెట్టుబడిని క్రమంగా తగ్గించుకోండి. ఇందుకోసం సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్‌ను (ఎస్‌టీపీ) అనుసరించండి. ఎస్‌టీపీ విధానంలో ఈక్విటీల నుంచి డెట్ పథకాల్లోకి మార్చుకోండి. అలాగే రిటైర్మెంట్ తర్వాత అవసరమయ్యే ఖర్చుల కోసం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) విధానం అనుసరించండి. ప్రతి నెలా మీకు ఎంత మొత్తం అవసరమవుతుందో ఆ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చే విధంగా ఎస్‌డబ్ల్యూపీని ఎంచుకోండి. ఈ విధంగా చేస్తే రిటైర్మెంట్ తర్వాత కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించొచ్చు.
 
హర్షేందు బిందాల్
ప్రెసిడెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement