ఆరళ్లదారలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్న ఆండ్రూ మినరల్స్ సంస్థ కార్యాలయం
తూర్పుగోదావరి, ప్రత్తిపాడు రూరల్: మండలంలో ఆరళ్లదార అటవీ ప్రాంతంలో అధికార పార్టీ అండదండలతో ఏళ్ల తరబడి గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న లేటరైట్ అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు ఇన్‌కంట్యాక్స్ (ఐటీ) అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఏకతాటిగా ఐటీ సోదాలు కొనసాగాయి. సోమవారం కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పది మంది ఐటీ అధికారుల బృందం ఆరళ్లధారలోని ఆండ్రూ మినరల్స్ మైనింగ్ యార్డులోని సంస్థ కార్యాలయాన్ని,ప్రతినిధులను వారి ఆధీనంలోకి తీసుకొని కీలక సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. తాళాలను పగలు కొట్టి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. రెండు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్ కార్యకలాపాలపై ఐటీ అధికారులు కూపీలాగుతున్నారు. మండలంలోని గిరిజనాపురం అటవీ ప్రాంతంలో 200 ఎకరాల్లో ఆండ్రూ మినరల్స్ మైనింగ్ సంస్థ లీజులు పొంది 2014లో తవ్వకాలను ప్రారంభించింది. అప్పటి నుండి ఇక్కడ అధికార పార్టీ అండతో భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులు మైనింగ్ కార్యకలాపాలపై కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఐటీ సోదాలతోనైన జరిగిన అక్రమాలు బయటకు వస్తాయనే చర్చ స్థానికంగా జరుగుతోంది.
గత ఏడాది రవాణా చేసే లేటరైట్ ఖనిజ సంపద వివరాలు సేకరించాలనే ఉద్దేశంతో స్థానిక రెవెన్యూ అధికారులు ప్రత్యేక ఠాణాను మైనింగ్ యార్డులో ఏర్పాటు చేశారు. దానిని కొద్ది రోజులు మాత్రమే నిర్వహించి ఎత్తివేశారు. వంతాడ, గజ్జనపూడి అటవీ ప్రాంతంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 2015లో అప్పటి పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి పీఏసీ సభ్యుల బృందం పర్యటించింది. మైనింగ్ ప్రాంతంలో గ్రామ సభను ఏర్పాటు చేసి నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జరిగిన అక్రమాలపై మైనింగ్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను తీరుపై పీఏసీ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మైనింగ్ యార్డులో అధికారులు వేబ్రిడ్జి ఏర్పాటు చేసి తరలివెళుతున్న ఖనిజ సంపద వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. మండలంలోని ఆండ్రూ మినరల్స్ మైనింగ్ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆ చర్యలు తీసుకొన్న దాఖలాలులేవు. ప్రస్తుతం ఆ సంస్థలో జరుగుతున్న ఐటీ దాడులపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment