ఒక రోజు వెనకడుగు తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
ఆదిత్య బిర్లా ఫ్యాషన్
ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ షేరుకి రూ. 205 ధరలో 7.8 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 1,500 కోట్లు వెచ్చించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే వీలున్నట్లు ఏబీ ఫ్యాషన్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో దేశీ దుస్తుల పరిశ్రమ 100 బిలియన్ డాలర్లను తాకే అంచనాలున్నట్లు తెలియజేశారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా లభించే నిధులను బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకూ వినియోగించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం తదుపరి ప్రమోటర్ల వాటా 55.13 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏబీ ఫ్యాషన్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 163ను అధిగమించింది.
క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ నికర లాభం 28 శాతం ఎగసి రూ. 142 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 13 శాతం పెరిగి రూ. 1,213 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభ మార్జిన్లు 3.8 శాతం మెరుగుపడి 15.8 శాతానికి చేరాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 7.3 శాతం జంప్‌చేసి రూ. 307 వద్ద ట్రేడవుతోంది. తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 329 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment