వాయువేగంతో ప్రాణ వాయువు  | The Department Of Health Is Driving All Sources Of Oxygen | Sakshi
Sakshi News home page

వాయువేగంతో ప్రాణ వాయువు 

Published Fri, May 14 2021 3:13 AM | Last Updated on Fri, May 14 2021 2:24 PM

The Department Of Health Is Driving All Sources Of Oxygen - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ బాధితులకు అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది. సగటున రోజుకు 22 వేల మందికి పైగా కోవిడ్‌ పేషెంట్లకు ఆక్సిజన్‌ బెడ్‌లపై వైద్యం అందుతుండగా 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా తరలిస్తూ ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు సరఫరా చేయడం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా గాలిని కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడంతో ఆక్సిజన్‌ను ఒడిశాలోని ప్లాంట్ల నుంచి విమానాలు, ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం తెప్పిస్తోంది.

విదేశాల నుంచి నౌకల ద్వారా కూడా దిగుమతి చేసుకుంటోంది. దీంతో నెల రోజుల క్రితం రోజుకు 350 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే సరఫరా చేయగలిగిన రాష్ట్రం ఇప్పుడు సామర్థ్యాన్ని 600 మెట్రిక్‌ టన్నులకు పెంచుకుంది. ఏ ఒక్క కోవిడ్‌ బాధితుడూ ఇబ్బంది పడకుండా వందల కిలోమీటర్ల నుంచి ఆక్సిజన్‌ను తీసుకొచ్చి ఆస్పత్రులకు చేరవేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్‌ వనరులన్నీ ఒడిసిపట్టి మెడికల్‌ ఆక్సిజన్‌గా మార్చి రోగులకు అందిస్తుండటాన్ని వైద్య నిపుణులు అభినందిస్తున్నారు. 


54 నుంచి 78 ట్యాంకర్లకు..
రాష్ట్రంలో ఏప్రిల్‌ మొదటి వారంలో ఆక్సిజన్‌ సరఫరా ట్యాంకర్లు 54 మాత్రమే ఉండగా ఇప్పుడు 78కి చేరుకున్నాయి. ఆక్సిజన్‌ సరఫరా సామర్థ్యం 350 నుంచి 600 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. వాయు, జల, రోడ్డు మార్గాలను వినియోగించుకంటూ సకాలంలో ఆస్పత్రులకు ఆక్సిజన్‌ చేరుస్తున్నారు. వాహనాల రాకలో ఎక్కడ జాప్యం జరిగినా ప్రాణాలతో చెలగాటమే కావడంతో వాహనాల తరలింపులో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మరోవైపు రూ.40 కోట్లతో మరో 25 ట్యాంకర్లు కొనుగోలు చేయనున్నారు. ఈ నెలాఖరుకు అవి వచ్చే అవకాశం ఉంది. 

వనరుల కోసం జల్లెడ..
ప్రాణ వాయువు కోసం అడుగడుగునా అన్వేషిస్తున్న అధికారులు మూతపడ్డ సుమారు 20 కంపెనీలను తెరిపించి ఆక్సిజన్‌ సరఫరా పునరుద్ధరించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలను గాలించి 17 వేల ఆక్సిజన్‌ సిలిండర్లు వినియోగిస్తున్నట్టు తేల్చారు. పరిశ్రమల కంటే ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 14 వేల సిలిండర్లను ఆక్సిజన్‌ సిలిండర్లకు (మెడికల్‌ ఆక్సిజన్‌) మార్చారు. ఇలా వనరులను వినియోగించుకుంటూ రోజుకు 70 నుంచి 80 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసేలా వేగంగా చర్యలు చేపట్టారు.

ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాల్లోనే
ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఇతర రాష్ట్రాల్లోని గ్యాస్‌ ప్లాంట్లలోనే నియమించారు. కర్నాటకకు అనంతరాములు, ఒడిశాకు ఏకే పరిడా, తమిళనాడుకు కరికాల వలవన్‌లను నియమించారు. రెండు వారాలుగా ఆ ముగ్గురు అధికారులు గ్యాస్‌ ప్లాంటులోనే ఉంటూ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. మరో ఐఏఎస్‌ అధికారి షాన్‌మోహన్‌ రాష్ట్రంలో పర్యవేక్షణ చేస్తున్నారు.

రూ.300 కోట్లతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పీఎస్‌ఏలు
ఇప్పటికే ప్రభుత్వం 26 వేల పడకలకు ఆక్సిజన్‌ పైప్‌లైన్‌లు అమర్చింది. ఒక దశలో 8 వేలు కూడా లేని ఆక్సిజన్‌ పడకలను 26 వేలకు పెంచింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించి రాష్ట్రంలో రూ.300 కోట్లతో 52 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పీఎస్‌ఏలు నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణం మొదలైంది. మూడు నెలల్లో వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ఏ పేషెంటుకూ ఆక్సిజన్‌ సమస్య ఉండదు.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు..
రాష్ట్రంలో కోవిడ్‌ బాధితులకు ఇబ్బంది లేకుండా ఐదు లీటర్ల సామర్థ్యమున్న 8 వేల కాన్‌సన్‌ట్రేటర్లు, పది లీటర్ల సామర్థ్యమున్న 10 వేల కాన్సన్‌ట్రేటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో అవసరాన్ని బట్టి వాటిని పంపిణీ చేస్తారు. ఇవి తక్షణావసరం కింద ఉపయోగపడతాయి.

రంగంలోకి నేవీ సాంకేతిక బృందం
రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో, ఆక్సిజన్‌ ప్లాంట్ల వద్ద సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు విశాఖ తూర్పు నౌకా>దళ సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. నాలుగు బృందాలు ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాయి.

తక్కువ సమయంలో పెంచుకున్నాం...
‘కోవిడ్‌ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో అతి తక్కువ సమయంలో ఆక్సిజన్‌ సరఫరా సామర్థ్యాన్ని పెంచుకోగలిగాం. నాకు తెలిసి ఇంత తక్కువ సమయంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద స్థాయిలో సరఫరా చేసిన సందర్భాలు లేవు. ప్రభుత్వాసుపత్రుల్లో పీఏఎస్‌లు అందుబాటులోకి వస్తే ఆక్సిజన్‌ సమస్యే ఉండదు’
–అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి 

ఈనెల 13న రాష్ట్రానికి చేరిన ఆక్సిజన్‌ఏ కంపెనీ?                       రాష్ట్రానికి వచ్చింది (మెట్రిక్‌ టన్నుల్లో)
లిక్వినాక్స్‌ గ్యాస్‌ లిమిటెడ్‌                                                                           49.6
ఎలెన్‌ బెర్రీ గ్యాల్‌ లిమిటెడ్‌                                                                       39.86
విశాఖ స్టీల్‌ప్లాంట్‌                                                                                       188
జేఎస్‌డబ్ల్యూ గ్యాస్‌ లిమిటెడ్‌                                                                        25.4
లిండే..బళ్లారి                                                                                              36.7
జిందాల్‌ స్టీల్, అంగుల్, ఒడిశా                                                                    40
లిండే, కళింగనగర్, ఒడిశా                                                                           93
టాటా బీఎస్‌ఎల్, అంగుల్, ఒడిశా                                                                 61
సెయిల్, రూర్కేలా, ఒడిశా                                                                           18
ఐనాక్స్, శ్రీపెరంబదూర్‌                                                                            11.3
లిండే స్టీల్, గోబిన్‌                                                                                    24.2
ఎంఎస్‌ఎంఈ ఏఎస్‌ఎ                                                                                12
మొత్తం                                                                                                  599.06

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement