డాక్టర్ ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్
కోవిడ్–19 పేషెంట్స్‌లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుంది? ఎంత పరిమాణంలో ఇవ్వాలి? ఏ రకమైన పరికరాల్లో ఉపయోగించుకోవాలి? అనే అంశాలు ముఖ్యం. వీటి గురించి సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ ఏం చెప్పారంటే...
కరోనా బాధితుల్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుందో తెలుసుకోవాలంటే ముందుగా రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకోవాలి. దీన్ని పల్స్‌ఆక్సీమీటర్ సహాయంతో తెలుసుకుంటాం. నార్మల్ గా 95 నుంచి 100 శాతం వరకు ఆక్సిజన్ శాచ్యురేషన్ ఉంటుంది. అయితే కోవిడ్ బాధితుల్లో ఆక్సిజన్ క్రమంగా తగ్గుతుంది. చాలా మందిలో ఇది అస్సలు తగ్గకుండానే జబ్బు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో మాత్రం ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. 94 శాతం కన్నా ఆక్సిజన్ శాచ్యురేషన్ తక్కువుంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉందని అర్థం. అదే విధంగా ఆక్సిజన్ 90 కన్నా తగ్గుతున్నప్పుడు ఐసీయూలో చికిత్స అవసరమని అర్థం. అయితే ఇంట్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం అవుతుంది. ఈ ఆక్సిజన్ ని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుందాం.
ఇంట్లో ఆక్సిజన్ ఎవరికి అవసరం?
ఆక్సిజన్ శాచ్యురేషన్ 94 కన్నా తక్కువున్నప్పుడు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆస్పత్రుల్లో బెడ్ దొరకటం కష్టంగా మా రింది. ఈ సమయంలో ఆస్పత్రిలో అడ్మిషన్ దొరికేలోగా మనం కొంతమేరకు ఆక్సిజన్ ఇవ్వగలిగితే పేషెంట్‌కు ఆక్సిజన్ శాచ్యురేషన్ మరింత తగ్గిపో కుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరికొంతమంది ఆస్పత్రిలో అడ్మిట్ అయి కోలుకున్న తర్వాత మరి కొంతకాలం వరకు ఇంట్లో ఆక్సిజన్ అవసరం పడే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లకి కూడా ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవడం తప్పనిసరి.
ఇంట్లో ఏ విధంగా అమర్చుకోవాలి?
ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవడానికి ప్రధానంగా రెండు పద్ధతులు. ఒకటి ఆక్సిజన్ సిలిండర్ అమర్చుకోవడం.. మరొకటి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ని పెట్టుకోవడం.
సిలిండర్‌తో లాభనష్టాలేంటి?
ఆక్సిజన్ సిలిండర్లు మరీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు. వీటి నుంచి నాణ్యమైన ఆక్సిజన్ వస్తుంది. కరెంటు లేనప్పుడు కూడా ఈ సిలిండర్ పనిచేస్తుంది. అయితే సిలిండర్‌లో ఆక్సిజన్ అయిపోయినప్పుడు మళ్లీ నింపుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆక్సిజన్ దొరకకపోతే ఇబ్బంది.
కాన్సన్‌ట్రేటర్‌తో లాభనష్టాలేంటి?
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు 24 గంటలు పని చేస్తాయి. దీని ద్వారా ఆక్సిజన్ అయిపోవడం అనే సమస్య ఉండదు. ఒకసారి కొనుక్కున్న లేదా అద్దెకు తీసుకున్న తర్వాత ఆక్సిజన్ సరఫరా నిరంతరాయంగా ఉండే అవకాశం ఉంటుంది.
► వీటితో కొన్ని సమస్యలు ఉంటాయి. వీటి ఖరీదు చాలా ఎక్కువ. కరెంటు పోయినప్పుడు ఈ కాన్సన్‌ట్రేటర్లు పని చేయవు. అప్పుడు బ్యాకప్ జనరేటర్ వీటికి అవసరమవుతుంది.
► ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లో నుంచి వచ్చే ఆక్సిజన్ క్వాలిటీ వివిధ రకాలుగా ఉంటుంది. మెడికల్‌గా కావాల్సిన ఆక్సిజన్ నాణ్యత 90 శాతం ఉంటుంది. 90 శాతం కన్నా తక్కువైతే పేషెంట్ ఆక్సిజన్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది.
కాన్సన్‌ట్రేటర్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ ఒత్తిడితో కూడిన గాలిని ఫిల్టర్‌లో ప్రవేశపెడుతుంది. ఈ ఫిల్టర్‌కు గాలిలో ఉన్న నైట్రోజన్‌ని పీల్చేసే సామర్థ్యం ఉంటుంది. నైట్రోజన్‌ను పీల్చేసిన తర్వాత ఆక్సిజన్ శాతం ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పని చేస్తుంది.
కాన్సన్‌ట్రేటర్‌లు ఎన్ని రకాలు?
ఇవ్వగలిగిన ఆక్సిజన్‌ని బట్టి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని ఐదు లీటర్లు ఆక్సిజన్ ఇవ్వగలిగితే, కొన్ని 10 లీటర్లు ఇవ్వగలుగుతాయి. అయితే కొన్నిరకాల కాన్సన్‌ట్రేటర్లలో తక్కువ పరిమాణం ఆక్సిజన్ వచ్చేటప్పుడు మాత్రం 90 శాతానికి పైగా ఆక్సిజన్ వస్తుంది కానీ ఎక్కువ పరిమాణం అవసరమైనప్పుడు మాత్రం ఆక్సిజన్ శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొన్ని ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లతో 30 నుంచి 90 వరకు ఆక్సిజన్ శాతం వస్తుంది అని ఉంటుంది.
అంటే.. సుమారుగా ఒకటి లేదా రెండు లీటర్లు అవసరమైనప్పుడు ఈ కాన్సన్‌ట్రేటర్లు 90 శాతం ఆక్సిజన్ ఇస్తాయి. అయితే సుమారుగా 5 లీటర్ల పైన ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇవి కేవలం 30 శాతం ఆక్సిజన్ మాత్రమే ఇస్తాయి. ఎక్కువ పరిమాణం అవసరమైనప్పుడు కూడా 90 శాతం పైన ఆక్సిజన్ ఇవ్వగలిగిన కాన్సన్‌ట్రేటర్లను ఎంచుకోవడం ముఖ్యం. ఈ రకం కాన్సన్‌ట్రేటర్లు ఎక్కువ బరువు ఉంటాయి.
ఇంట్లో అమర్చుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆక్సిజన్ కూడా ఒక మందు లాంటిదే. మందు ఎక్కువైనప్పుడు లేదా తక్కువైనప్పుడు ఎలాంటి దుష్ఫలితాలువస్తాయో,ఆక్సిజన్ ఎక్కువైనా లేదా తక్కువైనా కూడా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇంట్లో ఆక్సిజన్ అమర్చుకోవాలి.
► ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ గోడకి ఒకటి లేదా రెండు అడుగుల దూరంలో ఉంచాలి.
► దీన్ని ఉపయోగించేటప్పుడు గది తలుపులు తెరిచి ఉంచితే మంచిది. ఎందుకంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ని అది శుద్ధి చేసినప్పుడు గాలిలో నైట్రోజన్ శాతం పెరుగుతూ ఉంటుంది. అందుకని తలుపులు తీసి ఉంచినట్లయితే నైట్రోజన్ శాతం పెరగకుండా ఉంటుంది.
► ఆక్సిజన్ శాచ్యురేషన్‌ని క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఇది తగ్గుతూ ఉంటే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి.
► ఆక్సిజన్ సిలిండర్స్‌ని వాడుతున్నప్పుడు అవి పేలి పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మంటలు అంటుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నిప్పుకి వాటిని దూరంగా ఉంచాలి.
► బాగా తీవ్రంగా జబ్బు ఉన్న వాళ్ళకి ఇంటిదగ్గర ఆక్సిజన్ ఇవ్వటం మంచిది కాదు. అలాంటి వాళ్లు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేలోపు మాత్రమే వాడితే మంచిది.
► రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్నపుడు కేవలం ఆక్సిజన్ ఇవ్వడం మాత్రమే కాకుండా డాక్టర్లు ఇంకా కొన్ని రకాలైన వైద్య చికిత్సలు చేస్తారు. కొన్ని రకాల ఇంజక్షన్స్ ఇవ్వడం, కొన్ని రక్తపరీక్షలు చేయడం, కొన్నిసార్లు ఎన్‌ఐవీ ఉపయోగించటం లాంటివి చేస్తారు. కాబట్టి ఆక్సిజన్ అవసరం పడుతున్నప్పుడు వైద్యులను సంప్రదించటం
తప్పనిసరి.
► దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ తక్కువ మోతాదులో అవసరం పడొచ్చు. వాళ్లకి మరీ ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చినా కూడా ప్రమాదం. అందువల్ల పల్మనాలజిస్ట్ సలహాతో ఎంత ఆక్సిజన్ పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment