వైద్య ఆరోగ్య సిబ్బందికి కొండంత భరోసా | Andhra Pradesh Govt Assurance To Doctors And Staff nurse | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్య సిబ్బందికి కొండంత భరోసా

Published Tue, Jun 15 2021 5:17 AM | Last Updated on Tue, Jun 15 2021 5:17 AM

Andhra Pradesh Govt Assurance To Doctors And Staff nurse - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్, బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్సలు అందిస్తోంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ విధానంతో కరోనాను కట్టడి చేస్తోంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి తోడుగా వేలాది మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. వారి కుటుంబాలకు భరోసానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న శాశ్వత (రెగ్యులర్‌) ఉద్యోగులెవరైనా కోవిడ్‌తో మృతి చెందితే వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పరిహారం.. ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ లేదా ఇతర ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇచ్చేదానికి అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేటగిరీల వారీగా పరిహారం
► కోవిడ్‌తో డాక్టరు మృతి చెందితే రూ. 25 లక్షలు, స్టాఫ్‌ నర్సులకు రూ. 20 లక్షలు, ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వో (మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ/ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ)కు రూ.15 లక్షలు, ఇతర సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది.
► ఈ సొమ్మును మృతి చెందిన బాధితుడి కుటుంబ సభ్యులకు అందిస్తారు.
► కోవిడ్‌ నియంత్రణలో భాగంగా కోవిడ్‌ హాస్పిటల్, కోవిడ్‌ కేర్‌ సెంటర్, లేదా హౌస్‌ విజిట్స్‌కు వెళ్లినప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయి ప్రాణాలు కోల్పోతే ఈ పరిహారం చెల్లిస్తారు.
► ఉద్యోగికి సంబంధించిన గుర్తింపు కార్డును సంబంధిత అధికారి జారీ చేసి ఉండాలి.
► కోవిడ్‌ పాజిటివ్‌ సర్టిఫికెట్, డెత్‌ సర్టిఫికెట్‌ విధిగా చూపించాలి. అలాగే ఆధార్‌ కార్డు, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి.

ఉద్యోగులకు భద్రత
ఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొండంత భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందంతో ఉన్నారు.
– డాక్టర్‌ జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement