
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రోగులకోసం ఉపయోగించే మెడికల్ ఆక్సిజన్‌కు కొరత ఏర్పడటంతో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, ప్రైవేటు ఆస్పత్రుల యాజ మాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొన్ని ఆస్ప త్రులు శస్త్రచికిత్సలు కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఐసీయూల్లో ఉన్న రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగురోజుల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. నిత్యం సరఫరాచేసే కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో వరంగల్ ఎంజీఎం ఆçస్పత్రితోసహా పలు ప్రభుత్వ ఆసుపత్రులు అత్యవసర శస్త్రచికిత్సలు మినహా మిగిలిన ఆపరేషన్లను వాయి దా వేసుకున్నాయి.
కొన్ని ప్రైవేట్ ఆçస్పత్రులు మాత్రం బెంగళూరు నుంచి తెప్పించుకున్నాయి. గత ఏడాది గోరఖ్‌పూర్ బీఆర్టీ ఆçస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో వందకుపైగా చిన్నారులు మృతిచెందిన ఘటన ఇంకా మరవకముందే, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వైద్యవర్గాల్లో కలకలంరేపింది. సర్జరీ సమయంలో, ఐసీయూ ట్రీట్‌మెంట్, ఇన్హలేషన్ థెరపీకోసం ద్రవరూప ఆక్సిజన్‌ను వాడుతున్నారు. అంతేకాకుండా ఆస్తమా, బ్రాంకైటీస్ రోగులకోసం ద్రవరూప ఆక్సిజన్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు ద్రవరూప ఆక్సిజన్‌ను తయారుచేసి సిలిండర్లలో నింపి సరఫరా చేస్తుంటాయి. రాష్ట్రంలో 2 అంతర్జాతీయ సంస్థలు డీలర్ల ద్వారా సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. ఆయా సంస్థల్లో తలెత్తిన లోపంవల్ల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి 2 రోజుల తర్వాత సరఫరా పునరుద్ధరించటంతో వైద్యవర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.