Special COVID vaccination drive for 45+ in Andhra Pradesh from May 24 - Sakshi
Sakshi News home page

45 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్‌

Published Mon, May 24 2021 3:35 AM | Last Updated on Mon, May 24 2021 9:23 AM

Anil Kumar Singhal Says That Corona cases decreasing from last three days - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్‌ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల  వారికి ఇస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని చెప్పారు. నేటి నుంచి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను 3 రోజుల పాటు వేయనున్నామన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పరిధిలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ఉంటే ఇష్టారాజ్యంగా ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం కేంద్రానికి లేఖ రాశారన్నారు. కొన్ని గ్రూపులు అంటే రైల్వే, ఆర్టీసీ, పోర్ట్‌లు, బ్యాంకులు, సివిల్‌ సప్లై, పాత్రికేయులు వంటి విభాగాల్లో ఉన్న వారికి వ్యాక్సిన్‌ వేయాలని చెప్పామన్నారు. సింఘాల్‌ ఇంకా ఏమన్నారంటే..

► తుపాన్‌ ప్రభావం కారణంగా ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బంది ఎదురవ్వకుండా అప్రమత్తంగా ఉన్నాం. రూర్కెలా, జామ్‌నగర్‌ వంటి చోట్ల నుంచి 70 మెట్రిక్‌ టన్నుల చొప్పున సేకరించాం.  
► మూడు రోజులుగా టెస్టులు తగ్గించకున్నా కేసులు రోజుకు వెయ్యి లెక్కన తగ్గుతూ వస్తున్నాయి.  పడకల లభ్యత పెరిగింది. 104కు వచ్చే కాల్స్‌ తగ్గాయి. ఇవన్నీ చూస్తే కరోనా కాస్త నెమ్మదిస్తున్నట్టు తెలుస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కోసం వెయ్యి ఇంజక్షన్లు వచ్చాయి. మరిన్ని వస్తున్నాయి. ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. 
► కృష్ణపట్నం మందుపై ఆయుష్‌ విభాగం నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ మందులో హానికారక దినుసులేవీ లేవని చెప్పారు. ప్రతి ఊళ్లో సంప్రదాయ మందులు వాడుతుంటారు. వాటికి అనుమతులు అవసరం లేదు. అయితే ఈ మందును ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే పరిశీలించాల్సి ఉంటుంది.
► రాష్ట్రంలో ఇప్పటి వరకు 78,78,604 మందికి వ్యాక్సిన్‌ వేశాం. 1.55 లక్షల డోసులు కోవాగ్జిన్, 11.58 లక్షల డోసులు కోవిషీల్డ్‌ను జిల్లాలకు పంపించాం. 23.38 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయింది. జూన్‌ 15 వరకు మన దగ్గర ఉన్నది, కేంద్రం ఇచ్చేది అంతా కలిపితే 28.56 లక్షల డోసులు అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement