మండ్య, న్యూస్‌లైన్: కర్ణాటకలోని ఓ చమురు శుద్ధి కేంద్రంలో బాయిలర్ రియాక్టర్‌ను శుభ్రం చేస్తున్న ఐదుగురు కార్మికులు ఊపిరాడకపోవడంతో దుర్మరణం పాలయ్యారు. మండ్య తాలూకాలోని తూబినకెరె పారిశ్రామిక వాడలో గురువారం జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతులను బీహార్‌కు చెందిన గామ(37), బబ్లూ(26), శ్రీరామ(25), చేతు(24), రాజు(27)లుగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన సంపత్, అరుణ్ ఇక్కడ సంపత్ రిఫైనరీ పేరిట చమురు శుద్ధి కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇందులో 15 మంది కార్మికులున్నారు. గురువారం ఉదయం 25 అడుగుల ఎత్తై బాయిలర్ రియాక్టర్‌ను శుభ్రం చేయడానికి బబ్లూ అందులోకి దిగాడు. కొద్ది సేపటికే అతను కింద పడి కొట్టుకోవడాన్ని గమనించిన మరో కార్మికుడు బబ్లూను రక్షించేందుకు అందులోకి దిగాడు. అలా ఒకరి వెనుక ఒకరు మొత్తం ఐదుగురు బాయిలర్‌లోకి దిగారు. ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో వారు ఊపిరాడక మరణించారు.