![Butterfly Gandhimathi hits record high on open offer by Crompton Greaves - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/24/CROMPTON-BUTTERFLY.jpg.webp?itok=7xNHztmI)
న్యూఢిల్లీ: బటర్‌ఫ్లై బ్రాండ్‌తో కిచెన్ అప్లయెన్సెస్ విక్రయించే గంధిమతి అప్లయెన్సెస్‌ను ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ సొంతం చేసుకోనుంది. గంధిమతిలో మెజారిటీ వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా షేరుకి రూ. 1,403 ధరలో 55 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది.
ఇందుకు రూ. 1,380 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బటర్‌ఫ్లై వాటాదారులకు షేరుకి రూ. 1,434 ధరలో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. సెబీ నిబంధనల ప్రకారం 26 శాతం వాటావరకూ కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 667 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి గంధిమతి అప్లయెన్సెస్ కొనుగోలుకి రూ. 2,077 కోట్లవరకూ వెచ్చించనుంది.
టాప్–3లో ఒకటి..: బటర్‌ఫ్లై బ్రాండుతో గంధిమతి అప్లయెన్సెస్ మిక్సర్ గ్రైండర్లు, టేబుల్ టాప్ వెట్ గ్రైండర్లు, ప్రెజర్ కుకర్లు, ఎల్‌పీజీ స్టవ్‌లు, నాన్‌స్టిక్ కుక్‌వేర్, స్టెయిన్‌లెస్ స్టీల్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్‌లు తదితరాలను విక్రయిస్తున్న విషయం విదితమే. ఈ విభాగంలో దేశీయంగా టాప్–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ పేర్కొంది.
డీల్ వార్తల నేపథ్యంలో బటర్‌ఫ్లై షేరు
ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 1,396 వద్ద నిలవగా.. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 409 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment