Crompton Greaves
-
క్రాంప్టన్‌లో బటర్‌ఫ్లై విలీనం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్‌లో కిచెన్, స్మాల్ అప్లయెన్సెస్ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి విలీనం కానుంది. ఏకీకృతం కావడం ద్వారా సంయుక్త సంస్థ పలు అంశాలలో వ్యాపార లబ్దిని పొందనుంది. దీంతో రెండు కంపెనీల కార్పొరేట్, పాలన తదితర అంశాలు సైతం సరళతరంకానున్నాయి. షేర్ల మార్పిడి ద్వారా విలీనంకానున్నట్లు రెండు సంస్థలూ విడిగా తెలియజేశాయి. ఇందుకు 22:5 నిష్పత్తిలో షేర్ల మార్పిడికి తెరతీయనున్నాయి. అంటే బటర్‌ఫ్లై వాటాదారులకు తమవద్దగల ప్రతీ 5 షేర్లకుగాను 22 క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేర్లను జారీ చేస్తారు. కాగా.. విలీనానికి సెబీ, స్టాక్ ఎక్సే్ఛంజీలుసహా పలు నియంత్రణ సంస్థల అనుమతిని పొందవలసి ఉంది. రుణదాతలు, ఎన్సీఎల్ టీ, వాటాదారులు సైతం ఆమోదముద్ర వేయవలసి ఉంది. కొత్త ప్రొడక్టులపై దృష్టి బటర్‌ఫ్లైతో విలీనం ద్వారా కొత్త ప్రొడక్టుల తయారీపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుచిక్కనున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎండీ శంతను ఖోస్లా పేర్కొన్నారు. విలీనం వాటాదారులకు మరింత విలువను చేకూర్చుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్తో విలీనం ద్వారా కంపెనీ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించగలదని బటర్‌ఫ్లై ఎండీ రంగరాజన్ శ్రీరామ్ పేర్కొన్నారు. ఇది వృద్ధికి, ప్రొడక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. బటర్‌ఫ్లై గంధిమతిలో 81 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 2,076 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. -
క్రాంప్టన్ గ్రీవ్స్ చేతికి బటర్‌ఫ్లై
న్యూఢిల్లీ: బటర్‌ఫ్లై బ్రాండ్‌తో కిచెన్ అప్లయెన్సెస్ విక్రయించే గంధిమతి అప్లయెన్సెస్‌ను ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ సొంతం చేసుకోనుంది. గంధిమతిలో మెజారిటీ వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా షేరుకి రూ. 1,403 ధరలో 55 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,380 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బటర్‌ఫ్లై వాటాదారులకు షేరుకి రూ. 1,434 ధరలో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. సెబీ నిబంధనల ప్రకారం 26 శాతం వాటావరకూ కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 667 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి గంధిమతి అప్లయెన్సెస్ కొనుగోలుకి రూ. 2,077 కోట్లవరకూ వెచ్చించనుంది. టాప్–3లో ఒకటి..: బటర్‌ఫ్లై బ్రాండుతో గంధిమతి అప్లయెన్సెస్ మిక్సర్ గ్రైండర్లు, టేబుల్ టాప్ వెట్ గ్రైండర్లు, ప్రెజర్ కుకర్లు, ఎల్పీజీ స్టవ్‌లు, నాన్‌స్టిక్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్‌లు తదితరాలను విక్రయిస్తున్న విషయం విదితమే. ఈ విభాగంలో దేశీయంగా టాప్–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ పేర్కొంది. డీల్ వార్తల నేపథ్యంలో బటర్‌ఫ్లై షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,396 వద్ద నిలవగా.. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 409 వద్ద ముగిసింది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్- సీజీ కన్జూమర్ జోరు
ఒక రోజు వెనకడుగు తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ షేరుకి రూ. 205 ధరలో 7.8 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 1,500 కోట్లు వెచ్చించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే వీలున్నట్లు ఏబీ ఫ్యాషన్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో దేశీ దుస్తుల పరిశ్రమ 100 బిలియన్ డాలర్లను తాకే అంచనాలున్నట్లు తెలియజేశారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా లభించే నిధులను బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకూ వినియోగించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం తదుపరి ప్రమోటర్ల వాటా 55.13 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏబీ ఫ్యాషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 163ను అధిగమించింది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ నికర లాభం 28 శాతం ఎగసి రూ. 142 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 13 శాతం పెరిగి రూ. 1,213 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభ మార్జిన్లు 3.8 శాతం మెరుగుపడి 15.8 శాతానికి చేరాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7.3 శాతం జంప్‌చేసి రూ. 307 వద్ద ట్రేడవుతోంది. తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 329 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. -
వెలుగులో చిన్న షేర్లు
మూడు రోజులుగా బలపడ్డ సెంటిమెంట్ చిన్న షేర్లకు టానిక్‌లా పనిచేస్తోంది. గత రెండు రోజుల్లో మార్కెట్లకు మించి పరుగు తీసిన బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మరోసారి 1.4% ఎగశాయి. వెరసి ట్రేడైన షేర్లలో 1,746 లాభపడితే, 1,188 మాత్రమే నష్టపోయాయి. ఇక మరోవైపు మార్కెట్లు రోజంతా స్వల్ప ఒడిదుడుకులకులోనై చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 11 పాయింట్లు పెరిగి 25,561 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 16 పాయింట్లు పుంజుకుని 7,640 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 554 పాయింట్లు జమ చేసుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,912 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 1,316 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ప్రధానంగా మెటల్స్, పవర్, వినియోగవస్తు రంగాలు 2%పైగా పురోగమించాయి. మెటల్ దిగ్గజాలు హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పుంజుకోగా, పవర్ షేర్లు సీఈఎస్సీ, టాటా పవర్, అదానీ పవర్, పీటీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్టీపీసీ, రిలయన్స్ పవర్ 4-2% మధ్య ఎగశాయి. సెన్సెక్స్‌లో ఎంఅండ్ఎం 3%, బజాజ్ ఆటో 2% చొప్పున క్షీణించాయి. రెండు సంస్థలుగా క్రాంప్టన్ గ్రీవ్స్ వినియోగ వస్తువుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి లిస్ట్ చేయనుండటంతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 13% జంప్‌చేసింది. రూ. 211 వద్ద ముగిసింది. 2.3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. వినియోగ వస్తు విభాగాన్ని (బీటూసీ) ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బెల్జియం మాతృసంస్థ నిర్ణయించినట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ బీఎస్ఈకి తెలిపింది. ప్రధాన కంపెనీ చేతిలో విద్యుత్, పారిశ్రామిక, ఆటోమేషన్ ఉత్పత్తుల బిజినెస్ ఉంటుందని తెలియజేసింది.