కొత్తగూడెం(ఖమ్మం) : దక్షిణ భారతదేశంలో గుర్తింపు కలిగిన సింగరేణి సంస్థతో పాటు దేశంలోని వివిధ మైనింగ్ కంపెనీలకు మూడు దశాబ్దాలుగా ఎంతో మంది మైనింగ్ ఇంజినీర్లను అందించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలను మైనింగ్ యూనివర్సిటీగా మారనుంది. దీంతో ఇప్పటి వరకు సమస్యలతో సతమతమవుతున్న ఇంజినీరింగ్ కళాశాలకు కొత్త హంగులు చేరనున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా టాస్క్‌ఫోర్స్, రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) సైతం ఈ కళాశాలను మైనింగ్ యూనవర్సిటీగా మార్చాలని ప్రతిపాదనలు అందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా మూడు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం కొత్తగూడెం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను మైనింగ్ యూనివర్సిటీగా మార్చడానికి రూ.55 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
సింగరేణిలో బొగ్గుబావులు ఉండటం.. ఈ ప్రాంతం మైనింగ్ ఇంజినీరింగ్‌కు అనువుగా ఉండటం.. గనులకు ప్రధాన కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ మైనింగ్ కళాశాలను 1978లో ఏర్పాటు చేశారు. కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌గా ఈ కళాశాలకు నామకరణం చేశారు. 390 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు రేకుల షెడ్డులో తాత్కాలికంగా ల్యాబ్‌లు, తరగతి గదులు నిర్మించారు. 1986లో విద్యార్థుల కోసం హాస్టల్ భవన నిర్మాణం చేపట్టారు. అనంతరం 1994లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మైనింగ్, కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చారు. అప్పటి నుంచి కళాశాలను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా పిలుస్తున్నారు. ప్రారంభంలో కేవలం మైనింగ్ స్కూల్‌గా ఉన్న ఈ కళాశాలలో తర్వాత క్రమంలో మైనింగ్‌తో పాటు ఈసీఈ, ఈఈఈ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులను ప్రవేశపెట్టారు.
తీరనున్న సమస్యలు
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కళాశాలను తరలించేందుకు తాత్కాలికంగా రేకుల షెడ్లతో నిర్మించిన గదులనే నేటికీ తరగతి గదులుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిలోనే ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. అవికూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వెంటిలేషన్ ల్యాబ్, సర్వే ల్యాబ్, మినరల్ ప్రాసెసింగ్ ల్యాబ్, మైనింగ్ సేఫ్టీ ఇంజినీరింగ్ ల్యాబ్, రాక్ మెకానిక్స్ ల్యాబ్, మైనింగ్ మ్యాచనరీ ల్యాబ్, మైనింగ్ ల్యాబ్‌లు ప్రస్తుతం వాడకంలో లేవు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో మూడేళ్లుగా కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. దీనికి తోడు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ కళాశాలను మైనింగ్ యూనివర్సిటీగా మార్చాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూడు దశాబ్దాల క్రితం ఏర్పడిన ఈ కళాశాల సమస్యలు తీరనున్నాయి.
‘గూడెం’లో మైనింగ్ యూనివర్సిటీ
Published Thu, Dec 11 2014 3:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement