న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 21.3 శాతం. 2021–22లో మొత్తం రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ అంచనాల్లో ఇది 6.8 శాతం) ఉంటుందన్నది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా.ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం జూలై ముగిసే నాటికి లక్ష్యంలో 21.3 శాతానికి ద్రవ్యలోటు చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
తాజా గణాంకాలు ఇలా...
- జూలై ముగిసే నాటికి ప్రభుత్వానికి వచ్చిన ఆదా యం రూ.6.83 లక్షల కోట్లు (బడ్జెట్ మొత్తం అంచనాల్లో 34.6%). ఇందులో రూ.5,29,189 కోట్లు పన్ను ఆదాయాలు. రూ.1,39,960 కోట్లు పన్నుయేతర ఆదాయాలు. రూ.14,148 కోట్లు నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్. నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్‌లో రూ.5,777 కోట్ల రుణ రికవరీలు, రూ.8,371 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినవి ఉన్నాయి.
- ఇక ఇదే సమయంలో వ్యయాలు రూ.10.04 లక్షల కోట్లు (2021–22 బడ్జెట్‌లో 28.8 శాతం) వీటిలో రెవెన్యూ అకౌంట్ నుంచి రూ.8,76,012 లక్షల కోట్లు వ్యయమవగా, రూ.1,28,428 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి వ్యయం అయ్యాయి. రెవెన్యూ వ్యయాల్లో రూ.2,25,817 కోట్లు వడ్డీ చెల్లింపులుకాగా, రూ. 1,20,069 కోట్లు సబ్సిడీలకు వ్యయమయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 3.21 లక్షల కోట్లుగా ఉంది.
6.8 శాతం లక్ష్య సాధన కష్టమే!
2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని ద్రవ్యలోటు 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి : ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్
Comments
Please login to add a commentAdd a comment