FMC
-
‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’కి భారీ ఊరట
ప్రముఖ దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ సంస్థకు భారీ ఊరట లభించింది. ‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ హెచ్‌యూఎల్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, ఆ కేసును కోల్‌కతా హైకోర్టు కొట్టిపారేసింది. సంస్థ యాజమాన్యం నిర్ధోషులని తీర్పిచ్చింది. కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)కు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హిందుస్థాన్ యూనిలివర్ సంస్థపై, ఆ కంపెనీ (ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు) యాజమాన్యం రెడ్ లేబుల్ టీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ క్రిమినల్ కేసు నమోదు చేశారు. హెచ్‌యూఎల్ సంస్థ ఆహార కల్తీ నిరోధక చట్టం సెక్షన్ 38, సెక్షన్ 39ని ఉల్లంఘించందని ఆరోపించారు. దీంతో తప్పుగా బ్రాండింగ్ చేస్తున్నందుకు హెచ్‌యూఎల్ ఉన్నతాధికారులు దోషులని మునిసిపల్ మేజిస్ట్రేట్ నిర్ధారించింది. రూ. 5,000 జరిమానాతో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ శిక్షను కోల్‌కతా జిల్లా కోర్టు (సెషన్స్ కోర్టు) కొట్టివేసింది. అయితే, తీర్పును మళ్లీ పరిశీలించాలని మున్సిపల్ మేజిస్ట్రేట్‌కు తిరిగి పంపించింది. సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీపై తప్పుడు ప్రచారం చేసిందనే మున్సిపల్ కార్పొరేషన్ అభిప్రాయంపై స్పందించింది. తప్పుడు ప్రచారం అంటూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నిరూపించడానికి ట్రయల్ కోర్టు (అప్పీలేట్ కోర్టు) ముందు కేఎంసీ విభాగం ఎప్పుడూ హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా హిందుస్థాన్ యూనిలీవర్ తన ఉత్పత్తిని ఎందుకు తప్పుగా బ్రాండ్ చేసిందనే కారణాల్ని వివరించలేదని కోర్టు తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్, ఆ సంస్థ అధికారులపై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవని జస్టిస్ సుభేందు సమంతా గుర్తించారు. కేసును కొట్టివేసి నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ తరఫున న్యాయవాదులు సబ్యసాచి బెనర్జీ, అనిర్బన్ దత్తా, అభిజిత్ చౌదరి, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ తరపున న్యాయవాదులు గౌతమ్ దిన్హా ,అనింద్యసుందర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇమ్రాన్ అలీ, దేబ్జానీ సాహులు తమ వాదనల్ని వినిపించారు. -
హరిత ప్రాజెక్టులపై రూ. 25 వేల కోట్లు - కోల్ ఇండియా ప్రణాళికలు
న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన విధంగా బొగ్గు రవాణాకు తోడ్పడే దాదాపు 61 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ) ప్రాజెక్టులపై కోల్ ఇండియా దృష్టి పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో వాటిపై రూ. 24,750 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్టులను మూడు దశల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి బొగ్గు హ్యాండ్లింగ్ పాయింట్ల వరకు యాంత్రిక కన్వేయర్ల ద్వారా బొగ్గును రవాణా చేసేందుకు ఎఫ్ఎంసీ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. వీటివల్ల ధూళి, కర్బన ఉద్గారాలపరమైన కాలుష్యం, అలాగే రహాదార్లపైనా రవాణా భారం తగ్గుతుందని అధికారి వివరించారు. వీలైనంత తక్కువ మానవ ప్రమేయంతో వినియోగదారులకు అవసరమైన నాణ్యమైన బొగ్గును, కచ్చితమైన పరిమాణంలో అందించవచ్చని పేర్కొన్నారు. తొలి దశలో 414.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉండే 35 ఎఫ్ఎంసీ ప్రాజెక్టులను రూ. 10,750 కోట్లతో చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 112 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ఎనిమిది ప్రాజెక్టులు ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 178 మిలియన్ టన్నుల సామర్థ్యం గల మరో 17 ప్రాజెక్టులను అందుబాటులోకి తేనున్నట్లు అధికారి చెప్పారు. ఇక రెండు, మూడో విడత ప్రాజెక్టుల్లో వరుసగా రూ. 2,500 కోట్లు, రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. -
కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న విప్రో!
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఫుడ్, మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రయివేట్ రంగ కంపెనీ విప్రో కన్జూమర్ కేర్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా సుగంధ ద్రవ్యాల కంపెనీ నిరాపరాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. కేరళలో అత్యధికంగా విక్రయమవుతున్న సంప్రదాయ ఆహార బ్రాండ్ల సంస్థ నిరాపరాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డాబర్, ఇమామీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఐటీసీ సరసన చేరనున్నట్లు పేర్కొంది. 1976లో ప్రారంభమైన నిరాపరా మిశ్రమ మసాలా దినుసులకు పేరొందింది. ఈ బ్రాండు పలు రకాల మిశ్రమ దిసుసులతోపాటు.. విభిన్న అప్పడాల తయారీలో వినియోగించే బియ్యపు పిండినీ రూపొందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ బిజినెస్ కేరళలో 63 శాతం, గల్ఫ్ దేశాల నుంచి 29 శాతం నమోదవుతున్నట్లు విప్రో ఎంటర్ప్రైజెస్ ఈడీ వినీత్ అగర్వాల్ వెల్లడించారు. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు యథాతథంగా రూ. 390 వద్ద ముగిసింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
కరోనా మహమ్మారిలోనూ బలంగా నిలబడ్డ పరిశ్రమలివే
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలు కరోనా మహమ్మారి కాలంలోనూ తమ బలాన్ని చాటుతున్నాయని..భవిష్యత్తులో ఇవి మరింత విలువను సృష్టించే విధంగా అభివృద్ధి చెందగలవని డెలాయిట్–ఫిక్కీ నివేదిక అభిప్రాయపడింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు డిజిటల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులకు చేరువ కావాలని సూచించింది. వనరులను సమకూర్చుకోవడం, ఉత్పత్తి, ప్యాకేజింగ్ విషయంలో స్థిరత్వం ఉండేలా చర్యలు అవసరమని పేర్కొంది. ఈ నివేదిక గురువారం విడుదలైంది. ‘‘వినియోగ డిమాండ్‌ను కరోనా పూర్తిగా మార్చేసింది.సరఫరా వ్యవస్థలకు సవాళ్లు విసిరింది. కొన్నింటిని సమూలంగా మార్చేసింది. వ్యాపారాలకు ఇక నూతన సాధారణ అంశాలుగా మార్చేసింది’’అని వివరించింది. డిజిటైజేషన్‌తో కిరాణాల సామర్థ్యం పెరగనుందని.. ఎఫ్ఎంసీజీ రంగానికి వృద్ధి అవకాశాలు తీసుకొస్తుందని అంచనా వేసింది. నేరుగా వినియోగదారుణ్ణి చేరుకునే మార్గాలపై కంపెనీలు దృష్టి పెట్టాలని సూచించింది. కాస్మొటిక్స్, బేబీ కేర్, వెల్నెస్ విభాగాల్లో ఈ కామర్స్ ఇకమీదట మరింత వేగంగా విస్తరిస్తుందని పేర్కొంది. చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది -
స్టాక్స్‌లోకి పెన్షన్ నిధులు..!
న్యూఢిల్లీ: దేశంలో స్టాక్ మార్కెట్లను మరింత బలోపేతం చేయాలంటే... పెన్షన్ నిధులను పెట్టుబడిగా పెట్టేందుకు అనుమతించాలని నియంత్రణ సంస్థ సెబీ కోరింది. స్టాక్స్ సంబంధ విభిన్న సాధనాల్లోకి ఈ నిధులు ప్రవహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఆదివారమిక్కడ జరిగిన సెబీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తింది. బడ్జెట్ అనంతరం సెబీ బోర్డుతో జరిగిన ఈ భేటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలోని స్టాక్ మార్కెట్ పరిస్థితిని ఆయన సమీక్షించారు. కాగా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(రీట్స్) విజయవంతం కావాలంటే తగిన సానుకూల వాతావరణాన్ని కల్పించాలని కూడా సెబీ అభిప్రాయపడింది. భేటీలో సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఎనిమిది మంది బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా హాజరయ్యారు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించి బడ్జెట్లో ప్రతిపాదించిన పలు ప్రతిపాదనలను ముందుకుతీసుకెళ్లడంపై సెబీతో ఈ సందర్బంగా జైట్లీ చర్చిం చారు. ప్రధానంగా కమోడిటీ మార్కెట్ నియంత్రణ సంస్థ(ఎఫ్ఎంసీ)ను సెబీలో విలీనం చేసి ఏకీకృత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం తెలిసిందే. ఈ విలీనానికి సంబంధించి సెబీ సామర్థ్యాన్ని పెంచడం, తగిన మౌలిక వసతుల కల్పనపై చర్చించినట్లు జైట్లీ పేర్కొన్నారు. 2015-16 బడ్జెట్లో ప్రకటించిన చర్యలకు అనుగుణంగా తాము తీసుకున్న చర్యలను సెబీ చైర్మన్ యూకే సిన్హా వివరించారు. రీట్స్ ఏర్పాటుతో రియల్టీ కంపెనీలు నిధుల సమీకరణకు వీలుగా గతేడాది సెబీ కొత్త మార్గదర్శకాలను జారీ చేయడం తెలిసిందే. తాజా బడ్జెట్లో వీటికి పన్ను ప్రోత్సాహకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సెబీ ఇతర నిర్ణయాలు ఇవీ.. మొండిబకాయిల(ఎన్పీఏ)తో సతమతమవుతున్న లిస్టెడ్ కంపెనీల రుణ బకాయిలను బ్యాంకులు ఈక్విటీగా మార్పిడి చేసుకునేందుకు నిబంధనల సడలింపు. ఈ కీలక నిర్ణయం కారణంగా బ్యాంకులు రుణగ్రస్త కంపెనీల్లో మెజారిటీ వాటాలను చేజిక్కించుకొని... యాజమాన్య కార్యకలాపాలను తమచెప్పుచేతల్లో పెట్టుకోవడానికి వీలవుతుందని సిన్హా తెలిపారు. ఈ దీనివల్ల రుణాల పునర్వ్యవస్థీకరణ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. లిస్టెడ్ కంపెనీలు తమ బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను 30 నిమిషాల్లోపు వెల్లడించాలి. సంబంధిత సమాచారాన్ని 24 గంటల్లోగా తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలి. ఉల్లంఘించిన కంపెనీలపై భారీ జరిమానా సహా కఠిన చర్యలు.భారత్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్ఎస్సీ) ఏర్పాటుకు మార్గం సుగమం. ఈ సెంటర్లలో స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇతరత్రా క్యాపిటల్ మార్కెట్ సంబంధ మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా నిబంధనలు సడలిస్తూ కొత్త ఐఎఫ్ఎస్సీ మార్గదర్శకాలు జారీ. దీనిప్రకారం ప్రస్తుతం ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజీలన్నీ తమ సబ్సిడరీలను ఐఎఫ్ఎస్సీలో నెలకొల్పేందుకు అనుమతిస్తారు. తొలి ఐఎఫ్ఎస్సీ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటవుతోంది.స్టార్టప్ సంస్థ లిస్టింగ్, క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా యువ ప్రారిశ్రామికవేత్తలు నిధులను సమకరించేందుకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు. మున్సిపల్ బాండ్ల జారీ, లిస్టింగ్‌కు ఓకే... పట్టణాల్లో మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్ సిటీల నిర్మాణానికి చేయూతగా మున్సిపల్ బాండ్ల జారీకి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ‘ముని బాండ్’ల జారీ, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్.. ట్రేడింగ్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఆమోదించింది. మౌలిక రంగ అభివృద్ధి కార్యకలాపాల్లోకి ప్రజల పొదుపు నిధులను మళ్లించేలా చేయడమే ఈ బాండ్ల ప్రధానోద్దేశం. పటిష్టమైన ఆర్థిక పనితీరు కలిగిన మున్సిపాలిటీలు... స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్‌తో పాటు ఇతర అవసరాల కోసం ఈ ముని బాండ్ల జారీ ద్వారా ప్రజలు, సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్ నుంచి నిధులను సమీకరించవచ్చని సిన్హా తెలిపారు. ఈ బాండ్లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వీలుగా తగిన నిబంధనలను ఇందులో చేర్చినట్లు సిన్హా చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ స్థాయి పరపతి రేటింగ్‌తో పాటు ఇతరత్రా ప్రమాణాలను కలిగిఉండటంతోపాటు లిస్టయిన సెక్యూరిటీల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక ఏజెన్సీ ఉంటుందని చెప్పారు. బాండ్లకు కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉండాలి. ప్రాజెక్టు వ్యయంలో 20 శాతాన్ని బాండ్ల జారీ సంస్థ(మున్సిపాలిటీ) వెచ్చించాలనేది నిబంధనల్లో ప్రధానాంశం. బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాలి: జైట్లీ నియంత్రణ అధికారాలకు కోత విషయంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయన్న వాదనలను ఆర్థిక మంత్రి జైట్లీ తోసిపుచ్చారు. తమ మధ్య(ప్రభుత్వం-ఆర్బీఐ) సమన్వయానికి సంబంధించి ఎలాంటి సమస్యలూ లేవని... ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. మరోపక్క, ఆర్బీఐ పరపతి విధానానికి అనుగుణంగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. బడ్జెట్ అనంతరం ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి, మార్చి నెలల్లో వరుసగా రెండుసార్లు ఆర్బీఐ కీలక రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించినప్పటికీ.. బ్యాంకులు రుణ రేట్లను తగ్గించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ప్రభుత్వ రుణ సమీకరణ నిర్వహణకు కేంద్రం ప్రతిపాదించిన ప్రత్యేక ఏజెన్సీ... ఆర్బీఐ లేదా ప్రభుత్వ నియంత్రణలో కాకుండా స్వతంత్రంగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు.. ద్రవ్యోల్బణం ధోరణిపైనే ఆధారపడి ఉంటుందన్నారు.