కోల్ ఇండియా సబ్సిడరీల వికేంద్రీకరణ..! | Coal India undermined by basic equipment flaws | Sakshi
Sakshi News home page

కోల్ ఇండియా సబ్సిడరీల వికేంద్రీకరణ..!

Published Wed, Jul 30 2014 12:48 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

కోల్ ఇండియా సబ్సిడరీల వికేంద్రీకరణ..! - Sakshi

కోల్ ఇండియా సబ్సిడరీల వికేంద్రీకరణ..!

గోదావరిఖని: కోల్ ఇండియాను వికేంద్రీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దేశంలో బొగ్గు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో కోల్ ఇండియాలోని ఏడు సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకుని వాటిని ఆయా రాష్ట్రాలకే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
 
ప్రస్తుతం కోల్ ఇండియా పరిధిలో జార్ఖండ్‌లో బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిడెట్), సీసీఎల్ (సెంట్రల్ కోల్ లిమిటెడ్), పశ్చిమబెంగాల్‌లో ఈసీఎల్ (ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్), ఒడిశాలో ఎంసీఎల్ (మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్), మధ్యప్రదేశ్‌లో ఎన్‌సీఎల్ (నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్), ఛత్తీస్‌గఢ్‌లో ఎస్‌ఈసీఎల్ (సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్), మహారాష్ట్రలోని డబ్ల్యూసీఎల్ (వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్) సంస్థలు బొగ్గు ఉత్పత్తి సాగిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ కోల్‌కతా కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి.
 
దేశంలో బొగ్గు కొరత..: ఆరు రాష్ట్రాల్లో కోల్ ఇండియా ఏడు సబ్సిడరీ సంస్థలకు చెందిన 272 భూగర్భ గనులు, 168 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా ఏటా 450 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. దేశ అవసరాలకు సుమారు 600 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం అవుతుండగా, 150 మిలియన్ టన్నుల బొగ్గు కొరత ఉంది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతంలో 119 కోల్‌బ్లాక్‌లను క్యాప్టివ్‌మైన్స్ (ఆయా కంపెనీలు తమ అవసరాల కోసం బొగ్గును వెలికితీయడం)గా మార్పు చేసింది. కానీ, తమకు కేటాయించిన గనుల్లో చాలా కంపెనీలు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేదు. టెండర్లు లేకుండా ప్రైవేట్ కంపెనీలకు కోల్‌బ్లాక్‌లను అప్పగించడంపై ఆరోపణలు రావడంతో కొన్ని బ్లాక్‌లను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తి ఆశించిన మేర జరగలేదు.
 
ఆయా రాష్ట్రాల్లో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గనులను ప్రారంభించేందుకు ప్రజలు సహకరించకపోవడం పెద్ద సమస్యగా మారింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రక్రియకు సహకరించ ని పరిస్థితి. దీంతో నరేంద్రమోడీ ప్రభుత్వం కోల్ ఇండియాలోని సబ్సిడరీ సంస్థలను వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కొత్త గనుల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి ఇప్పించినప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ వంటి పనులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ కోల్ ఇండియాలోని సంస్థల్లో ఆయా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
 
అదే కోవలోకి సింగరేణి..?
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49%వాటా ఉంది. దీనిపై 51% వాటా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కోల్ ఇండియా సబ్సిడరీ సంస్థలకు ఇచ్చిన విధంగానే 49% వాటాలో మరికొంత వాటాను తెలంగాణ రాష్ట్రానికి విక్రయించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ఈ విషయమై సీఎం కేసీఆర్ కేంద్రం వద్ద ఈ ప్రతిపాదన తీసుకురాగా, సానుకూలత వ్యక్తమైనట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వం వాటాను పూర్తిగా కొనుగోలు చేసి రాష్ట్ర పరిధిలోకి తీసుకురావాలంటూ ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం.  సింగరేణి సంస్థ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.12,300 కోట్లుగా అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement