కోల్ ఇండియా విభజనకు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: దేశీయ బొగ్గురంగంలో నెలకొన్నగుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇంధన భద్రత సమీక్షించి కోల్ ఇండియా మోనో పలికి చెక్ పెట్టే బాధ్యతను సీనియర్ భారత ప్రభుత్వ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై ఒక సంవత్సరంలోగా ఈ సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద కోల్ మైనర్ కోల్ఇండియా లిమిటెడ్‌ను విభజించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ రంగంలో మోనోపలీ పెరిగిపోయిందని.. దీన్ని తగ్గించేందుకే ఈ చర్య తీసుకోనున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పినట్టు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ఇండియాను.. కేంద్రం ఏడు కంపెనీలుగా విభజించాలని భావిస్తోంది. ఈ రంగంలో మరింత పోటీ పెరగాలన్నా, ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నా ఇది తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు నవంబరు 30 న ప్రధాని ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ప్రధాని నిర్ణయం ఆధారంగా మంత్రిత్వ శాఖ తన వైఖరిని సమీక్షించనుందని బొగ్గు మంత్రి పియూష్ గోయల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు కోల్ ఇండియా విభజనను కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధమైనా.. కోల్ఇండియా లాంటి అతి పెద్ద సంస్థను విడదీయడం అంత సులభం కాదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు కుదింపు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రాధాన్యత లాంటి అంశాలు కార్మికులకు ఆందోళనకరంగా మారనున్నాయన్నారు. అయితే ఈ అంచనాలపై ఆల్ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. చిన్న కంపెనీల నిర్వహణ సులభం అవుతుందని ఫెడరేషన్ ప్రతినిధి డీడీ రామానందన్ వ్యాఖ్యానించారు.
కాగా కోల్ఇండియా విభజనపై ప్రధాని పగ్గాలు చేపట్టగానే మోడీ ఆరా తీశారని తెలుస్తోంది. ఈ చర్య ద్వారా మరింత సమర్ధవంతమైన మెరుగైన పని తీరును రాబట్టవచ్చని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 2014 లో కోల్ ఇండియా విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే కార్మిక సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గింది. ఈ తాజా ప్రతిపాదన 28 బిలియన్ డాలర్ల స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కోల్ ఇండియా చీలికకు దారి తీస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. మరోవైపు ఉత్పత్తిని పెంచేందుకు కోల్ ఇండియా కొత్త సాంకేతిక మెషినరీ కొనుగోలుకు బిలియన్ల డాలర్ల రూపాయలను వెచ్చిస్తోంది.