సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ సీఎం ఆదేశాల మేరకు తక్షణమే చర్యలు చేపట్టి ఏ ఒక్క పేషెంట్‌కూ ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు. పడకలు, ఆక్సిజన్, ఇంజక్షన్లు, కోవిడ్ చికిత్సకు అనుమతి ఉన్న ఆస్పత్రులకు ఇబ్బంది లేదని, త్వరలో మరిన్ని పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
వసతులన్నీ సిద్ధం..
రాష్ట్రంలో కోవిడ్‌కేర్ సెంటర్లన్నీ పునరుద్ధరిస్తున్నాం. 2020 సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లన్నీ (అప్పుడు 115 సెంటర్లు, 49,180 బెడ్లు ఉన్నాయి) శుక్రవారం సాయంత్రం నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. వాటిని పునరుద్ధరించాలని ఇప్పటికే కలెక్టర్లకు సూచించాం. గతంలో మాదిరిగానే భోజన ఏర్పాట్లు, వసతులు అన్నీ సిద్ధం చేస్తున్నాం.
ఆక్సిజన్ కొరత లేదు
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు బాగున్నాయి. ఒడిశా నుంచి మరో 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఏపీకి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నేడు రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాం. నేటి సాయంత్రం (గురువారం) కల్లా రెండో డోస్ తీసుకోవాల్సిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తాం. దీనికోసం ఏర్పాట్ల్రు పూర్తి చేశాం. 6 లక్షల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇది రెండో డోసు ఇవ్వాల్సిన వారందరికీ సరిపోతుంది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్‌లు రావాలి..
18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌పై పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రావాల్సి ఉంది. మార్గదర్శకాలు రాగానే మే 1వతేదీ నుంచి టీకాలు ఇస్తాం. దీనిపై కసరత్తు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తగినన్ని వ్యాక్సిన్‌లు రావాల్సి ఉంది.
అనుమతి లేని ఆస్పత్రులకు రెమ్‌డెసివిర్ ఇవ్వలేం
రాష్ట్రంలో ప్రస్తుతం 140కిపైగా అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రుల్లో విధిగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇస్తున్నాం. అనుమతి లేని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఇంజక్షన్లు లేవనడం సరికాదు. ఏప్రిల్ 1 నుంచి 20వతేదీ వరకు ప్రైవేట్ ఆస్పత్రులకు 67 వేలకు పైగా ఇంజక్షన్లు ఇచ్చాం. వీటిపై ఆయా ఆస్పత్రులు లెక్కలు చెప్పాలి. సోమవారం నుంచి రోజుకు 10 వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ప్రభుత్వాసుపత్రులకు వస్తాయి. ప్రైవేట్‌కు 7,000 ఇంజక్షన్లు ఇస్తాం.
300 మంది డాక్టర్లు.. 120 లైన్లతో 104 కాల్‌సెంటర్
కాల్‌సెంటర్‌కు ఎలాంటి కోవిడ్ సమస్యతో ఫోన్ చేసినా వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తారు. 104 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేశాం. కన్సల్టెంట్‌లుగా 300 మంది వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. మూడు షిఫ్ట్‌ల్లో అందుబాటులో ఉంటుంది. తాజాగా మరో 60 లైన్లను అదనంగా చేర్చాం. గతంలో 60 లైన్లే ఉండేవి. అవసరమైతే మరికొంతమంది డాక్టర్లను కూడా నియమిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment