సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలను కోవిడ్ నుంచి విముక్తి కల్పించేందుకు విదేశాల్లో ఎక్కడైనా వ్యాక్సిన్ లభిస్తే కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వ్యాక్సిన్ లభ్యత ఉంటే ఇప్పటికిప్పుడు రూ. 1,600 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధంగా ఉందన్నారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్ లభ్యత మొత్తం కేంద్రం చేతుల్లోనే ఉందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని తెలిపారు.
అందుకే కేంద్రం నుంచి అనుమతులన్నీ తీసుకుని బయట దేశాల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని కూడా చూస్తున్నామన్నారు. వ్యాక్సిన్ దొరికితే నెలలోగా అందరికీ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఇంకోచోట ఎక్కడైనా వేరే యూనిట్లలో ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉన్న వ్యాక్సిన్‌ను ముందుగా రెండో డోసు వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి మొదటి డోసు వేసేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న వాస్తవాలను వివరిస్తూ తాము చేస్తున్న విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు.
నేటి నుంచి కోవిడ్ సేవల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు
రాష్ట్రంలో సోమవారం నాటికి 648 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలు అందిస్తున్నామని సింఘాల్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 47,444 పడకలు అందుబాటులో ఉంటే అందులో ప్రస్తుతం 24,645 పడకల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందుతున్నారన్నారు. దీనిపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లకు సూచించామని చెప్పారు. కోవిడ్‌కు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా చికిత్స చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, పీజీ, బీఎస్సీ నర్సింగ్, హౌస్ సర్జన్స్, ఎంఎస్‌సీ నర్సింగ్ విద్యారి్థనులను కోవిడ్ సేవలకు వినియోగించుకోవాలని నిర్ణయించామని, మంగళవారం నుంచి ఈ ప్రక్రియ అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని, సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24,273 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్న 6,508 మందికి సలహాలు
గడిచిన 24 గంటల్లో 104 కాల్‌సెంటర్‌కు 16,663 కాల్స్ వచ్చాయని సింఘాల్ తెలిపారు. ఈ కాల్‌సెంటర్‌లో టెలీకన్సల్టెన్సీ సేవలు అందించడానికి 3,496 మంది వైద్యులు రిజిస్టర్ చేసుకున్నారని, ఇందులో 600 మంది స్పెషలిస్టులూ ఉన్నారని పేర్కొన్నారు. వీరు సోమవారం హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న 6,508 మందితో మాట్లాడి వైద్యపరమైన సూచనలు ఇచ్చారన్నారు.
కోవిడ్ కోసం ఇప్పటికే 17వేల మందిని పైగా నియమించామని, మరింత మంది నియామకం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్దాస్పత్రుల దగ్గరలో ప్రైవేటు భవనాలు, లేదా జర్మన్ హ్యాంగర్స్ టెక్నాలజీతో కూడిన ఏర్పాట్లు చేసి తక్షణమే కనీసం 50 బెడ్‌లైనా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వైద్యం కోసం ఆస్పత్రి ఆవరణంలో ఎవరూ కనిపించకూడదని కలెక్టర్లకు సూచించామని తెలిపారు. మంగళవారం జరిగే స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో కోవిడ్‌పై వివరాలు తెలుసుకుంటారని, బుధవారం కోవిడ్ నియంత్రణకు నియమించిన మంత్రుల కమిటీ సమావేశం జరుగుతుందని సింఘాల్ చెప్పారు.
విదేశీ వ్యాక్సిన్ల కొనుగోలుకైనా సిద్ధం
Published Tue, May 11 2021 3:48 AM | Last Updated on Tue, May 11 2021 11:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment