సాక్షి, అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు మరణించిన ఘటనపై చిత్తూరు కలెక్టర్ మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాధితులు మరణించారని తన నివేదికలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామి వివరించారు. అలాగే ఆక్సిజన్ పీడనం తగ్గినప్పుడు అప్రమత్తం చేసే అలారం పనిచేయలేదని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు మరణించిన ఘటనలో బాధ్యులైన అధికారులు, ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత, శాప్ మాజీ చైర్మన్ మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment