‘సింగరేణి’లో గెలుపే లక్ష్యంగా పావులు | Singareni trade unions gear up for up coming elections | Sakshi
Sakshi News home page

‘సింగరేణి’లో గెలుపే లక్ష్యంగా పావులు

Published Wed, Mar 15 2017 9:35 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

‘సింగరేణి’లో గెలుపే లక్ష్యంగా పావులు - Sakshi

‘సింగరేణి’లో గెలుపే లక్ష్యంగా పావులు

రామకృష్ణాపూర్‌: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందా..? పవర్‌(విద్యుత్‌)పై పట్టు సాధించడం కోసమే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా..? ఆర్‌టీసీ, విద్యుత్‌ రంగాల్లో ఇతర యూనియన్ల ప్రాబాల్యానికి చెక్‌ పెట్టినట్లుగానే సింగరేణిలోనూ ఏకైక సంఘం ప్రాతినిధ్యం వహించేలా కసరత్తు చేస్తోందా..? అన్న ప్రశ్నలకి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విద్యుత్, ఆసరా పింఛన్ల అమలుతో ప్రజల్లో అనూహ్య విశ్వాసాన్ని చూరగొన్న కేసీఆర్‌ ప్రభుత్వం ఇదే తరుణంలో ప్రాధాన్యతమైన విద్యుత్‌ రంగాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకోనుందని విశ్లేషిస్తున్నారు.

కార్మిక సంఘాల మేధావులు. మలుపు తిరగడానికి కారణమవుతున్న సింగరేణి ఎన్నికలు, అధికార పార్టీ అంచనాలపై ప్రత్యేక కథనం ఇది.రోజురోజుకూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికే కీర్తి ప్రదాయిని అయిన సింగరేణిలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలన్న ప్రధాన సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు రాజకీయ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల వాయిదాకు కారణాలు ఏవైనా నేటి పరిస్థితులు మాత్రం ప్రభుత్వానికి ప్రయోజనాలు కల్పించే విధంగానే ఉన్నాయని అంటున్నారు.

తాజా పరిశీలన ప్రకారంగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్‌ విజయం సాధించాలన్నది ప్రభుత్వ పెద్దల తపన. తద్వారా విద్యుత్‌ ఉత్పాదన రంగానికి కీలకమైన బొగ్గును అందించే సింగరేణిని తన ఆధీనంలోకి తీసుకోవాలన్నది ఈ తాపత్రాయం వెనుక ఉన్న అసలు కథగా విశదీకరిస్తున్నారు.

ఎందువల్లనంటే...
ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నాటి నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పేరు తెచ్చింది విద్యుత్‌ రంగం ఒకటైతే.. ఆసరా పింఛన్ల పథకం మరొకటి. నిరంతరం విద్యుత్‌ అందించిన ప్రభుత్వంగా కేసీఆర్‌ ప్రభుత్వం మన్ననలు పొందిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా 200 రూపాయలున్న పించన్‌ మొత్తాన్ని వెయ్యికి పెంచడం ప్రజాదరణను మరింత పెంచింది. కాగా ఈ రెండింటిలో కీలకమైన విద్యుత్‌ రంగంపై ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ రాజకీయ కోణంలో భాగంగానే నిరంతర విద్యుత్‌ అందించాలంటే బొగ్గు అత్యంత అవసరం. బొగ్గు ఉత్పత్తి లేకుండా విద్యుత్‌ ఉత్పాదన అనేది సాధ్యం కాదు. బొగ్గు ఆశించిన విధంగా అందుబాటులో ఉండాలంటే కొత్త ఓపెన్‌కాస్టులు రావాలి. ఓసీలు కావాలంటే ప్రభుత్వ విధానాల్ని ఎదురించే, వ్యతిరేకించే కార్మిక సంఘాలు ఎంతమాత్రం సహేతుకం కాదు. ఈ దరిమిలా ఇతర కార్మిక సంఘాలు లేకుండా చేయాలి. కాల క్రమేణా వాటికి కత్తెర వేయడానికే ప్రభుత్వం రాజకీయ పాచికలు వేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆర్టీసీ, విద్యుత్‌ శాఖల్లాగే...
ప్రభుత్వ అనుబంధ శాఖలైన ఆర్టీసీ, విద్యుత్‌ రంగాల్లో కేసీఆర్‌ ప్రభుత్వం ఇదే రకమైన విధానాన్ని అమలు పరిచింది. దాదాపు ఆర్టీసీలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ మజ్ధూర్‌ యూనియన్‌ తప్ప ఇతర సంఘాల ప్రాబల్యం అంతంత మాత్రమే. అలాగే విద్యుత్‌ శాఖలోనూ వ్యవహరించింది. ఇదేవిధంగా సింగరేణి సంస్థలోనూ తమ యూనియన్‌ మాత్రమే ఉండేలా ఎత్తుగడలు వేస్తున్నదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అనంతరం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలకు మనుగడ కోల్పోయేలా చేసింది కేసీఆర్‌ ప్రభుత్వం. బలమైన ప్రతిపక్షం లేకుండా చేసుకుంది. అలాగే ప్రతిపక్ష కార్మిక సంఘం కూడా ఉండొద్దన్నది  ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని అంటున్నారు.

ఐఎన్‌టీయూసీపై దెబ్బ..?
ప్రభుత్వ ఎత్తుగడలో భాగంగానే జాతీయ కార్మిక సంఘమైన ఐఎన్‌టీయూసీని రాజకీయ కోణంలోనే దెబ్బ తీశారన్న అభిప్రాయాలున్నాయి. వ్యూహాత్మకంగానే వెంకట్రావ్‌ను టీబీజీకేఎస్‌లోకి లాగి ఐఎన్‌టీయూసీకి మనుగడ లేకుండా చేశారని అంటున్నారు. కాగా ఈ మధ్య కాలంలో మరో జాతీయ కార్మిక సంఘం కీలక నేతను సైతం దెబ్బతీసే రాజకీయ కుట్ర సాగినట్లు కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘంలో ఉన్న ఆ జాతీయ స్థాయి నేతపై వ్యూహాత్మక పాచికలు సైతం వేసినట్లు సమాచారం. కీలక నేతల్ని వ్యూహాత్మకంగా దెబ్బతీసి, అనంతరం తమ యూనియన్‌నే అడ్డం పెట్టుకుని ఓసీల రాకకు ఎర్రతివాచీ పరవాలన్నది ప్రభుత్వ యోచనగా నిర్వచిస్తున్నారు.

అనుకూల యూనియన్‌ కోసమే...
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం కోసం పరితపిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణిలో తమకు అనుకూల యూనియన్‌ ఉండడానికే యత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి ఎంత వేగంగా సాగితే విద్యుత్‌ ఉత్పాదన అంతకుమించి జరుగుతుంది.

బొగ్గు ఉత్పత్తి కావాలంటే ఇప్పుడున్న భూగర్భ గనుల వల్ల ససేమిరా అవదు. అనివార్య పరిస్థితుల్లో ఓపెన్‌కాస్టుల్ని చేపట్టాలి. అందుకు విపక్ష యూనియన్లు ఉంటే ప్రభుత్వ విధానాలు త్వరితగతిన అమలయ్యే పరిస్థితులు ఉండవు. కనుకనే తమ అనుబంధ యూనియన్‌ అయిన తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘాన్ని సింగరేణిలో అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని తెలుస్తోంది. అనుకూల యూనియన్‌ తమ విధానాలకు అడ్డు చెప్పబోదని, అటు పిమ్మట ఇబ్బడిముబ్బడిగా ఓసీల్ని తెచ్చి పెట్టాలన్నది ప్రభుత్వ ఆరాటం. తెచ్చిన బొగ్గుతో కరెంట్‌ రంగాన్ని మెరుగుపరిచి ప్రజల మన్ననలు పొందేందేకు కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయో.. బెడిసి కొడతాయో వేచిచూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement