Aditya Birla Fashion and Retail
-
ఏబీ ఫ్యాషన్ చేతికి టీసీఎన్ఎస్
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రాండ్ల దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) మహిళా దుస్తుల సంస్థ టీసీఎన్ఎస్ క్లాతింగ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. విస్తరించిన టీసీఎన్ఎస్ వాటా మూలధనంలో 51 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో టీసీఎన్ఎస్ అనుబంధ సంస్థగా ఆవిర్భవించినట్లు ఏబీ ఫ్యాషన్ పేర్కొంది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం మెటీరియల్ సబ్సిడయరీగా సైతం నిలవనున్నట్లు తెలియజేసింది. టీసీఎన్ఎస్ క్లాతింగ్‌లో రూ. 1,650 కోట్లు వెచి్చంచి ప్రధాన వాటా కొనుగోలు చేయనున్నట్లు మే 5న ఏబీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షేర్ల కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ)లో భాగంగా ప్రమోటర్ల వాటాతోపాటు.. ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. ఎస్పీఏకింద విస్తారిత మూలధనంలో 22 శాతం వాటాకు సమానమైన 1.41 కోట్ల షేర్లను సొంతం చేసుకుంది. వెరసి షరతులతోకూడిన ఓపెన్ ఆఫర్ తదుపరి 51 శాతం వాటాకు సమానమైన 3.29 కోట్ల షేర్లను చేజిక్కించుకుంది. గతేడాది టీసీఎన్ఎస్ రూ. 1,202 కోట్ల ఆదాయం పొందింది. లూయిస్ ఫిలిప్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్ బ్రాండ్ల కంపెనీ ఏబీఎఫ్ఆర్ఎల్ రూ. 12,418 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. -
హరిత ఉద్యోగాల కల్పనకు ఏబీఎఫ్ఆర్ఎల్, 1ఎం1బీ జట్టు
ముంబై: వాతావరణ మార్పులపై పోరుపై యువతలో అవగాహన కల్పించడంతో పాటు హరిత ఉద్యోగాల కల్పన దిశగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), 1ఎం1బీ జట్టు కట్టాయి. గ్రీన్ జాబ్స్ అండ్ సస్టెయినబిలిటీ యాక్సిలరేటర్ ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పాటించతగిన విధానాలతో 1ఎం1బీ ప్రత్యేక పాఠ్యాంశాలతో ఈ .. ఏడు రోజుల ప్రోగ్రాం రూపొందింది. ఇందులో ఎంపికయ్యే టాప్ 20 మంది విద్యార్థులకు ఏబీఎఫ్ఆర్ఎల్ ఇంటర్న్‌షిప్‌లు అందిస్తుంది. అలాగే అత్యుత్తమ స్టూడెంట్ల బృందానికి ఈ ఏడాది న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యాక్టివేట్ ఇంపాక్ట్ యూత్ సదస్సులో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుందని ఏబీఎఫ్ఆర్ఎల్, 1ఎం1బీ తెలిపాయి. 2023 జనవరిలో పైలట్ ప్రాతిపదికన నిర్వహించిన ప్రోగ్రాంలో 545 సీబీఎస్ఈ పాఠశాలలు ఇందులో పాల్గొన్నాయని, ఏప్రిల్ 20 నుంచి దీన్ని 25,000 పైచిలుకు పాఠశాలలు, కాలేజీలకు విస్తరించనున్నామని వివరించాయి. -
ఆదిత్య బిర్లా లాభం 94 శాతం డౌన్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కన్సాలిడేటెడ్ లాభం డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు, 94 శాతం తగ్గిపోయి రూ.11 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.197 కోట్లుగా ఉంది. ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.3,589 కోట్లకు చేరింది. ప్రధానంగా మార్కెటింగ్ వ్యయాలు, వ్యూహాత్మక పెట్టుబడులు రెండు రెట్లు పెరగడం నికర లాభం తగ్గిపోయేందుకు కారణమైనట్టు సంస్థ తెలిపింది. వ్యయాలు 31 శాతం పెరిగి రూ.3,603 కోట్లుగా ఉన్నాయి. మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్ విభాగం ఆదాయం 24 శాతం పెరిగి రూ.2,466 కోట్లుగా ఉంటే, ప్యాంటలూన్స్ ఆదాయం 9 శాతం పెరిగి రూ.1,159 కోట్లుగా ఉంది. తన బ్రండెడ్ అవుట్లెట్లను 245 వరకు పెంచుకుంది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లాభం ఐదింతలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం ఐదింతలు పెరిగి రూ.29 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 50 శాతం పెరిగి రూ.3,075 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.5 కోట్లు, ఆదాయం రూ.2,054 కోట్ల చొప్పున ఉన్నాయి. ‘‘కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాం. ఈ కామర్స్ విక్రయాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి సాయపడింది. మార్కెటింగ్‌పైనా పెట్టుబడులు పెరిగాయి. బ్రాండ్ల బలోపేతం, వినియోగదారులను చేరుకోవడంపై దృష్టి సారించాం. పెద్ద ఎత్తున స్టోర్ల నెట్వర్క్ విస్తరణ చేపట్టాం. పాంటలూన్ బ్రాండ్ కింద 21 స్టోర్లు, బ్రాండెడ్ వ్యాపారంలో 85 స్టోర్లు ప్రారంభించాం’’అని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. విభాగాల వారీగా.. ► మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.2,109 కోట్లుగా నమోదైంది. ► ప్యాంటలూన్స్ ఆదాయం 65 శాతం పెరిగి రూ.1,094 కోట్లకు చేరింది. ► ఈ కామర్స్ విక్రయాలు 20 శాతం పెరిగాయి. ఎబిట్డా మార్జిన్లు కరోనా ముందున్న స్థాయిని అధిగమించాయి. ► కంపెనీ కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.243 కోట్లకు తగ్గింది. -
2026 కల్లా రూ. 21,000 కోట్లకు..
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్) రానున్న నాలుగేళ్లలో టర్నోవర్‌ను భారీగా పెంచుకునే ప్రణాళికల్లో ఉంది. 2026కల్లా రూ. 21,000 కోట్ల ఆదాయం సాధించగలమని విశ్వసిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. మార్కెట్లో కంపెనీకిగల పొజిషన్‌ను మరింత పటిష్ట పరచుకోవడం ద్వారా లక్ష్యాన్ని సాధించగలమని కంపెనీ 15వ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. టెక్నాలజీ వినియోగం, ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలతో లాభదాయక, ఫ్యూచర్ రెడీ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించనున్నట్లు వివరించారు. 2021 మార్చిలోనే రూ. 21,000 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2026కల్లా అంచనాలను అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లను అందుకునే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్పారు. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కంపెనీ 55 శాతం వృద్ధితో రూ. 8,136 కోట్ల ఆదాయం సాధించింది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు వాటాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌లో (ఏబీఎఫ్ఆర్ఎల్) 7.8 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. ఈ డీల్ ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌కు 7.8 శాతం వాటాలు దక్కే విధంగా ప్రిఫరెన్స్ షేర్లు జారీ చేయనున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తెలిపింది. షేరు ఒక్కింటి ధర రూ. 205గా ఉంటుందని పేర్కొంది. గురువారం నాటి షేరు ముగింపు ధర రూ. 153.4తో పోలిస్తే ఇది 33.6 శాతం అధికం. షేర్ల కేటాయింపు తర్వాత ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ప్రస్తుత ప్రమోటర్ల వాటా 55.1 శాతంగా ఉంటుంది. ‘భారత్‌లో దుస్తుల పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. భవిష్యత్ అవకాశాలపై గల ధీమాకు ఈ డీల్ నిదర్శనం. పటిష్టమైన ఫండమెంటల్స్ ఊతంతో దేశీయంగా ఫ్యాషన్ రిటైల్ గణనీయ వృద్ధి సాధించగలదు‘ అని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. డీల్ ద్వారా వచ్చే నిధులను వ్యాపార వృద్ధిని వేగవంతం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఏబీఎఫ్ఆర్ఎల్ వెల్లడించింది. ‘నాణ్యత, విలువను కోరుకునే దేశీ వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా సేవలు అందించేందుకు తోడ్పడే కొత్త భాగస్వామ్యాలను నిర్మించుకోవడంపై ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ప్రధానంగా దృష్టి పెడుతోంది‘ అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. 3,000 పైగా స్టోర్స్..: భారీ మార్జిన్లు ఉండే ఫ్యాషన్ వ్యాపారంలో స్థానం దక్కించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌కు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏబీఎఫ్ఆర్ఎల్ పోర్ట్‌ఫోలియోలో పలు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లు ఉండటం ఫ్లిప్‌కార్ట్‌కు లాభించనుంది. అమెజాన్‌డాట్‌కామ్, రిలయన్స్‌కి గట్టి పోటీనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, మార్చి 31 నాటికి దాదాపు రూ. 2,776 కోట్ల మేర ఉన్న రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఏబీఎఫ్ఆర్ఎల్కు కూడా ఈ డీల్ ఉపయోగకరంగా ఉండనుంది. ఫరెవర్ 21, అమెరికన్ ఈగిల్ అవుట్‌ఫిట్టర్స్, రాల్ఫ్ లారెన్ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయానికి అదిత్య బిర్లా ఫ్యాషన్‌కు హక్కులు ఉన్నాయి. ప్యాంటలూన్స్తో పాటు దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు స్టోర్స్ నెట్వర్క్ ఉంది. సుమారు 23,700 పైగా మల్టీబ్రాండ్ అవుట్‌లెట్స్ ద్వారా కూడా విక్రయాలు జరుపుతోంది. తమ వృద్ధి ప్రణాళికలకు ఈ డీల్ ఉపయోగపడుతుందని ఏబీఎఫ్ఆర్ఎల్ ఎండీ ఆశీష్ దీక్షిత్ తెలిపారు. శుక్రవారం బీఎస్ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ షేరు సుమారు 8 శాతం పెరిగి రూ.165 వద్ద క్లోజయ్యింది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్- సీజీ కన్జూమర్ జోరు
ఒక రోజు వెనకడుగు తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ షేరుకి రూ. 205 ధరలో 7.8 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 1,500 కోట్లు వెచ్చించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే వీలున్నట్లు ఏబీ ఫ్యాషన్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో దేశీ దుస్తుల పరిశ్రమ 100 బిలియన్ డాలర్లను తాకే అంచనాలున్నట్లు తెలియజేశారు. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా లభించే నిధులను బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకూ వినియోగించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం తదుపరి ప్రమోటర్ల వాటా 55.13 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏబీ ఫ్యాషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 163ను అధిగమించింది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ నికర లాభం 28 శాతం ఎగసి రూ. 142 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 13 శాతం పెరిగి రూ. 1,213 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభ మార్జిన్లు 3.8 శాతం మెరుగుపడి 15.8 శాతానికి చేరాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7.3 శాతం జంప్‌చేసి రూ. 307 వద్ద ట్రేడవుతోంది. తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 329 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. -
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ చేతికి జేపోర్ బ్రాండ్
ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) కంపెనీ ఎథ్నిక్ వేర్ బ్రాండ్స్– జేపోర్, టీజీ అప్పారెల్ అండ్ డెకార్లను కొనుగోలు చేస్తోంది. జేపోర్ బ్రాండ్‌ను రూ.110 కోట్లకు, టీజీ అప్పారెల్ అండ్ డెకార్ బ్రాండ్‌ను రూ.25 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ తెలిపింది. ఈ డీల్ 30– 45 రోజుల్లో పూర్తవ్వగలదని పేర్కొంది. ఎథ్నిక్ అప్పారెల్, యాక్సెసరీల విభాగంలో మరింత పటిష్టవంతం కావడానికి ఈ బ్రాండ్స్‌ను కొనుగోలు చేస్తున్నామని వివరించింది. 2012లో ఆరంభమైన జేపోర్ బ్రాండ్... చేతితో తయారు చేసిన దుస్తులను, ఆభరణాలను, హోమ్ టెక్స్‌టైల్స్‌ను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.39 కోట్ల ఆదాయం ఆర్జించింది. టీజీ అప్పారెల్ అండ్ డెకోర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.34 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. దేశవ్యాప్తంగా 2,714 బ్రాండ్ స్టోర్స్..... ఈ రెండు బ్రాండ్ల కొనుగోళ్లతో బ్రాండెడ్ ఫ్యాషన్ స్పేస్‌లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని ఎబీఎఫ్ఆర్ఎల్ ఎమ్డీ,, అశీష్ దీక్షిత్ పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఏబీఎఫ్ఆర్ఎల్ దేశవ్యాప్తంగా 750 నగరాల్లో 2,714 బ్రాండ్ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. లూయూ ఫిలప్, వాన్ హ్యూసెన్, అలెన్ సోలే, పీటర్ ఇంగ్లాండ్ వంటి బ్రాండ్ల దుస్తులను విక్రయిస్తోంది. పాంటలూన్స్ పేరుతో వేల్యూ ఫ్యాషన్ స్టోర్ బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తోంది. ద కలెక్టివ్, టెడ్ బేకర్, రాల్ఫ్ లూరెన్, అమెరికన్ ఈగిల్, సిమన్ కార్టర్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లను కూడా విక్రయిస్తోంది. బ్రాండ్ల కొనుగోళ్ల వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేర్ 0.3 శాతం లాభంతో రూ.219 వద్ద ముగిసింది. -
ఇక ఒకే కంపెనీ గూటికి... ఆదిత్య బిర్లా అపారెల్ బిజినెస్
భారీ పునర్వ్యవస్థీకరణకు ఓకే... ⇒ బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారాల విలీనం.. ⇒ కొత్త సంస్థ పేరు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ ⇒ విలీనంతో ఏర్పాటయ్యే కంపెనీకి రూ. 6,000 కోట్ల టర్నోవర్.. 1,869 రిటైల్ స్టోర్లు.. న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ తన బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులు(అపారెల్) వ్యాపారాలన్నింటినీ విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేసేవిధంగా భారీ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. పూర్తిగా షేర్ల రూపంలో జరిగే ఈ డీల్‌కు ఆయా కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. దీని ప్రకారం గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ఆదిత్య బిర్లా నువో(ఏబీఎన్‌ఎల్)కు చెందిన దుస్తుల వ్యాపారాలతో పాటు గ్రూప్‌లోని మరో సంస్థ మధుర గార్మెంట్స్ లైఫ్‌స్టైల్ రిటైల్ కంపెనీ(ఎంజీఎల్ఆర్సీఎల్)లను విడదీసి మరో లిస్టెడ్ కంపెనీ అయిన పాంటలూన్ ఫ్యాషన్ అండ్ రిటైల్(పీఎఫ్‌ఆర్‌ఎల్)లో విలీనం చేయనున్నారు. విలీనం అనంతరం దీని పేరు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్)గా మారుతుంది. కొత్తగా ఏర్పాటైన సంస్థకు దేశవ్యాప్తంగా 1,869 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లు.. అదేవిధంగా రూ.6,000 కోట్ల మేర ఆదాయం ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ‘మధుర గార్మెంట్స్, ఏబీఎన్‌ఎల్ రెడీమేడ్ వ్యాపారాలు, పాంటలూన్స్ను విలీనం చేయడం ద్వారా ఏర్పాటవుతున్న కొత్త సంస్థ..కూడా అతిపెద్దదిగా అవతరించనుంది. అంతేకాదు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రంగంలో భారత్‌లోనే టాప్ కంపెనీగా కూడా నిలవనుంది. వాటాదారులకు కూడా దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది’ అని గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఆదివారమిక్కడ విలేకరులతో పేర్కొన్నారు. ఈ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ప్రకారం.. ఏబీఎన్‌ఎల్ వాటాదారులకు ఏబీఎఫ్ఆర్ఎల్లో ప్రత్యక్షంగా షేర్‌హోల్డింగ్ లభిస్తుందన్నారు. షేర్ల కేటాయింపు ఇలా... మధుర ఫ్యాషన్స్‌ను విడదీస్తున్న కారణంగా(డీమెర్జర్) ఏబీఎన్ఎల్లో వాటాదారుల ప్రతి 5 షేర్లకుగాను పీఎఫ్ఆర్ఎల్లో 26 కొత్త షేర్లు లభిస్తాయి. ఇక మధుర లైఫ్‌స్టైల్ డీమెర్జర్ నేపథ్యంలో ఎంజీఎల్ఆర్సీఎల్లో ప్రతి 500 షేర్లకుగాను 7 పీఎఫ్‌ఆర్‌ఎల్ షేర్లు దక్కుతాయి. ఎంజీఎల్ఆర్సీఎల్ ప్రిఫరెన్స్ షేర్హోల్డర్లకు ఒక్కో కొత్త పీఎఫ్‌ఆర్‌ఎల్ షేరు లభిస్తుంది. కార్పొరేట్ అదేవిధంగా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి ఈ మొత్తం లవాదేవీలన్నీ వచ్చే 6-9 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా, పీఎఫ్ఆర్ఎల్లో ప్రస్తుతం ఉన్న 9.28 కోట్ల ఈక్విటీ షేర్ల పరిమాణం.. ఈ డీల్ పూర్తయ్యాక 77.28 కోట్లకు చేరుతుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తంమీద ఆదిత్య బిర్లా నువోలో వాటాదారులకు ప్రతి 100 ఈక్విటీ షేర్లకుగాను 520 అదనపు పీఎఫ్ఆర్ షేర్లు దక్కుతాయి. కాగా, కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ప్యాంటలూన్ రిటైల్‌లో మెజారిటీ వాటాను 2012లో ఆదిత్య బిర్లా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌కు వాన్ హూసెన్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్, లూయీస్ ఫిలిప్, పీపుల్ వంటి ప్రఖ్యాత రెడీమేడ్ దుస్తుల బ్రాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం పీఎఫ్‌ఆర్‌ఎల్ షేరు ధర(గురువారం ముగింపు) బీఎస్ఈలో రూ.113.90 వద్ద ఉంది. ఈ షేరు ముఖ విలువ రూ.10 కాగా.. మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.1,057 కోట్లు.