
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో అవసరమైనంత ఆక్సిజన్ అందుబాటులోనే ఉందని, కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఆక్సిజన్ అందక పేషెంట్లు మృతి చెందారంటూ.. తప్పుడు వార్తలతో అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. సోమవారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం తగ్గిందని చెప్పారు. ఈ నెల 24న 196 మెట్రిక్ టన్నులు, 25న 169 టన్నులు, 27న 170 టన్నుల ఆక్సిజన్ తీసుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉందని వివరించారు. కానీ ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషెంట్లు మృతి చెందారంటూ వార్తలు వచ్చాయన్నారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టపరంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించే సమీక్షా సమావేశాలపై కూడా అవాస్తవాలు ప్రచురించడం తగదని అనిల్ సింఘాల్ సూచించారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,16,90,837 మందికి టీకాలు వేశామని సింఘాల్ చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలు కలిగిన 45 ఏళ్ల లోపు వయసు తల్లులు 18,75,866 మంది ఉండగా.. 12,99,500 మందికి టీకా మొదటి డోసు పూర్తయ్యిందని తెలిపారు. జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి 53,14,740 డోసులు అందజేయనున్నట్లు కేంద్రం సమాచారమిచ్చిందని చెప్పారు.