సాక్షి, అమరావతి: దేశంలో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందిన వారే! వారి సంపాదన, ఖర్చులు, పొదుపు దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. మన మార్కెట్లు ప్రధానంగా ఆధారపడేది ఈ వర్గంపైనే. రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వీరంతా ప్రస్తుతం 31 శాతం ఉన్నారు. 2004–05లో దేశ జనాభాలో వీరు 14 శాతం మాత్రమే ఉండగా 2021–22 నాటికి రెట్టింపు దాటింది. 2030 నాటికి మిడిల్ క్లాస్ జనాభా 46 శాతానికి, 2047 నాటికి 63 శాతానికి పెరుగుతుందని అంచనా. పీఆర్‌ఐసీఈ (పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జూమర్ ఎకానమీ) సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 63 నగరాల్లో 10 లక్షల జనాభాను ప్రశ్నించి ఐసీఈ 360 సర్వే నిర్వహించారు.
నాలుగు విభాగాలుగా..
రూ.30 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను రిచ్ కేటగిరీగా పరిగణించారు. రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిని మధ్యతరగతి కేటగిరీగా, రూ.1.25 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని దిగువ తరగతిగా లెక్కించారు. రూ.1.25 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిని అల్పాదాయ వర్గాలుగా విభజించారు. ఆయా వర్గాల ఇళ్లలో సౌకర్యాలు, కొనుగోలు శక్తిని బట్టి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు.
ఆదాయం, ఖర్చు, పొదుపులో అగ్రభాగం..
ఆదాయార్జన, డబ్బు ఖర్చు చేయడం నుంచి పొదుపు చేయడం వరకు ఆర్థిక వ్యవస్థ చోదకాంశాల్లో మధ్యతరగతి ప్రజలే కీలకపాత్ర పోషిస్తున్నారు. 31% జనాభా ఉన్న మిడిల్ క్లాస్ ప్రజల ద్వారానే దేశంలోని మొత్తం ఆదాయంలో 50% వస్తోంది. 52% ఉన్న దిగువ తరగతి ప్రజలు 25% ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 4% ఉన్న ధనికులు 23% ఆదాయాన్ని అర్జిస్తున్నారు. 15% ఉన్న అల్పాదాయ వర్గాల ఆర్జన కేవలం 2%. మిడిల్ క్లాస్ ప్రజలు 48% మొత్తాన్ని ఖర్చు చేస్తుండగా దిగువ తరగతి ప్రజలు 32%, ధనికులు 17, పేదలు 3% ఖర్చు చేస్తున్నారు.
పొదుపులోనూ మిడిల్‌కా>్లస్‌దే అగ్రభాగం. 52 శాతాన్ని ఈ వర్గం ప్రజలే పొదుపు చేస్తున్నారు. 29 శాతాన్ని ధనికులు, 18 శాతాన్ని దిగువ తరగతి, ఒక శాతాన్ని పేదలు పొదుపు చేస్తున్నారు. మిడిల్ క్లాస్‌లో 97 శాతం మంది సీలింగ్ ఫ్యాన్ వినియోగిస్తుండగా 79% మంది ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉన్నారు.
93% మంది కలర్ టీవీని, 71% రిఫ్రిజిరేటర్, 30% కారును కొనుగోలు చేస్తున్నారు రూ.1.25 – రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన ప్రతి 10 మందిలో ఐదుగురు తప్పనిసరిగా బైక్ వినియోగిస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం ఉన్న ప్రతి పది కుటుంబాల్లో మూడు కుటుంబాలు కారు వాడుతున్నాయి. రూ.30 లక్షల ఆదాయం దాటిన ధనిక కుటుంబాలు తప్పనిసరిగా ఒక కారును కొనుగోలు చేస్తున్నాయి. కోటీశ్వరుల కుటుంబాల్లో సగటున మూడు చొప్పున కార్లు ఉంటున్నాయి.
సూపర్ రిచ్ కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. వార్షిక ఆదాయం రూ.2 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను ఈ కేటగిరీలో చేర్చారు. 1994–95లో ఈ కుటుంబాల సంఖ్య 98 వేలు కాగా 2020–21 నాటికి 18 లక్షలకు పెరిగింది. సూపర్ రిచ్ కుటుంబాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 6.4 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలున్నాయి.
ఆ తర్వాత ఢిల్లీ 1.81 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో గుజరాత్ (1.41 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలు), నాలుగో స్థానంలో తమిళనాడు (1.37 లక్షలు), ఐదో స్థానంలో పంజాబ్ (1.01 లక్షలు) ఉన్నాయి. దేశంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే నగరాల్లో సూరత్, నాగపూర్ ముందున్నాయి. అక్కడి ధనిక వర్గాలు 1994–95 నుంచి 2020–21 మధ్య బాగా వృద్ధి చెందాయి.
Comments
Please login to add a commentAdd a comment