
సాక్షి, అమరావతి: శ్రీ భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ అలసత్వం వల్లే.. సకాలంలో ఆక్సిజన్ అందక తిరుపతి ‘రుయా’ ఘటన జరిగిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. మరణాలకు కారణమైన సదరు కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు ఉత్తర్వులిచ్చినట్లు ప్రభుత్వం వివరించింది.
రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు చనిపోయిన ఘటనకు బాధ్యులైన అధికారులు, యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను తమ ముందుంచాలని ఆదేశాలిచ్చింది. దీంతో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ అఫిడవిట్ దాఖలు చేశారు.