సరిపడా ఇక్కడే ఆక్సిజన్‌ తయారీ చేసుకుందాం: సీఎం కేసీఆర్‌ | CM KCR Orders For Set Oxygen Plants In The State | Sakshi
Sakshi News home page

సరిపడా ఇక్కడే ఆక్సిజన్‌ తయారీ చేసుకుందాం: సీఎం కేసీఆర్‌

Published Tue, May 18 2021 1:23 AM | Last Updated on Tue, May 18 2021 11:02 AM

CM KCR Orders For Set Oxygen Plants In The State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ రోగుల చికిత్స కోసం రాష్ట్రంలోని 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 324 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని.. భవిష్యత్‌లో కూడా ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో 16 టన్నుల ప్లాంట్లు ఆరు, 8 టన్నుల ప్లాంట్లు పదిహేను, 4 టన్నులవి 27 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని.. అదనంగా హైదరాబాద్‌లో మరో 100 టన్నుల ప్లాంటును ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కోటీ 20 టన్నుల సామర్థ్యం గల 11 ఆక్సిజన్‌ ట్యాంకర్లను 10 రోజు ల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను కోరారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాబోయే రోజుల్లో ఆక్సిజన్‌ సరఫరా కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ సరఫరాలో పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత అనేదే ఉత్పన్నం కావొద్దన్నారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్‌ టెండర్లను పిలవాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సిన్ల కోటా విషయంలో నిరంతరం సంప్రదింపులు జరపాలని, త్వరగా తెప్పించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే వచ్చిందని.. ప్రస్తుతం 1,86,780 డోసుల స్టాక్‌ ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అందులో కోవాగ్జిన్‌ 58,230 డోసులు, కోవిషీల్డ్‌ 1,28,550 డోసుల స్టాక్‌ ఉందని తెలిపారు.

ప్రైవేటులో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం సహా భోజనం, మందులు వంటి సకల సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నామని.. పేదలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం కేసీఆర్‌ కోరారు. సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని.. అందులో ఆక్సిజన్‌ బెడ్లు 2,253, ఐసీయూ బెడ్లు 533, సాధారణ బెడ్లు 4,140 ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ సహా అన్నీ అందుబాటులో ఉన్నాయని.. జనం ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో ఎక్కడైనా వైద్యం ఒక్కటేనని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని కోరారు. వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 200 పడకల ఆస్పత్రిని తక్షణమే కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించాలని.. సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్‌ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులను కోవిడ్‌ సేవల కోసం వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఎక్కడైనా ప్రైవేటు ఆస్పత్రుల బిల్లులు కడ్తున్నది రోగులే..
ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ బెడ్ల కేటాయింపు, చికిత్సలకు ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 248 విడుదల చేసిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాలు కూడా ఇదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నాయని కేసీఆర్‌కు అధికారులు వివరించారు. ఆయా రాష్ట్రాల్లోనూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పేషెంట్లే తమ బిల్లులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

కోలుకుంటున్న వారి శాతం పెరుగుతోంది
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్, జ్వర పీడితుల సర్వే, కోవిడ్‌ కిట్ల పంపిణీ తదితర కారణాల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్‌ అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జిలు పెరగడం మంచి పరిణామమని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్న వారి శాతం మెరుగ్గా ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. జ్వర సర్వేలో కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తులను వైద్య బందాలు నిరంతరం సంప్రదిస్తూ, కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం పరికరాలు, మందులు
కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి సోకుతున్న నేపథ్యంలో.. దాని చికిత్స కోసం కోఠిలోని ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రి, జిల్లాల్లోని వైద్యకళాశాలల ఆస్పత్రులకు అవసరమైన పరికరాలు, మందులను సమకూర్చుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన 25 మైక్రో డీబ్రైడర్‌ మిషన్లు, హెచ్‌డీ ఎండోస్కోపిక్‌ కెమెరాలను తక్షణమే తెప్పించాలన్నారు.

రాష్ట్రంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు
వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌ లలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాత వైద్య కళాశాలల్లో నర్సింగ్‌ కాలేజీలు లేనిచోట్ల వాటిని మంజూరు చేయాలని.. ఇప్పటికే అనుమతులు వచ్చిన నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందుల సరఫరాకు వీలుగా కొత్తగా 12 రీజినల్‌ సబ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల కేంద్రాల్లో ఈ సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వీటి పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రులకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి అద్దె లేదా సొంత వాహనాలను తక్షణమే అందుబాటులోకి తేవాలని సూచించారు. మందులు నిల్వ చేయడానికి సబ్‌ సెంటర్లలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement