స్టాక్స్‌లోకి పెన్షన్ నిధులు..! | Sebi pitches for pension money in markets as Arun Jaitley takes stock | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌లోకి పెన్షన్ నిధులు..!

Published Mon, Mar 23 2015 2:33 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

స్టాక్స్‌లోకి పెన్షన్ నిధులు..! - Sakshi

స్టాక్స్‌లోకి పెన్షన్ నిధులు..!

 న్యూఢిల్లీ: దేశంలో స్టాక్ మార్కెట్లను మరింత బలోపేతం చేయాలంటే... పెన్షన్ నిధులను పెట్టుబడిగా పెట్టేందుకు అనుమతించాలని నియంత్రణ సంస్థ సెబీ కోరింది. స్టాక్స్ సంబంధ విభిన్న సాధనాల్లోకి ఈ నిధులు ప్రవహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఆదివారమిక్కడ జరిగిన సెబీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తింది. బడ్జెట్ అనంతరం సెబీ బోర్డుతో జరిగిన ఈ భేటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలోని స్టాక్ మార్కెట్ పరిస్థితిని ఆయన సమీక్షించారు. కాగా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు(రీట్స్) విజయవంతం కావాలంటే తగిన సానుకూల వాతావరణాన్ని కల్పించాలని కూడా సెబీ అభిప్రాయపడింది. భేటీలో సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఎనిమిది మంది బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా హాజరయ్యారు.
 
 స్టాక్ మార్కెట్‌కు సంబంధించి బడ్జెట్‌లో ప్రతిపాదించిన పలు ప్రతిపాదనలను ముందుకుతీసుకెళ్లడంపై సెబీతో ఈ సందర్బంగా జైట్లీ చర్చిం చారు. ప్రధానంగా కమోడిటీ మార్కెట్ నియంత్రణ సంస్థ(ఎఫ్‌ఎంసీ)ను సెబీలో విలీనం చేసి ఏకీకృత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం తెలిసిందే. ఈ విలీనానికి సంబంధించి సెబీ సామర్థ్యాన్ని పెంచడం, తగిన మౌలిక వసతుల కల్పనపై చర్చించినట్లు జైట్లీ పేర్కొన్నారు. 2015-16 బడ్జెట్‌లో ప్రకటించిన చర్యలకు అనుగుణంగా తాము తీసుకున్న చర్యలను సెబీ చైర్మన్ యూకే సిన్హా వివరించారు. రీట్స్ ఏర్పాటుతో రియల్టీ కంపెనీలు నిధుల సమీకరణకు వీలుగా గతేడాది సెబీ కొత్త మార్గదర్శకాలను జారీ చేయడం తెలిసిందే. తాజా బడ్జెట్‌లో వీటికి పన్ను ప్రోత్సాహకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
 సెబీ ఇతర నిర్ణయాలు ఇవీ..
 
 మొండిబకాయిల(ఎన్‌పీఏ)తో సతమతమవుతున్న లిస్టెడ్ కంపెనీల రుణ బకాయిలను బ్యాంకులు ఈక్విటీగా మార్పిడి చేసుకునేందుకు నిబంధనల సడలింపు. ఈ కీలక నిర్ణయం కారణంగా బ్యాంకులు రుణగ్రస్త కంపెనీల్లో మెజారిటీ వాటాలను చేజిక్కించుకొని... యాజమాన్య కార్యకలాపాలను తమచెప్పుచేతల్లో పెట్టుకోవడానికి వీలవుతుందని సిన్హా తెలిపారు. ఈ దీనివల్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
 
 లిస్టెడ్ కంపెనీలు తమ బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను 30 నిమిషాల్లోపు వెల్లడించాలి. సంబంధిత సమాచారాన్ని 24 గంటల్లోగా తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలి. ఉల్లంఘించిన కంపెనీలపై భారీ జరిమానా సహా కఠిన చర్యలు.భారత్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్‌ఎస్‌సీ) ఏర్పాటుకు మార్గం సుగమం. ఈ సెంటర్లలో స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇతరత్రా క్యాపిటల్ మార్కెట్ సంబంధ మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా నిబంధనలు సడలిస్తూ కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ మార్గదర్శకాలు జారీ. దీనిప్రకారం ప్రస్తుతం ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజీలన్నీ తమ సబ్సిడరీలను ఐఎఫ్‌ఎస్‌సీలో నెలకొల్పేందుకు అనుమతిస్తారు. తొలి ఐఎఫ్‌ఎస్‌సీ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటవుతోంది.స్టార్టప్ సంస్థ లిస్టింగ్, క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా యువ ప్రారిశ్రామికవేత్తలు నిధులను సమకరించేందుకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు.
 
 మున్సిపల్ బాండ్‌ల జారీ, లిస్టింగ్‌కు ఓకే...
 పట్టణాల్లో మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్ సిటీల నిర్మాణానికి చేయూతగా మున్సిపల్ బాండ్‌ల జారీకి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ‘ముని బాండ్’ల జారీ, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్.. ట్రేడింగ్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఆమోదించింది. మౌలిక రంగ అభివృద్ధి కార్యకలాపాల్లోకి ప్రజల పొదుపు నిధులను మళ్లించేలా చేయడమే ఈ బాండ్‌ల ప్రధానోద్దేశం. పటిష్టమైన ఆర్థిక పనితీరు కలిగిన మున్సిపాలిటీలు... స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్‌తో పాటు ఇతర అవసరాల కోసం ఈ ముని బాండ్‌ల జారీ ద్వారా ప్రజలు, సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్ నుంచి నిధులను సమీకరించవచ్చని సిన్హా తెలిపారు.
 
 ఈ బాండ్‌లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వీలుగా తగిన నిబంధనలను ఇందులో చేర్చినట్లు సిన్హా చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్ స్థాయి పరపతి రేటింగ్‌తో పాటు ఇతరత్రా ప్రమాణాలను కలిగిఉండటంతోపాటు లిస్టయిన సెక్యూరిటీల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక ఏజెన్సీ ఉంటుందని చెప్పారు. బాండ్‌లకు కనీసం మూడేళ్ల కాలపరిమితి ఉండాలి. ప్రాజెక్టు వ్యయంలో 20 శాతాన్ని బాండ్‌ల జారీ సంస్థ(మున్సిపాలిటీ) వెచ్చించాలనేది నిబంధనల్లో ప్రధానాంశం.
 
 బ్యాంకులు  రుణ రేట్లను తగ్గించాలి: జైట్లీ
 నియంత్రణ అధికారాలకు కోత విషయంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయన్న వాదనలను ఆర్థిక మంత్రి జైట్లీ తోసిపుచ్చారు. తమ మధ్య(ప్రభుత్వం-ఆర్‌బీఐ) సమన్వయానికి సంబంధించి ఎలాంటి సమస్యలూ లేవని... ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. మరోపక్క, ఆర్‌బీఐ పరపతి విధానానికి అనుగుణంగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తాయన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు.
 
 బడ్జెట్ అనంతరం ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి, మార్చి నెలల్లో వరుసగా రెండుసార్లు ఆర్‌బీఐ కీలక రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించినప్పటికీ.. బ్యాంకులు రుణ రేట్లను తగ్గించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ప్రభుత్వ రుణ సమీకరణ నిర్వహణకు కేంద్రం ప్రతిపాదించిన ప్రత్యేక ఏజెన్సీ... ఆర్‌బీఐ లేదా ప్రభుత్వ నియంత్రణలో కాకుండా స్వతంత్రంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు.. ద్రవ్యోల్బణం ధోరణిపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement