
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 45 ఏళ్లు పైబడినవారిలో ఇప్పటికే 53.7 శాతం మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయసుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,13,76,000 డోసులు పంపిణీ చేశామని చెప్పారు. 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామని వివరించారు. 45 ఏళ్లు పైబడినవారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామన్నారు. జూన్ నెలాఖరుకు 47,50,000 డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. సింఘాల్ ఇంకా ఏం చెప్పారంటే..
పాజిటివిటీ రేటు తగ్గుతోంది
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు జూన్ 10న 8. 29, జూన్ 11న 8.09గా నమోదైంది. రికవరీ రేటు 94 శాతంగా ఉంది. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. జూన్ 10న 67 మంది, 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆస్పత్రుల్లో 15,951 మంది, కోవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్‌లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారు.
ఆక్సిజన్ వినియోగం తగ్గింది
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 625 ఆస్పత్రుల్లో దానికి చికిత్స అందజేశాం. ప్రస్తుతం తీవ్రత తగ్గడంతో 454 ఆస్పత్రులు కరోనాకు చికిత్స అందిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 2,231 ఐసీయూ బెడ్లు, 11,290 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో కేంద్రం నుంచి 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే తీసుకున్నాం.
బ్లాక్ ఫంగస్ కేసులను దాచిపెట్టడం లేదు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో 138 మంది మృతి చెందారు. ఈ కేసులను దాచిపెడుతున్నామనే ఆరోపణలు సరికాదు. కేసులు దాచిపెట్టడం వల్ల కేంద్రం నుంచి బ్లాక్ ఫంగస్ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్–బి ఇంజక్షన్లు రాకుండా పోతాయి.