
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిశా నుంచి ప్రత్యేక ఆక్సిజన్ రైళ్లను నడపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి రైల్వేబోర్డు చైర్మన్ సునీత్‌శర్మకు మంగళవారం లేఖ రాశారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న ఆటంకాలు, ఇబ్బందులను లేఖలో వివరించారు. సకాలంలో ప్రాణవాయువు రవాణా చేయడం ద్వారా వేలాదిమంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో భారతీయ రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆక్సిజన్ రైళ్లు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు.
సెకండ్‌వేవ్ రాష్ట్రంలో కూడా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అపరిమితంగా పెరిగిపోయిందని, కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ప్రాణవాయువు అవసరం కీలకంగా మారిందని తెలిపారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ రవాణా కోసం 10 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కేటాయించాలని ఎంపవర్డ్ గ్రూప్ చైర్‌పర్సన్ సునితాదావ్రాను కోరగా 2 కేటాయించారని తెలిపారు. ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిశా నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ నిల్వలను రవాణా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ రైళ్లను నడిపేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే లేదా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు వెంటనే ఆదేశాలు జారీచేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment