వెలుగులో చిన్న షేర్లు
మూడు రోజులుగా బలపడ్డ సెంటిమెంట్ చిన్న షేర్లకు టానిక్‌లా పనిచేస్తోంది. గత రెండు రోజుల్లో మార్కెట్లకు మించి పరుగు తీసిన బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మరోసారి 1.4% ఎగశాయి. వెరసి ట్రేడైన షేర్లలో 1,746 లాభపడితే, 1,188 మాత్రమే నష్టపోయాయి. ఇక మరోవైపు మార్కెట్లు రోజంతా స్వల్ప ఒడిదుడుకులకులోనై చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 11 పాయింట్లు పెరిగి 25,561 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 16 పాయింట్లు పుంజుకుని 7,640 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 554 పాయింట్లు జమ చేసుకుంది.
ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,912 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 1,316 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ప్రధానంగా మెటల్స్, పవర్, వినియోగవస్తు రంగాలు 2%పైగా పురోగమించాయి. మెటల్ దిగ్గజాలు హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పుంజుకోగా, పవర్ షేర్లు సీఈఎస్‌సీ, టాటా పవర్, అదానీ పవర్, పీటీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్‌టీపీసీ, రిలయన్స్ పవర్ 4-2% మధ్య ఎగశాయి. సెన్సెక్స్‌లో ఎంఅండ్‌ఎం 3%, బజాజ్ ఆటో 2% చొప్పున క్షీణించాయి.
రెండు సంస్థలుగా క్రాంప్టన్ గ్రీవ్స్
వినియోగ వస్తువుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి లిస్ట్ చేయనుండటంతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 13% జంప్‌చేసింది. రూ. 211 వద్ద ముగిసింది. 2.3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. వినియోగ వస్తు విభాగాన్ని (బీటూసీ) ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బెల్జియం మాతృసంస్థ నిర్ణయించినట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ బీఎస్‌ఈకి తెలిపింది. ప్రధాన కంపెనీ చేతిలో విద్యుత్, పారిశ్రామిక, ఆటోమేషన్ ఉత్పత్తుల బిజినెస్ ఉంటుందని తెలియజేసింది.