న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన విధంగా బొగ్గు రవాణాకు తోడ్పడే దాదాపు 61 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్‌ఎంసీ) ప్రాజెక్టులపై కోల్ ఇండియా దృష్టి పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో వాటిపై రూ. 24,750 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్టులను మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఉత్పత్తి కేంద్రాల నుంచి బొగ్గు హ్యాండ్లింగ్ పాయింట్ల వరకు యాంత్రిక కన్వేయర్ల ద్వారా బొగ్గును రవాణా చేసేందుకు ఎఫ్‌ఎంసీ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. వీటివల్ల ధూళి, కర్బన ఉద్గారాలపరమైన కాలుష్యం, అలాగే రహాదార్లపైనా రవాణా భారం తగ్గుతుందని అధికారి వివరించారు. వీలైనంత తక్కువ మానవ ప్రమేయంతో వినియోగదారులకు అవసరమైన నాణ్యమైన బొగ్గును, కచ్చితమైన పరిమాణంలో అందించవచ్చని పేర్కొన్నారు.
తొలి దశలో 414.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉండే 35 ఎఫ్‌ఎంసీ ప్రాజెక్టులను రూ. 10,750 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 112 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ఎనిమిది ప్రాజెక్టులు ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 178 మిలియన్ టన్నుల సామర్థ్యం గల మరో 17 ప్రాజెక్టులను అందుబాటులోకి తేనున్నట్లు అధికారి చెప్పారు. ఇక రెండు, మూడో విడత ప్రాజెక్టుల్లో వరుసగా రూ. 2,500 కోట్లు, రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment