Mining company
-
లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతున్న వేళ ఒక లేడీ బాస్ తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇచ్చి సంస్థ ఉద్యోగులనే కాదు, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా 10 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు 80-82 లక్షల రూపాయల 'క్రిస్మస్ బోనస్' ప్రకటించడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆ మహిళా బాస్ పేరు గినా రైన్‌హార్ట్. 34 బిలియన్ల డాలర్ల నికర సంపదతో ఆస్ట్రేలియాలో టాప్ బిలియనీర్. ఆస్ట్రేలియాలోపనిచేస్తున్న ప్రధాన కంపెనీలలో ఒకటి రాయ్ హిల్. ఆమె తండ్రి స్థాపించిన మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీ హాన్కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ కి జార్జినా (గినా) రైన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. తన వ్యాపార దక్షతతో మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచి, ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ మంచి లాభాలతో నడుస్తుండటం గమనార్హం. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) అయితే రైన్‌హార్ట్ తన ఉద్యోగులకు ముఖ్యమైన ప్రకటన కోసం సిద్ధంగా ఉండమని ప్రటకించారు.ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో 10 మంది పేర్లను పిలవ బోతున్నట్లు ప్రకటించారు. అసలే దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ముఖ్యమైన ప్రకటన అనగానే అందరూ బెంబేలెత్తిపోయారు. సడెన్‌గా ఆ పదిమందికి లక్ష డాలర్లు బోనస్ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర ఉద్యోగులకు కూడా లక్షల్లో బోనస్ ప్రకటించారు. దీంతో ఉద్యోగులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. బోనస్ పొందిన వారిలో ఒకరు మూడు నెలల క్రితమే కంపెనీలో చేరడం విశేషం. కాగా కంపెనీ గత 12 నెలల్లో 3.3 బిలియన్ల డాలర్లు (రూ. 190 బిలియన్లకు పైగా) లాభాన్ని ఆర్జించి నందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు గినా. కంపెనీ లాభాలు దేశానికి కూడా ఉపయోగ పడ్డాయని, అందుకే ఈ కానుక అని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్వేగానికి గురి కావడం ఉద్యోగుల వంతైంది. -
Telangana: సుశీ సంస్థల్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థపై రాష్ట్ర వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని సుశీ ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థ, అనుబంధ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న కొందరి ఇళ్లపై దాడులు జరిగాయి. సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్‌మైన్స్ సంస్థల్లో కూడా సోదాలు నిర్వహించారు. పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. 100 మందికి పైగా అధికారులు 25 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, సీపీయూ, హార్డ్ డిస్‌్కలను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. పన్ను చెల్లింపు లావాదేవీలు, పన్ను ఎగవేత సంబంధిత అంశాలు పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించినట్టు జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. దాడులకు సంబంధించిన వివరాలపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగగా, మంగళవారం కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశమున్నట్టు పన్నుల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత..! సుశీ ఇన్ఫ్రా సంస్థకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడు సంకీర్త్‌రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి సుశీ ఇన్ఫ్రా కంపెనీ అకౌంట్ నుంచి పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించారనే ఆరోపణలు వచ్చాయి. మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎవరెవరికి ఎంత నగదు సుశీ అకౌంట్ నుంచి వెళ్లిందనే వివరాలతో కూడిన డాక్యుమెంట్ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఆ ఖాతా నుంచి డబ్బు వెళ్లిందనడంలో వాస్తవం లేదని సుశీ ఇన్ఫ్రాతో పాటు రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు ఖండించారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత ఇప్పుడు సుశీ ఇన్ఫ్రాపై జీఎస్టీ అధికారులు దాడులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈడీ దాడులు జరిగిన కొద్ది రోజులకే.. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత రాష్ట్రంలోని పలు మైనింగ్ కంపెనీలపై ఈడీ దాడులు జరిగాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశారని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా సుశీ సంస్థల్లో రాష్ట్ర జీఎస్టీ అధికారుల దాడులు చేయడంతో.. టిట్ ఫర్ టాట్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని అధికారుల చేత రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో తనిఖీలు చేయించిందా? అనే చర్చ జరుగుతోంది. రాజకీయ కోణం లేదంటున్న జీఎస్టీ శాఖ సుశీ సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో రాజకీయ కోణం లేదని పన్నుల శాఖ వర్గాలంటున్నాయి. ఈ తనిఖీలపై ఎలాంటి ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్న అధికారులు.. రాజకీయ ఆరోపణలను మాత్రం కొట్టిపారేస్తున్నారు. కాంట్రాక్టు వ్యాపారంలో ఉన్న సుశీ ఇన్ఫ్రా కూడా జీఎస్టీ డీలరేనని, రాష్ట్రంలోని ఏ డీలర్ (వ్యాపారి) కూడా పన్ను ఎగ్గొట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉంటుందని, అందులో భాగంగానే సుశీ ఇన్ఫ్రాలో కూడా తనిఖీలు చేశామని చెబుతున్నారు. పన్ను చెల్లింపు లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా? రిటర్నులు సకాలంలో ఫైల్ చేస్తున్నారా లేదా? పన్ను ఎగవేతకు ఎక్కడైనా ఆస్కారాలున్నాయా? అనే కోణంలోనే తనిఖీలు జరుపుతున్నామని అంటున్నారు. పన్నుల శాఖకు చెందిన అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సీటీవో స్థాయి అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నట్టు సమాచారం. కాగా ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలోని అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిసింది. -
బుర్కినా ఫాసోలో దాడి.. 37 మంది మృతి
ఔగాడోగ్: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దారుణం చోటుచేసుకుంది. కెనడియన్ మైనింగ్ కంపెనీ సెమాఫోలో పనిచేస్తున్న ఉద్యోగులే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 37 మంది మరణించగా.. 60 మందికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం సెమాఫో కంపెనీ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సప్లయర్స్‌తో వెళ్తున్న ఐదు బస్సులను సాయు«ధులు అడ్డుకుని కాల్పులకు తెగబడ్డారు. బుర్కినా ఫాసోలో జిహాదీలు పాల్పడుతున్న హింసలో 700 మంది మృతి చెందారు. -
రెండో రోజూ..
తూర్పుగోదావరి, ప్రత్తిపాడు రూరల్: మండలంలో ఆరళ్లదార అటవీ ప్రాంతంలో అధికార పార్టీ అండదండలతో ఏళ్ల తరబడి గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న లేటరైట్ అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు ఇన్‌కంట్యాక్స్ (ఐటీ) అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఏకతాటిగా ఐటీ సోదాలు కొనసాగాయి. సోమవారం కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పది మంది ఐటీ అధికారుల బృందం ఆరళ్లధారలోని ఆండ్రూ మినరల్స్ మైనింగ్ యార్డులోని సంస్థ కార్యాలయాన్ని,ప్రతినిధులను వారి ఆధీనంలోకి తీసుకొని కీలక సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. తాళాలను పగలు కొట్టి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. రెండు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్ కార్యకలాపాలపై ఐటీ అధికారులు కూపీలాగుతున్నారు. మండలంలోని గిరిజనాపురం అటవీ ప్రాంతంలో 200 ఎకరాల్లో ఆండ్రూ మినరల్స్ మైనింగ్ సంస్థ లీజులు పొంది 2014లో తవ్వకాలను ప్రారంభించింది. అప్పటి నుండి ఇక్కడ అధికార పార్టీ అండతో భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులు మైనింగ్ కార్యకలాపాలపై కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఐటీ సోదాలతోనైన జరిగిన అక్రమాలు బయటకు వస్తాయనే చర్చ స్థానికంగా జరుగుతోంది. గత ఏడాది రవాణా చేసే లేటరైట్ ఖనిజ సంపద వివరాలు సేకరించాలనే ఉద్దేశంతో స్థానిక రెవెన్యూ అధికారులు ప్రత్యేక ఠాణాను మైనింగ్ యార్డులో ఏర్పాటు చేశారు. దానిని కొద్ది రోజులు మాత్రమే నిర్వహించి ఎత్తివేశారు. వంతాడ, గజ్జనపూడి అటవీ ప్రాంతంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 2015లో అప్పటి పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి పీఏసీ సభ్యుల బృందం పర్యటించింది. మైనింగ్ ప్రాంతంలో గ్రామ సభను ఏర్పాటు చేసి నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జరిగిన అక్రమాలపై మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను తీరుపై పీఏసీ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మైనింగ్ యార్డులో అధికారులు వేబ్రిడ్జి ఏర్పాటు చేసి తరలివెళుతున్న ఖనిజ సంపద వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. మండలంలోని ఆండ్రూ మినరల్స్ మైనింగ్ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆ చర్యలు తీసుకొన్న దాఖలాలులేవు. ప్రస్తుతం ఆ సంస్థలో జరుగుతున్న ఐటీ దాడులపై సర్వత్రా చర్చ జరుగుతుంది. -
ముడి ఇనుము సంస్థలకు రేట్ల కష్టాలు
దశాబ్ద కనిష్టానికి ముడి ఇనుము ధరలు ఇంకా పడిపోతాయని ఆందోళనలో మైనింగ్ కంపెనీలు న్యూఢిల్లీ: ముడి ఇనుము ధరలు దశాబ్ద కనిష్టానికి పడిపోవడం మైనింగ్ సంస్థల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా తక్కువ గ్రేడ్ ముడి ఇనుమును ఎగుమతి చేసే గోవా ఉత్పత్తిదారుల్లో ఆందోళన నెలకొంది. సరైన చర్యలు లేకపోతే వచ్చే ఏడాది కాలంలో రేట్లు మరింత పడిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. గోవాలో ప్రధానంగా తక్కువ రకం గ్రేడ్ ముడి ఇనుము (ఇనుము శాతం 55-58 శాతం ఉండేది) ఉత్పత్తవుతుంది. దీన్ని ఎక్కువగా చైనా, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఈ తరహా ముడి ఇనుము టన్నుకు రేటు 29 డాలర్ల స్థాయికి పడిపోయింది. దాదాపు దశాబ్దం క్రితం 2003-04లో ఈ రేట్లు ఉండేవని గోవా మినరల్ ఓర్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ (జీఎంవోఈఏ) ప్రెసిడెంట్ శివానంద్ వి. సల్గావ్కర్ తెలిపారు. అటు అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ నుంచి డిమాండ్ మందగించడం, ఇటు భారీ పన్నులు మైనింగ్ కార్యకలాపాలను కుదేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉక్కు తయారీలో కీలకమైన ముడి ఇనుము రేట్లు మరింతగా పడిపోతాయని మైనింగ్ సంస్థల్లో తీవ్ర ఆందోళన నెలకొందని సల్గావ్కర్ తెలిపారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బైటపడటానికి మైనింగ్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయంగా మరింత మెరుగైన గ్రేడ్ ముడి ఇనుము చౌకగా లభిస్తున్నందున.. గోవా కంపెనీల నుంచి తక్కువ గ్రేడ్ ఖనిజాన్ని కొనేందుకు ఎవరు ముందుకొస్తారని జీఎంవోఈఏ గౌరవ కార్యదర్శి అంబర్ టింబ్లో వ్యాఖ్యానించారు. ఇది ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. అధిక పన్నులు ఇలాగే కొనసాగితే మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించడం ఎంత మాత్రం లాభసాటి కాదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గోవాలో మైనింగ్ రంగాన్ని ఆదుకోవాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎగుమతి పన్నులను, ఇతరత్రా పన్నులను తొలగించాలని తెలిపాయి. ఎగుమతి పన్నులు, గోవా పర్మనెంట్ ఫండు తొలగిస్తే టన్నుకు ఉత్పత్తి ధర దాదాపు 4.5 డాలర్ల మేర తగ్గగలదని టింబ్లో తెలిపారు. -
ఆరో అతిపెద్ద మైనింగ్ సంస్థగా కోల్ ఇండియా
న్యూఢిల్లీ: కోల్ ఇండియా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద మైనింగ్ కంపెనీగా అవతరించిందని సీడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా రూపొందించిన గ్లోబల్ టాప్-40 మైనింగ్ సంస్థల జాబితాలో ఇదివరకు 8వ స్థానంలో ఉన్న కోల్ ఇండియా ప్రస్తుతం ఆరో స్థానానికి ఎగబాకింది. అలాగే ఎన్ఎండీసీ స్థానం కూడా 24 నుంచి 21కి మెరుగుపడింది. 2013లో 947 బిలియన్ డాలర్లుగా ఉన్న టాప్-40 మైనింగ్ సంస్థల మార్కెట్ క్యాపిటల్ గతేడాది చివరకు 16 శాతం క్షీణతతో (156 బిలియన్ డాలర్లు) 791 బిలియన్ డాలర్లకు తగ్గింది. అధిక ఉత్పత్తి, ప్రతికూల డిమాండ్ అంచనాల వల్ల ఐరన్ ఓర్ కంపెనీలు గతేడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఇదే సమయంలో బ్రిక్స్ దేశాల్లో కోల్ మైనింగ్ సంస్థల మార్కెట్ విలువదాదాపు 19 శాతం పెరిగింది. టాప్-40 సంస్థల్లో 15 సంస్థల షేరు ధరలు పెరిగితే, మిగిలిన 25 సంస్థల షేరు ధరలు తగ్గాయి. చాలా సంస్థల సగటు ఆర్ఓసీఈ (రిటర్న్ ఆన్ క్యాపిట ల్ ఎంప్లాయిడ్) 15 శాతం ఇన్వెస్ట్మెంట్ రేటుకు దిగువునే ఉంది. -
‘గూడెం’లో మైనింగ్ యూనివర్సిటీ
కొత్తగూడెం(ఖమ్మం) : దక్షిణ భారతదేశంలో గుర్తింపు కలిగిన సింగరేణి సంస్థతో పాటు దేశంలోని వివిధ మైనింగ్ కంపెనీలకు మూడు దశాబ్దాలుగా ఎంతో మంది మైనింగ్ ఇంజినీర్లను అందించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలను మైనింగ్ యూనివర్సిటీగా మారనుంది. దీంతో ఇప్పటి వరకు సమస్యలతో సతమతమవుతున్న ఇంజినీరింగ్ కళాశాలకు కొత్త హంగులు చేరనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా టాస్క్‌ఫోర్స్, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) సైతం ఈ కళాశాలను మైనింగ్ యూనవర్సిటీగా మార్చాలని ప్రతిపాదనలు అందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా మూడు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం కొత్తగూడెం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను మైనింగ్ యూనివర్సిటీగా మార్చడానికి రూ.55 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింగరేణిలో బొగ్గుబావులు ఉండటం.. ఈ ప్రాంతం మైనింగ్ ఇంజినీరింగ్‌కు అనువుగా ఉండటం.. గనులకు ప్రధాన కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ మైనింగ్ కళాశాలను 1978లో ఏర్పాటు చేశారు. కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌గా ఈ కళాశాలకు నామకరణం చేశారు. 390 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు రేకుల షెడ్డులో తాత్కాలికంగా ల్యాబ్‌లు, తరగతి గదులు నిర్మించారు. 1986లో విద్యార్థుల కోసం హాస్టల్ భవన నిర్మాణం చేపట్టారు. అనంతరం 1994లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మైనింగ్, కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చారు. అప్పటి నుంచి కళాశాలను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా పిలుస్తున్నారు. ప్రారంభంలో కేవలం మైనింగ్ స్కూల్‌గా ఉన్న ఈ కళాశాలలో తర్వాత క్రమంలో మైనింగ్‌తో పాటు ఈసీఈ, ఈఈఈ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులను ప్రవేశపెట్టారు. తీరనున్న సమస్యలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కళాశాలను తరలించేందుకు తాత్కాలికంగా రేకుల షెడ్లతో నిర్మించిన గదులనే నేటికీ తరగతి గదులుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిలోనే ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. అవికూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వెంటిలేషన్ ల్యాబ్, సర్వే ల్యాబ్, మినరల్ ప్రాసెసింగ్ ల్యాబ్, మైనింగ్ సేఫ్టీ ఇంజినీరింగ్ ల్యాబ్, రాక్ మెకానిక్స్ ల్యాబ్, మైనింగ్ మ్యాచనరీ ల్యాబ్, మైనింగ్ ల్యాబ్‌లు ప్రస్తుతం వాడకంలో లేవు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మూడేళ్లుగా కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. దీనికి తోడు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ కళాశాలను మైనింగ్ యూనివర్సిటీగా మార్చాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూడు దశాబ్దాల క్రితం ఏర్పడిన ఈ కళాశాల సమస్యలు తీరనున్నాయి.