ముడి ఇనుము సంస్థలకు రేట్ల కష్టాలు
దశాబ్ద కనిష్టానికి ముడి ఇనుము ధరలు
ఇంకా పడిపోతాయని ఆందోళనలో మైనింగ్ కంపెనీలు
న్యూఢిల్లీ: ముడి ఇనుము ధరలు దశాబ్ద కనిష్టానికి పడిపోవడం మైనింగ్ సంస్థల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా తక్కువ గ్రేడ్ ముడి ఇనుమును ఎగుమతి చేసే గోవా ఉత్పత్తిదారుల్లో ఆందోళన నెలకొంది. సరైన చర్యలు లేకపోతే వచ్చే ఏడాది కాలంలో రేట్లు మరింత పడిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. గోవాలో ప్రధానంగా తక్కువ రకం గ్రేడ్ ముడి ఇనుము (ఇనుము శాతం 55-58 శాతం ఉండేది) ఉత్పత్తవుతుంది. దీన్ని ఎక్కువగా చైనా, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఈ తరహా ముడి ఇనుము టన్నుకు రేటు 29 డాలర్ల స్థాయికి పడిపోయింది. దాదాపు దశాబ్దం క్రితం 2003-04లో ఈ రేట్లు ఉండేవని గోవా మినరల్ ఓర్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ (జీఎంవోఈఏ) ప్రెసిడెంట్ శివానంద్ వి. సల్గావ్‌కర్ తెలిపారు.
అటు అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ నుంచి డిమాండ్ మందగించడం, ఇటు భారీ పన్నులు మైనింగ్ కార్యకలాపాలను కుదేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉక్కు తయారీలో కీలకమైన ముడి ఇనుము రేట్లు మరింతగా పడిపోతాయని మైనింగ్ సంస్థల్లో తీవ్ర ఆందోళన నెలకొందని సల్గావ్‌కర్ తెలిపారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బైటపడటానికి మైనింగ్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయంగా మరింత మెరుగైన గ్రేడ్ ముడి ఇనుము చౌకగా లభిస్తున్నందున.. గోవా కంపెనీల నుంచి తక్కువ గ్రేడ్ ఖనిజాన్ని కొనేందుకు ఎవరు ముందుకొస్తారని జీఎంవోఈఏ గౌరవ కార్యదర్శి అంబర్ టింబ్లో వ్యాఖ్యానించారు. ఇది ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు.
అధిక పన్నులు ఇలాగే కొనసాగితే మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించడం ఎంత మాత్రం లాభసాటి కాదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గోవాలో మైనింగ్ రంగాన్ని ఆదుకోవాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎగుమతి పన్నులను, ఇతరత్రా పన్నులను తొలగించాలని తెలిపాయి. ఎగుమతి పన్నులు, గోవా పర్మనెంట్ ఫండు తొలగిస్తే టన్నుకు ఉత్పత్తి ధర దాదాపు 4.5 డాలర్ల మేర తగ్గగలదని టింబ్లో తెలిపారు.