రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ | An additional 230 metric tons of oxygen in two days | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌

Published Sat, May 15 2021 4:31 AM | Last Updated on Sat, May 15 2021 8:32 AM

An additional 230 metric tons of oxygen in two days - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రెండు రోజుల్లో అదనంగా 230 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రానుందని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వం రోజు వారీ కేటాయిస్తున్న 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌కు అదనమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయాలను అన్వేషించి ఆక్సిజన్‌ నిల్వలను పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి 2 ట్యాంకుల్లో 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రానుందన్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి కృష్ణపట్నం పోర్టులకు ఆ ట్యాంకర్లు చేరుకోనున్నాయన్నారు.

జామ్‌ నగర్‌ నుంచి మరో 110 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రైలు మార్గంలో ఆదివారం నాటికి గుంటూరుకు రానుందని తెలిపారు. జమ్‌షెడ్‌పూర్‌ నుంచి మరో 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రానుందన్నారు. రెండు రోజుల్లో మొత్తం 230 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి రానుందని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చే ఆక్సిజన్‌తో పాటు అదనంగా రానున్న ఆక్సిజన్‌ను రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో  నిల్వ చేయడం ద్వారా అత్యవసర సేవలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఇవే కాకుండా మరో రెండు మూడు ట్యాంకర్లు దుర్గాపూర్‌ నుంచి రానున్నాయన్నారు. దీనివల్ల రాయలసీమ జిల్లాలకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. అదనపు ఆక్సిజన్‌ను ప్రతి జిల్లాలో 10 నుంచి 20 టన్నుల వరకు నిల్వ చేస్తామని, రోజు వారీ వచ్చే ఆక్సిజన్‌లో ఎక్కడైనా జాప్యం జరిగితే ఈ నిల్వలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. 

24 గంటల్లో 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌
► గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందింది. చెన్నై ప్లాంట్‌లో ఇబ్బందులు రావడంతో ఐదారు రోజుల పాటు ఏపీకి రావాల్సిన ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోనుందని నిన్న (గురువారం) అర్ధరాత్రి సమాచారమిచ్చారు.
► వెంటనే అధికారులు కేంద్రంతో మాట్లాడారు. ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, సమస్యను పరిష్కరించారు.

పెరుగుతున్న డిశ్చార్జిలు 
► రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జిల సంఖ్య పెరుగుతుండటం శుభపరిణామం. దేశ వ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలో మరణాల శాతం తక్కువగా ఉంది.   
► రాష్ట్రంలో 6,453 ఐసీయూ బెడ్లలో 6,006 మంది రోగులు ఉన్నారు. 447 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23,204 ఆక్సిజన్‌ బెడ్లలో 22,029 మంది బాధితులు ఉన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 16,597 మంది చికిత్స పొందుతున్నారు. 
► గడిచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రైవేట్‌ ఆస్పత్రులకు పెద్ద మొత్తంలో 18,410 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను సరఫరా చేశాం. ప్రభుత్వాసుపత్రుల్లో 19,349 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. గత 24 గంటల్లో 104 కాల్‌ సెంటర్‌కు 13,868 ఫోన్లు వచ్చాయి. ఇందులో వివిధ సమాచారాల నిమిత్తం 5,444, అడ్మిషన్లకు 3,018,  కరోనా టెస్టులకు 2,914, టెస్ట్‌ రిజల్ట్‌ కోసం 1,886 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. 
► రాష్ట్రంలో వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ల పంపిణీ ఎలాంటి రద్దీ లేకుండా సాఫీగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొవాగి్జన్‌ వ్యాక్సిన్ల గురించి ఎదురు చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను సెకండ్‌ డోస్‌ గడువు ముగియక ముందే వేస్తున్నామన్నారు. 

నేటి నుంచి జ్వరాలపై ఇంటింటి సర్వే
► కరోనాను కట్టడి చేయడంలో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్లి జ్వర పీడితులను గుర్తించే సర్వే ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంటింటి సర్వేపై దిశా నిర్ధేశం చేశారు. 
► జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేయనున్నారు. దీనివల్ల కరోనాను కట్టడి చేయడమే కాక, ఆస్పత్రులపై ఒత్తడి కూడా తగ్గనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement