జార్ఖండ్ నుంచి ఒక రైలు బయలుదేరింది. అయితే అది మామూలు రైలు కాదు. ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’. దాదాపు 2000 కిలోమీటర్ల దూరం.... 27 గంటల ప్రయాణం. ముగ్గురు టీమ్. వారిలో లోకో పైలెట్ నీలిమా కుమారి కూడా ఉంది. ప్రాణాలు కాపాడే ప్రాణవాయువును తీసుకొని ఆఘమేఘాల మీద ఆమె బెంగళూరు చేర్చి ప్రశంసలు అందుకుంది.
కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా దేశంలోకి చాలా కీలకమైన విషయంగా మారాయి. ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల నుంచి ఆఘమేఘాల మీద ఆక్సిజన్‌ను చేరవేయడానికి భారత ప్రభుత్వం ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’లను మొదలెట్టింది. అంటే ఆక్సిజన్ ట్యాంకర్లు ఉన్న గూడ్స్ రైళ్లు ఇవి. వీటిని గమ్యానికి చేర్చడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. మామూలు గూడ్సు రైళ్లు అయితే ఆగినా, ఆలస్యమైనా పర్వాలేదు. కాని ఆక్సిజన్ రైలు మాత్రం సమయానికి చేరుకోవాల్సిందే. ఇటీవల అలా సమయానికి చేర్చి ప్రశంసలు అందుకున్న లోకో పైలెట్ (డ్రైవర్) నీలిమా కుమారి.
జార్ఖండ్ నుంచి
సోమవారం (మే 17) ఉదయం 7 గంటలకు జార్ఖండ్‌లోని జోలార్‌పేట్ డివిజన్ నుంచి 120 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. బెంగళూరు డివిజన్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది ఈ ట్రైనును గమ్యానికి చేర్చాలి. వారిలో సీనియర్ సిబ్బంది అయిన కుమార్ (బిహార్), వలి (కర్ణాటక) ఉంటే అసిస్టెంట్ డ్రైవర్‌గా నీలిమా కుమారికి బెంగళూరు డివిజన్ బాధ్యత అప్పజెప్పింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు మొదలయ్యాక మహిళా డ్రైవర్‌ను ఈ బాధ్యతకు ఉపయోగించడం ఇదే మొదటిసారి. బిహార్‌కు చెందిన నీలిమా కుమారి ఒక సంవత్సర కాలంగా బెంగళూరు డివిజన్‌లో లోకో పైలెట్‌గా పని చేస్తోంది. ఆమె వివాహిత. ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. జార్ఖండ్ నుంచి ఆక్సిజన్‌ను తీసుకొచ్చే బాధ్యత ను ఆమె సవాలుగా స్వీకరించింది.
100 కిలోమీటర్ల వేగంతో
ముగ్గురు సిబ్బంది తమ భుజాల మీద ఉన్న బాధ్యతను సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 25 గంటలు నాన్‌స్టాప్‌గా రైలును నడపాలి. అందుకు సిద్ధమయ్యారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు చేరడానికి మధ్యలో సిగ్నళ్ల అంతరాయం లేకుండా లైన్లు క్లియర్ చేయబడ్డాయి. 100 కిలోమీటర్ల వేగంతో రైలు గమ్యానికి చేరాల్సి ఉంటుంది. అనుకున్నట్టుగానే మధ్యలో ఒకటి రెండు చోట్ల తప్ప ముగ్గురూ కలిసి రైలును మరుసటి రోజు (మే 18) ఉదయం 8 గంటల సమయంలో బెంగళూరుకు చేర్చారు. ‘ఇది నాకెంతో సంతోషం కలిగించింది. కష్టాల్లో ఉన్నవారిని సకాలంలో ఆదుకునేందుకు మా రైలు సమయానికి చేరడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఆ పనిని సక్రమంగా చేయగలిగాను’ అని నీలిమా కుమారి అంది. సీనియర్ డ్రైవర్ కుమార్ ‘నా సర్వీసులో ఇంత ఉపయోగకరమైన డ్యూటీ ఎప్పుడూ చేయలేదు’ అనంటే మరో సీనియర్ డ్రైవర్ వలి ‘నేను రైలు మొదలైనప్పటి నుంచి గమ్యం చేరేంత వరకు ఇంజన్లో నిలబడే ఉన్నాను. కంటి మీద కునుకు వేయలేదు’ అన్నాడు. ఎందరో మహానుభావులు. అందుకే కరోనా బాధితులు సమయానికి సహాయం పొందగలుగుతున్నారు. కాకుంటే ఒక మహానుభావురాలు కూడా ఉండటం విశేషం కదా.
ఆక్సిజన్ తెచ్చింది
Published Sun, May 23 2021 1:42 AM | Last Updated on Sun, May 23 2021 2:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment