సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్ అంచనాల మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని అధ‍్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, లభ్యతను సమీక్షించనున్నారని వెల్లడించాయి. 23,000 కోట్ల రూపాయల కరోనా ఉపశమన ప్యాకేజీని ఆమోదించిన తర్వాత ప్రధాని మోదీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా కోవిడ్-19పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా మౌలిక వైద్య సదుపాయాల పెంపు కోసం కేంద్ర క్యాబినెట్ రూ.23,123 కోట్ల ప్యాకేజీకి ఆమోదించిన సంగతి తెలిసిందే. కేబినెట్‌ను విస్తరణ అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన తొలి భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పునర్వ్యవస్థీకరణ తరువాత అనంతరం తొలిసారి మీడియానుద్దేశించి మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వైద్య మెరుగుదల కోసం దేశంలోని మొత్తం 736 జిల్లాల్లో సంయుక్త ప్రణాళికను అమలుచేస్తామని చెప్పారు.
కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపిస్తుందన్న అంచనాలపై కేంద్రం దృష్టి సారించింది. అలాగే మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఏప్రిల్-మేలో ఆసుపత్రులలో తీవ్రమైన ఆక్సిజన్ కొరతతో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమవుతోంది. దీనికి తోడు రానున్న థర్డ్‌వేవ్ హెచ్చరికలతో భవిష్యత్తులో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు, సరఫరాను పెంచేందుకు వివిధ రాష్ట్రాల సమన్వయంతో చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment