ఢిల్లీ: నీట్ పరీక్షా ప్రతాల లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇక, పేపర్ లీక్ ఘటనలో జార్ఖండ్‌లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే, నీట్ పేపర్లు లీక్ కావడానికి బీహార్‌కు చెందిన సంజీవ్ ముఖియా గ్యాంగ్ కారణమని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు.
కాగా, నీట్ పేపర్ల లీక్ ఘటనలో సంజీవ్ ముఖియా గ్యాంగ్ సైబర్ నేరగాళ్లతో టచ్‌లో ఉన్నట్టు బీహార్ పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్‌లో అరెస్ట్ అయిన ఐదుగురిలో ముగ్గురు సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఇక, వీరి వద్ద నుంచి పోస్ట్ డేటెడ్ చెక్కులు, పలు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో కూడా వీరి ప్రమేయం ఉంది. ఈ కేసులో సంజయ్ ముఖియా కొడుకు శివ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇక, నీట్ పరీక్షకు ముందు రోజు సంజీమ్ ముఖియా గ్యాంగ్ పాట్నాలోని లేర్న్ ప్లే స్కూల్‌తో సంబంధం ఉన్న బాయ్స్ హాస్టల్‌లో దాదాపు 25 మంది అభ్యర్థులను ఉంచినట్టు ఆరోపణలు వచ్చాయి. అదే హాస్టల్‌లో అభ్యర్థులకు పేపర్ లీక్, సమాధాన పత్రాలు అందించినట్టు సమాచారం. ఇక, ఈ కేసులో సంజీవ్ ముఖియా మేనల్లుడు రాఖీ కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాఖీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగం ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం విషయానికి సంబంధించి ఈడీ త్వరలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశముంది. ఈడీ పాత కేసుల్లో అరెస్ట్‌లు చేస్తోందని, వారి నెట్‌వర్క్‌లు, మనీలాండరింగ్ లింక్‌లపై విచారణ జరుపుతోందని సమాచారం.
పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బృందం బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. సోమవారం పాట్నాలోని బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి సీబీఐ బృందం కూడా చేరుకుంది. అక్కడ పేపర్ లీక్ కేసు దర్యాప్తుకు సంబంధించిన అన్ని వాస్తవాలను ఆర్థిక నేరాల విభాగం సీబీఐకి అప్పగించింది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ఎవరు ఎలాంటి పాత్ర పోషించారో ఈఓయూ తన విచారణలో కనుగొంది.
Comments
Please login to add a commentAdd a comment