దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీఐటీయూ శ్రేణులు
గోదావరిఖని(రామగుండం) : బొగ్గుగనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ బొగ్గు ధర నిర్ణయిస్తూ విక్రయించుకునే అధికారం కూడా సంస్థలకు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ చర్యపూర్తిగా సింగరేణి, కోల్‌ఇండియా లాంటి ప్రభుత్వ రంగసంస్థల మూసివేతకు దారి తీస్తుందని ఆయా సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరిఖనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయగా, ఈనెల 23న సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు ఏఐటీయూసీ ప్రకటించింది.
1938 నిజాం పాలనలో సింగరేణి బొగ్గుగనులను పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్పుచేశారు. 1973 వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనున్న బొగ్గుగనులను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేశారు. అప్పటి ఎనిమిది సబ్సిడరీ సంస్థల పరిధిలోని బొగ్గుగనులు కోల్‌ఇండియా లిమిడెట్ పరిధిలోకి తీసుకువస్తూ పార్లమెంట్‌లో చట్టం చేశారు. ఇలా సింగరేణి, కోల్‌ఇండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీలుగా వర్ధిల్లుతున్నాయి. ఆయా సంస్థల్లో కొన్ని గనులను క్యాప్టివ్ మైన్‌గా గుర్తించి వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించి బొగ్గును వెలికితీసేలా చూశారు. కానీ బొగ్గును విక్రయించే అధికారం మాత్రం పబ్లిక్ సెక్టార్ కంపెనీలకే ఇచ్చారు. ఇలా సాగుతున్న క్రమంలో బొగ్గుగనులను క్యాప్టివ్ మైన్స్‌గా గుర్తిస్తూ ప్రైవేటు సంస్థలకు అప్పగించడం.. బొగ్గును విక్రయించే అధికారం కూడా ఆయా ప్రైవేటు సంస్థలకే అప్పగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పార్లమెంట్‌లో చట్టంగా రావడమే తరువాయి.
ఉద్యమానికి సిద్ధంగా కార్మిక సంఘాలు..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. కోల్‌ఇండియా పరిధిలో జాతీయ కార్మిక సంఘాలు ఉద్యమానికి సిద్దమవుతున్నాయి. సింగరేణిలో కూడా కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ నెల 23న సింగరేణి వ్యాప్తంగా అన్నిగనులపై కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య తెలిపారు. సింగరేణిలో ఐక్యంగా ఉద్యమం చేసేందుకు గురువారం అన్నికార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి కార్మికలోకం కదిలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వేల్పుల కుమారస్వామి, మెండె శ్రీనివాస్, డి.కొమురయ్య, వెంకటేశ్‌బాబు, సీహెచ్. ఓదెలు, ఉల్లి మొగిలి, జి.గోపాల్, రాములు, గౌస్, పానుగంటి కృష్ణ, రవి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment