
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కోల్ ఇండియా విద్యుత్, విద్యుత్‌యేతర వినియోగ సంస్థలకు విక్రయించే బొగ్గు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంపు జనవరి 9 నుంచి తక్షణం అమల్లోకి వస్తుందంటూ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన కోల్ ఇండియా.. రేట్ల పెరుగుదల ఎంత ఉంటుందనేది మాత్రం వెల్లడించలేదు. బొగ్గు ధరల పెంపుతో 2017–18లో మిగిలిన వ్యవధిలో కంపెనీకి అదనంగా రూ.1,956 కోట్ల ఆదాయం రావచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ఆదాయం రూ. 6,421 కోట్లు ఉండగలదని కోల్ ఇండియా వెల్లడించింది.
కోల్ ఇండియా గతేడాది మేలో రేటును సగటున 6.3 శాతం పెంచింది. దీంతో 2016–17లో అదనంగా రూ. 3,234 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇక, తాజాగా, రేట్ల పెంపు సుమారు 10 శాతం మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొనగా.. ఈ ప్రభావంతో విద్యుత్ చార్జీలు యూనిట్‌కు కనీసం రూ. 0.50 మేర పెరిగే అవకాశం ఉందని విద్యుదుత్పత్తి సంస్థలు తెలిపాయి. జీ–11, జీ–14 గ్రేడ్ బొగ్గు రేట్ల పెంపు 15–20% మేర ఉండొచ్చని, ఫలితంగా విద్యుత్ యూనిట్ ధర రూ. 0.30–0.50 మేర పెరగవచ్చని ఇండియన్ క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేర్కొంది.
‘జీ–11, జీ–14 గ్రేడ్ బొగ్గు ధరల పెరుగుదల 15–20 శాతం శ్రేణిలో ఉంది. దీనితో విద్యుత్ చార్జీలు యూనిట్‌కి 30–50 పైసల మేర పెరిగే అవకాశం ఉంది‘ అని ఐసీపీపీఏ కార్యదర్శి రాజీవ్ అగర్వాల్ వివరించారు. ఎవాక్యుయేషన్ చార్జీలు (టన్నుకు రూ. 50 చొప్పున), ఉపరితల రవాణా చార్జీలు మొదలైన వాటి పేరిట పరోక్షంగా ఇప్పటికే 12–18 శాతం దాకా భారం పడుతుండగా.. తాజా పెంపు మరింత భారం అవుతుందని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే ఇంధన ధరలు తగ్గాలని.. కానీ కోల్ ఇండియా, ఆ సంస్థ సిబ్బంది అసమర్ధత, దాని వ్యయాలు, నష్టాల తీరు మొదలైనవన్నీ దేశానికి గుదిబండగా మారుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు, కోల్ ఇండియా ఏకపక్షంగా బొగ్గు రేట్లు పెంచేయడం వల్ల విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 25–30 పైసల మేర పెరుగుతాయని విద్యుత్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ (ఎపీపీ) డైరెక్టర్ జనరల్ అశోక్ ఖురానా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment