సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో నగరంలో ఆ పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వారం భారత వైమానిక దళానికి చెందిన సీ–17 విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపింది. అక్కడి ప్లాంట్లలో రాష్ట్రానికి కేటాయించిన లిక్విడ్ ఆక్సిజన్ తీసుకుని ఆ ట్యాంకర్లు రోడ్డు మార్గంలో నగరానికి చేరుకున్నాయి. అవన్నీ ప్రైవేట్ ట్యాంకర్లే అయినప్పటికీ వాటిని డ్రైవ్ చేయడానికి మాత్రం టీఎస్‌ఆర్టీసీకి చెందిన సమర్థులైన డ్రైవర్లను ఎంపిక చేశారు.
అలా వాయుసేన విమానంలో ట్యాంకర్‌ను తీసుకువెళ్లి.. రోడ్డు మార్గంలో ప్రాణవాయువును తీసుకువచ్చినన డ్రైవర్లలో ముషీరాబాద్–1 డిపోకు చెందిన ఎం.బాబయ్య ఒకరు. అనునిత్యం కోఠి–పటాన్‌చెరు మధ్య ‘218 రూట్’లో బస్సును నడిపే ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇవి...
► లిక్విడ్ ఆక్సిజన్‌ను అత్యవసరంగా నగరానికి తెప్పించాలని ప్రభుత్వం భావించింది. ఆ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో ఒడిశాకు పంపినా... ఆక్సిజన్ నింపిన తర్వాత మాత్రం రోడ్డు మార్గంలో రావాల్సిందే అని ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.
► నిండుగా ఉన్న ట్యాంకర్లను విమానంలో తీసుకురావాలని ప్రయత్నిస్తే టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. దీంతో ఆ ట్యాంకర్లను రోడ్డు మార్గంలో తీసుకువచ్చే బాధ్యతల్ని టీఎస్‌ఆర్టీసీ డ్రైవర్లకు అప్పగించారు.
► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ డిపోల్లో పని చేస్తున్న డ్రైవర్ల వివరాలు క్రోడీకరించిన అధికారులు బెస్ట్ డ్రైవర్లను ఎంపిక చేశారు.
► ముషీరాబాద్–1 డిపో నుంచి ముగ్గురు, మిథానీ డిపో నుంచి ఒకరు, హయత్‌నగర్–2 డిపో నుంచి ఇద్దరు, ముషీరాబాద్–2 డిపో నుంచి ఒకరు ఆక్సిజన్ రవాణాకు ఎంపికయ్యారు.
► అలాంటి వారిలో ముషీరాబాద్–1 డిపోకు చెందిన ఎం.బాబయ్య కూడా ఒకరు. ఈ పది మంది డ్రైవర్లు గత నెల 22న బేగంపేటలోని విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్ అధికారులు వీరికి వివిధ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇద్దరు వెనక్కు వెళ్లగా.. బాబయ్య సహా ఎనిమిది మంది ఒడిశా వెళ్లడానికి ఎంపికయ్యారు.
► ప్రతి ట్యాంకర్‌తోనూ దాని డ్రైవర్‌తో పాటు ఆర్టీసీ డ్రైవర్‌ను పంపారు.
► ట్యాంకర్ డ్రైవింగ్ బాధ్యత మాత్రం ఆర్టీసీ డ్రైవర్‌దే. గత నెల 23న సాయంత్రం 7 గంటలకు సీ–19 విమానంలో బేగంపేట నుంచి బాబయ్య డ్రైవర్‌గా ఉన్న ట్యాంకర్ బయలుదేరింది. దీంతో పాటు మరో రెండు ట్యాంకర్లు కూడా ఈ విమానంలో భువనేశ్వర్ వరకు వెళ్లాయి.
► అదే రోజు రాత్రి 8.10 గంటలకు ఈ విమానం భువనేశ్వర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడ నుంచి బాబయ్య తనకు కేటాయించిన ట్యాంకర్‌ను నడుపుకుంటూ 150 కి.మీ. దూరంలో ఉన్న అంగుల్ చేరుకునే సరికి అర్థరాత్రి ఒంటి గంట అయింది.
► ట్యాంకర్‌ను శుభ్రం చేసి, అందులో ఆక్సిజన్ నింపుకుని, బయలుదేరే సరికి 24వ తేదీ రాత్రి ఒంటి గంట అయింది. లోడ్‌తో ఉన్న ట్యాంకర్లను నడపడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని పాటిస్తూ 1150 కిమీ ప్రయాణించి హైదరాబాద్ చేరుకునే సరికి సోమవారం రాత్రి అయింది.
► బాబయ్య నడిపిన ట్యాంకర్‌లోని లిక్విడ్ ఆక్సిజన్‌ను కింగ్ కోఠి ఆసుపత్రితో పాటు ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిల్లోని ట్యాంకుల్లో నింపారు. గత నెల 26 రాత్రి (సోమవారం) రాత్రి 2 గంటలకు బేగంపేట విమానశ్రయంలో ట్యాంకర్లు అప్పగించారు బాబయ్య.
బాధ్యతగా భావించా
మాది యాదాద్రి జిల్లా రామన్నపేట. ఇంటర్మీడియట్ వరకు చదివా. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే డ్రైవింగ్ చేస్తున్నా. హెవీ వాహనాలు, ట్యాంకర్లు నడిపిన అనుభవం కూడా ఉంది. 2006 నుంచి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నా. కోవిడ్ పేషెంట్లకు సహకరించే అవకాశం దక్కడం ఓ బాధ్యతగా భావించా. అందుకే ఒడిశా వెళ్లి ఆక్సిజన్ తీసుకువచ్చా. ఈ రకంగా నాకు యుద్ధవిమానం ఎక్కే అవకాశం దక్కింది.
– ఎం.బాబయ్య, ఆర్టీసీ డ్రైవర్
( చదవండి: '1జీబీ ఆగ పట్టుకొని పెళ్లి చూడండి.. ఎవరింట్ల వాళ్లు బువ్వు తినుర్రి' )
Comments
Please login to add a commentAdd a comment