సాక్షి, భూపాలపల్లి: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది అభ్యర్థుల ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇటు కార్యకర్తలకు, అటు ఎన్నికల కార్యక్రమాలు, ప్రచారంలో పాల్గొన్న వారికి భోజన సదుపాయాలు, రోజూవారీ చెల్లింపులకు విపరీతంగా డబ్బులు కుమ్మరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పార్టీ నచ్చితే స్వచ్ఛందంగా చేరిన వ్యక్తులు సైతం ప్రస్తుతం నోట్లకు ఆశపడి ఎవరు డబ్బులిస్తే వారివైపు మారిపోతున్నారు. చివరికి రోడ్ షో అయినా బహిరంగ సభ అయినా పైసలు ఇవ్వనిదే జనాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీనికితోడు యువతను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు మద్యం, క్రికెట్ కిట్లు, ఇతరత్రా తాయిలాలను గతం నుంచే అలవాటు చేయడంతో ఇప్పుడు తప్పడం లేదని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అభ్యర్థులకు నిర్ణయించిన ప్రచార లెక్కల కంటే ఖర్చు అనేక రెట్లు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
రోజుకు మూడు పూటలు..
ఈసారి ఎన్నికల్లో కొత్త ప్రధాన పార్టీల అభ్యర్థులు నూతన సంప్రదాయాలకు తెరలేపారు. గతంలో ఎదైనా బహిరంగ సభ జరిగితేనో, కార్యకర్తల మీటింగ్‌లు ఉంటేనో భోజన సదుపాయాలు కల్పించేవారు. ప్రస్తుతం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని అభ్యర్థులు నిత్యం మూడు పూటలా పొయ్యి వెలగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు తయారు చేయాల్సిందే. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల వెంట తిరిగే కార్యాకర్తల నుంచి మొదలు ఎన్నికల ప్రచారానికి తరలించే జనం వరకు రోజుకు దాదాపు 500 మంది వరకు ఉంటున్నారు. వీరందరికీ భోజన వసతితోపాటు ప్రచారానికి వచ్చిన వారికి అదనంగా రోజు కూలీలా చెల్లింపులు చేస్తున్నారు.
సభలు, సమావేశాలకు..
గతంలో ఏదైనా మండలంలో ప్రచారం నిర్వహించాలంటే స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు ఖర్చులు భరించేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కార్యక్రమం ఏదైనా అభ్యర్థి స్వయంగా భరించాల్సిందే. సభలకు అవసరమయ్యే టెంట్ల నుంచి మొదలు కుర్చీలు, స్టేజీ డెకరేషన్లకు, సభలో జనాలకు పంచే వాటర్ ప్యాకేట్ల వరకు విపరీతంగా డబ్బు వెదజల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జనసమీకరణ అంటేనే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రామాల నుంచి సభాస్థలికి చేరాలంటే వాహనాలకు, అందులో వచ్చే ప్రజలకు రోజూవారీ భత్యంతోపాటు, భోజనాలు తప్పడంలేదు. గ్రామాల నుంచి ప్రజలను తరలించాలంటే రూ.200 నుంచి రూ.300 చెల్లించాల్సిదే. ఆ మొత్తం సైతం ముందుగా అడ్వాన్స్ ఇస్తేనే వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.
కోలాటాలు, డీజేలు..
కోలాటాలు, డీజేలు, డప్పు చప్పుళ్లు లేనిదే ఏ నాయకుడు ప్రచారానికి రావడం లేదు. ఒక రోజుకు నాలుగైదు గ్రామాల్లో పర్యటన ఉందనుకుంటే ముందు రోజే ఆయా గ్రామాల్లో కోలాటం ఆడే వారిని, డీజేలు, డప్పు కొట్టేవారిని సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కోలాటం ఆడేవారు టీంలుగా ఏర్పడి రోజుకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా అని వారికి కొంత ఉపాధి లభిస్తోంది. ఎన్నికలకు కళాకారుల డిమాండ్ పెరగడంతో గ్రామాల్లో కోలాటం రాణి మహిళలకు శిక్షణ ఇస్తూ ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ముట్టజెపుతున్నారు.
పార్టీ మారినా చెల్లింపులే..
ప్రస్తుతం పార్టీలు మారిన నాయకులకు ఎంతో కొంత ముట్టచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ స్థాయిలో మండల స్థాయి అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, జెడ్‌పీటీసీలు, మునిసిపాలిటీల్లో కౌన్సిలర్లు పార్టీ మారితే తాయిలాలు అందించాల్సిందే. గతంలో స్వచ్ఛందంగా తమకు నచ్చిన పార్టీ తీర్థం పుచ్చుకునే వారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. గ్రామ, మండల స్థాయిలో ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉండే నాయకులను ప్రధాన పార్టీలు తమవైపు తిప్పుకోవడానికి డబ్బులు, పదవులను ఎర వేస్తున్నారు. నాయకుడి స్థాయి, జనంలో అతడికి ఉన్న పలుకుబడిని బట్టి ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment