మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత చిక్కాల గణేష్ ఇంటి వద్ద డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న ఐటీ అధికారులు
అమలాపురంలో ఐటీ దాడులు సంచలనం కలిగించాయి. పట్టణంలోని ఐదుగురు ప్రముఖుల ఇళ్లపై గురువారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. నెలరోజుల వ్యవధిలో పట్టణంలో మరోసారి ఈ దాడులు జరిగాయి. ఈ సోదాలు రాత్రి కూడా కొనసాగాయి.
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన ఐదుగురు ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారులు గురువారం ఉదయం ఆకస్మికంగా దాడి చేశారు. అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు చిక్కాల గణేష్, మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు ఆశెట్టి ఆదిబాబు, మరో టీడీపీ నాయకుడు తిక్కిరెడ్డి సురేష్‌తో పాటు పట్టణం సమీపంలోని ఈదరపల్లికి చెందిన బీవీవీ ఇంజినీరింగ్ విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య, జర్నలిస్టు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ ఎమ్మెన్వీ ప్రసాద్ ఇళ్లపై ఐటీ సోదాలు ఉదయం నుంచి రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ ఐదుగురు ప్రత్యక్ష, పరోక్ష భాగస్వాములుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం భూములను కొనుగోలు చేశారు. గత నెలలో అమలాపురానికి చెందిన టీడీపీ నేతలైన ముగ్గురు అన్నదమ్ముల ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే.
ఆ దాడుల సమయంలోనే పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం కొనుగోలు చేసిన వ్యక్తులు, భూముల సమాచారం ఐటీ అధికారులకు లభించినట్టు తెలిసింది. ఆ సమాచారంతోనే ఐటీ అధికారులు ఈ ఐదుగురు రియల్టర్ల ఇళ్లపై దాడి చేసినట్టు సమాచారం. ఈ అయిదుగురిలో బోనం కనకయ్య ఓ ఫైనాన్సర్‌గానే కాకుండా రియల్ వ్యాపారాల్లో భాగస్వామి అని ఐటీ అధికారులు గుర్తించారు. గత నెలలలో అన్నదమ్ములైన ముగ్గురు టీడీపీ నాయకుల ఇళ్లపైన, ఇప్పుడు టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకుడు చిక్కాలగణేష్, కౌన్సిలర్ ఆదిబాబు, సురేష్ ఇళ్లపై ఐటీ దాడులు జరగడం పట్టణ టీడీపీలోనే కాకుండా ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈ ఐదుగురు ఇళ్లలోను లభించిన డాక్యుమెంట్లను అధికారులు నిశితంగా పరిశీలించారు. వాటిలో కీలకమైన డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌కం ట్యాక్స్, అపరాధ రుసుముతో సహా లెక్కలు కట్టి రియల్టర్ల నుంచి ఆ సొమ్ములు కట్టించుకునే దిశగా రికార్డులు తయారు చేస్తున్నట్టు తెలిసింది. దాడులకు దిగే ముందు ఐటీ అధికారులు రియల్టర్ల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం ఐటీ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది సిబ్బంది ఈ దాడులను నిర్వహించారు. ఈ ఐదుగురిలో ఇద్దరి ఇళ్లలో శుక్రవారం కూడా సోదాలు కొనసాగవచ్చని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment