
స్టాక్స్ వ్యూ
కోల్ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్, ప్రస్తుత ధర: రూ.288
టార్గెట్ ధర: రూ.340
ఎందుకంటే: కోల్ ఇండియా..ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీల్లో ఒకటి. అపారంగా బొగ్గు నిల్వలున్నాయి. 88.4 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ప్రస్తుతం 413 గనులను నిర్వహిస్తోంది. విద్యుత్తు, ఉక్కు, సిమెంట్, రక్షణ, ఎరువులు, తదితర రంగాలకు బొగ్గు సరఫరా చేస్తోంది. భారత్‌లో ఉత్పత్తవుతున్న బొగ్గులో 85 శాతం వాటా, అమ్మకాల్లో 65 శాతం వాటా ఈ కంపెనీదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఉద్యోగుల వ్యయాలు అధికంగా ఉండడం, ఈ–వేలం ఆశించిన స్థాయిలో లేకపోవడం దీనికి కారణాలు. ఈ కంపెనీ రూ.16,212 కోట్ల నికర నిర్వహణ ఆదాయం ఆర్జించింది. ఇబిటా రూ.743 కోట్లుగా ఉంది. రూ.711 కోట్ల ప్రత్యేక కేటాయింపుల కారణంగా ఉద్యోగుల వ్యయాలు పెరిగాయి. నికర లాభం 77 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 80 శాతం)క్షీణించి రూ.600 కోట్లకు తగ్గింది. సాధారణంగా రెండో క్వార్టర్ సీజనల్‌గా బలహీనంగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం, వచ్చే ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలు రావచ్చని అంచనా. బొగ్గు దిగుమతులు బాగా తగ్గించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ కారణంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంపై కేంద్రం దృష్టిపెట్టింది. ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తి 6 శాతం చక్రగతి వృద్ధితో 605 మిలియన్ టన్నులకు, బొగ్గు అమ్మకాలు కూడా 6 శాతం చక్రగతి వృద్ధితో 600 మిలియన్ టన్నులకు పెరగవచ్చని అంచనా. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండడం, డివిడెండ్ చెల్లింపులు బాగా ఉండడం, బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండడం, నగదు నిల్వలు పుష్కలంగా ఉండడం తదితర కారణాల వల్ల దీర్ఘకాలానికి ఈ షేర్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
జాగరణ్ ప్రకాశన్
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్, ప్రస్తుత ధర: రూ.165
టార్గెట్ ధర: రూ.215
ఎందుకంటే: జాగరణ్ ప్రకాశన్..ప్రాంతీయ ప్రింట్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉంది. దైనిక్ జాగరణ్ (భారత్‌లో అత్యధిక రీడర్షిప్ ఉన్న పత్రిక) నయీ దునియా, (ఈ రెండూ హిందీ వార్తాపత్రికలు)ఇంక్విలాబ్(ఉర్దూ), పంజాబీ జాగరణ్, మిడ్ డే(సాయంకాల ఇంగ్లిష్ పత్రిక) దినపత్రికలు ఈ సంస్థ నుంచే ప్రచురణ అవుతున్నాయి. ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. నికర వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండడమే దీనికి కారణం.రాబడి 5 శాతం వృద్ధితో రూ.459 కోట్లకు పెరిగింది. ప్రకటనల ఆదాయం 5 శాతం పెరిగింది. . సర్క్యులేషన్ రాబడి 6 శాతం వృద్ధి చెందింది. ఈ క్యూ2లో రేడియో సిటీ ప్రకటనల ఆదాయం 37% పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రేడియో సిటీ ప్రకటనల ఆదాయం 35 శాతం పెరగగలదని అంచనా వేస్తున్నాం. వ్యయాలు పెరగడంతో ఇబిటా మార్జిన్లు 230 బేసిస్ పాయింట్లు తగ్గి 26.4 శాతానికి చేరాయి. ఉద్యోగ వ్యయాలు 10 శాతం, ఇతర వ్యయాలు 18 శాతం చొప్పున పెరిగాయి. రెండేళ్లలో ప్రకటనల రాబడి 10%, సరŠుక్యలేషన్ రాబడి 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, దీంతో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 12% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. ముడి పదార్థాల వ్యయాలు తగ్గాయి. న్యూస్‌ప్రింట్ వ్యయాలు టన్నులకు 2–3% రేంజ్‌లో పెరగవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల ఆదాయం 11% వృద్ధి చెందగలదని గతంలో ఆంచనా వేశాం. కానీ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ప్రకటనల ఆదాయం 9% మాత్రమే వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ షేర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 15 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 13 రెట్ల చొప్పున ట్రేడవుతోంది.