ఆరో అతిపెద్ద మైనింగ్ సంస్థగా కోల్ ఇండియా
న్యూఢిల్లీ: కోల్ ఇండియా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద మైనింగ్ కంపెనీగా అవతరించిందని సీడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా రూపొందించిన గ్లోబల్ టాప్-40 మైనింగ్ సంస్థల జాబితాలో ఇదివరకు 8వ స్థానంలో ఉన్న కోల్ ఇండియా ప్రస్తుతం ఆరో స్థానానికి ఎగబాకింది. అలాగే ఎన్‌ఎండీసీ స్థానం కూడా 24 నుంచి 21కి మెరుగుపడింది. 2013లో 947 బిలియన్ డాలర్లుగా ఉన్న టాప్-40 మైనింగ్ సంస్థల మార్కెట్ క్యాపిటల్ గతేడాది చివరకు 16 శాతం క్షీణతతో (156 బిలియన్ డాలర్లు) 791 బిలియన్ డాలర్లకు తగ్గింది.
అధిక ఉత్పత్తి, ప్రతికూల డిమాండ్ అంచనాల వల్ల ఐరన్ ఓర్ కంపెనీలు గతేడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఇదే సమయంలో బ్రిక్స్ దేశాల్లో కోల్ మైనింగ్ సంస్థల మార్కెట్ విలువదాదాపు 19 శాతం పెరిగింది. టాప్-40 సంస్థల్లో 15 సంస్థల షేరు ధరలు పెరిగితే, మిగిలిన 25 సంస్థల షేరు ధరలు తగ్గాయి. చాలా సంస్థల సగటు ఆర్‌ఓసీఈ (రిటర్న్ ఆన్ క్యాపిట ల్ ఎంప్లాయిడ్) 15 శాతం ఇన్వెస్ట్‌మెంట్ రేటుకు దిగువునే ఉంది.