
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి విచారం వ్యక్తం చేశాడు. విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో చేయిచేయి కలిపి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంటకనిపెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు.
ఓ వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో 27 ఏళ్ల విహారి మాట్లాడుతూ ‘నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు! అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే’ అని అన్నాడు. సామాజిక మాధ్యమాల్లో లక్షా పదివేల ఫాలోవర్లు ఉన్న విహారి చేసిన ప్రయత్నానికి చాలామంది కలిసిరావడంతో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ముఖ్యంగా పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా దానం, ఆక్సిజన్ అవసరమైన వారికి ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగానని ఇక ముందు కూడా ఇలాంటి సాయమందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి చెప్పాడు. ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్‌షైర్ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం జూన్ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది.
జట్టుకోసం ఏదైతే అది...
ఇంగ్లండ్ పర్యటనపై మాట్లాడుతూ జట్టు కోసం ఏ స్థానంలో పంపించినా బ్యాటింగ్‌కు సిద్ధమేనని చెప్పాడు. ‘నా కెరీర్‌లో ఎన్నోసార్లు టాపార్డర్‌లో బ్యాటింగ్ చేశాను. జట్టు మేనేజ్‌మెంట్ కోరితే ఇప్పుడు సిద్ధమే. ఓపెనింగ్ అయినా ఓకే’ అని విహారి అన్నాడు. ముందుగా కివీస్‌తో ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్, తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు చాలా ముందుగా ఇక్కడికి రావడం తనకు కలిసివస్తుందని చెప్పాడు. పిచ్, స్థానిక వాతావరణం అలవాటైందని చెప్పుకొచ్చాడు. ఇది భారత జట్టు తరఫున మెరుగ్గా ఆడేందుకు దోహదం చేస్తుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment