ఇంట్లోనూ మాస్క్‌ ధరించండి..ఎందుకంటే ? | COVID-19: Time to wear mask even inside your homes | Sakshi
Sakshi News home page

ఇంట్లోనూ మాస్క్‌ ధరించండి..ఎందుకంటే ?

Published Tue, Apr 27 2021 4:51 AM | Last Updated on Thu, May 27 2021 4:43 PM

COVID-19: Time to wear mask even inside your homes - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌పై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలకు పారదోలేందుకు, అప్రమత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇళ్లలోనే ఉండి, ఇంట్లోనూ మాస్క్‌ ధరించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలను కోరింది. కేసుల తీవ్రత గురించి ఎలాంటి భయానికి గురి కావద్దని తెలిపింది అనవసర ఆందోళనతో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పేర్కొంది.  దేశంలో అవసరానికి సరిపోను ఆక్సిజన్‌ నిల్వలున్నాయని, రవాణాలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది.

కోవిడ్‌ బాధితుల్లో అత్యధికులు ఇంట్లో ఉండే చికిత్స పొందవచ్చనీ, డాక్టర్లు సూచిస్తేనే ఆస్పత్రుల్లో చేరాలంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్, హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, హోం శాఖ అదనపు కార్యదర్శి పియూష్‌ గోయెల్, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పరిస్థితుల తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ప్రజల్లో తలెత్తుతున్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు.  ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో రెమిడెసివిర్, తోసిలిజుమాబ్‌ వంటి ముఖ్యమైన ఔషధాల వినియోగానికి సరైన ప్రిస్క్రిప్షన్‌ అవసరమని ఆరోగ్య శాఖ తెలిపింది.

రెమిడెసివిర్, తోసిలిజుమాబ్‌ మాదిరిగా ప్రభావం చూపే చౌకైన, తేలిగ్గా అందుబాటులో మందులు చాలానే ఉన్నాయి. వాటిని వాడటం మంచిది. మెడికల్‌∙ఆక్సిజన్‌ దేశంలో వైద్య వినియోగానికి తగినంత ఉన్నప్పటికీ, దానిని ఆసుపత్రులకు రవాణా చేయడం సవాలుగా మారిందని పేర్కొంది. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లకు, ఆక్సిజన్‌ డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు దూరం ఎక్కువగా ఉందని వివరించింది. న్యాయమైన పద్ధతిలో ఆక్సిజన్‌ వాడాలని, దాని వృథాను ఆపాలని కేంద్రం రాష్ట్రాలు, ఆసుపత్రుల యాజమాన్యాలను కోరింది.వైద్యేతర అవసరాలకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ను వాడరాదంటూ ఆదివారం కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధం నుంచి యాంపుల్స్, వయెల్స్, ఫార్మాస్యూటికల్, రక్షణ బలగాలు అనే మూడు రంగాలను మినహాయిస్తూ సోమవారం మరో ఉత్తర్వు వెలువరించింది.  

ఒక్కో వ్యక్తి నుంచి 406 మందికి..
గత ఏడాది మొదటి వేవ్‌తో పోలిస్తే ఈసారి వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది కంటే 2.25 రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో, కర్ణాటకలో 3.3 రెట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5 రెట్లు ఎక్కువగా కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దూరం పాటించకుంటే ఒక్కో బాధితుడి ద్వారా 30 రోజుల్లో 406 మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందని డాక్టర్‌ పాల్‌ తెలిపారు. భౌతికదూరం 50% పాటించినట్లయితే, ఒక్కో వ్యక్తి ద్వారా 15 మందికి మాత్రమే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు రుజువైంది. భౌతిక దూరాన్ని 75% పాటించిన బాధితుడి ద్వారా 30 రోజుల్లో 2.5 మందికే వైరస్‌ సోకుతుంది. వ్యాక్సినేషన్‌కు, మహిళల పీరియడ్స్‌కు సంబంధంలేదని స్పష్టం చేశారు.  

వ్యాక్సినేషన్‌కు కొత్త విధానం
కొత్త వ్యాక్సినేషన్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరత ఉందంటూ ఎక్కువ మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో 90 శాతం మందికి జ్వరం,  ఒళ్లునొప్పుల వంటి వాటితో స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. వీరికి జ్వరానికి ఇచ్చే మందులు, ఆవిరి పట్టడంతో వ్యాధిని తగ్గించవచ్చు. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత ఆక్సిజన్‌ సంతృప్తికర స్థాయిలో ఉండి, స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో జాయినవ్వాలని కోరుకుంటున్నారు.

మధ్యస్త, తీవ్ర స్థాయి కేసుల్లో 5వ రోజు నుంచి 7వ రోజు తర్వాత మాత్రమే ఆక్సిజన్‌తో అవసరం ఉంటుంది. అంతకంటే ముందుగా ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మొదటి, రెండో రోజే చికిత్స సమయంలో ఆక్సిజన్‌ అందిస్తే సైడ్‌ ఎఫెక్ట్సు తలెత్తే ప్రమాదం ఉంది. కోవిడ్‌ బాధితులకు అందజేసే రెమిడెసివిర్, టొసిలిజుమాబ్‌ వంటి ఔషధాలను హేతుబద్ధంగా ఆస్పత్రులు వాడాలి. పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లపై రెమిడెసివిర్‌ ప్రభావం ఇంకా నిర్థారణ కానందున, బదులుగా వేరే మందులను వాడుకోవచ్చు.  

ఆక్సిజన్‌ ట్యాంకులకు జీపీఎస్‌
దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు చాలినన్ని ఉన్నాయని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే, ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాల నుంచి తక్షణం అవసరం ఉన్న చోటికి ఆక్సిజన్‌ తరలింపు సమస్యగా మారింది. భారత వైమానిక దళ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్‌ ట్యాంకర్లను తరలించడం ద్వారా రవాణా సమయం తగ్గింది. కేసులు ఒక్కసారిగా పెరగడంతో దేశంలో ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరిగింది.  ఆక్సిజన్‌ ట్యాంకర్ల కదలికలను జీపీఎస్‌ ద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కొరత తీరుస్తున్నాం.  

స్థానిక కంటెయిన్‌మెంట్‌ విధానం
కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు గుర్తించిన జిల్లాలు, ప్రాంతాల్లో స్థానిక ప్రాతిపదికన కంటెయిన్‌మెంట్‌ ప్రణాళికలను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. దీనికి సంబంధించి ఈ నెల 25న కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ వెలువరించిన మార్గదర్శకాలను పాటించాలంది. కంటెయిన్‌మెంట్‌ వ్యూహాలకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి స్వేచ్ఛ కల్పించి, పక్కాగా అమలయ్యేలా చూడాలి. ప్రస్తుత వేవ్‌ను ఒక స్థాయికి నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం లకి‡్ష్యత కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది.

ఇందుకోసం, గత వారం రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం, అంతకంటే ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాలను, కోవిడ్‌ బాధితుల్లో 60 శాతం కంటే మించి ఆక్సిజన్‌ అవసరమయ్యే లేదా ఐసీయూలో చేరిన వారున్న ప్రాంతాలను గుర్తించాలని కోరింది. ఈ రెండు అంశాల్లో ఏ ఒక్కటి సరిపోలినా సంబంధిత జిల్లాలో కంటెయిన్‌మెంట్‌ చర్యలను తక్షణం తీసుకోవాలని తెలిపింది. ఆ ప్రాంతంలోని ప్రజలు 14 రోజులపాటు కలుసుకోకుండా చూడటం ద్వారా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చంది. కాగా, కోవిడ్‌ తీవ్రత కట్టడి వ్యూహాలను సమన్వయం చేసుకునేందుకు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ఆధ్వర్యంలో ఎంపవర్డ్‌ గ్రూప్‌–3 సోమవారం లక్షమందికి పైగా పౌర సంస్థల సభ్యులతో సమావేశమైంది.   

ఇంట్లోనూ మాస్క్‌ ఎందుకు?
ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్‌లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా ఈ వైరస్‌ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్‌ ధరించాలని చెప్పాం. ప్రస్తుతం వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌ ధరించాలని కోరుతున్నాం. ఇంట్లో ఇతరులతో కలిసి కూర్చున్నప్పుడు మాస్క్‌ ధరిస్తే వైరస్‌ వ్యాప్తి చెందదు. ఇంటికి అతిథులను ఆహ్వానించవద్దు. పాజిటివ్‌గా తేలిన వారు ఆస్పత్రుల్లోనే చేరాల్సిన అవసరం లేదు. వారిని వేరుగా గదిలో ఉంచవచ్చు. వారి ద్వారా ఇతర కుటుంబసభ్యులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వసతులు లేకుంటే ఐసోలేషన్‌ కేం ద్రాలకు వెళ్లవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement