సాక్షి, అమరావతి: కోవిడ్ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5 (బుధవారం) నుంచి మే 18 వరకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు దుకాణాలు, వ్యాపారాలకు అనుమతి ఉంటుంది.
కర్ఫ్యూ నుంచి మినహాయింపు వీటికే..
ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు, ప్రింట్ –ఎల్రక్టానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్ ఔట్‌లెట్‌లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు. ఇవన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. వీటన్నింటికీ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
వీరికి కూడా మినహాయింపు
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు.
► వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగొచ్చు.
► వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్ టీకాలకు వెళ్లే వ్యక్తులు
► ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి
► రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి విధిగా టికెట్ ఉండాలి. అలాంటివారికి అక్కడకు వెళ్లడానికి స్థానిక అధికారులు రవాణా ఏర్పాటు చేయాలి.
► అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు.
► పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
► కర్ఫ్యూ అమలు బాధ్యతలను కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు అప్పగించారు. కర్ఫ్యూ లేని సమయంలో ప్రజలు ఎక్కువమంది గుమికూడకుండా 144 సెక్షన్‌ను అమలు చేస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.
Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే..
Published Wed, May 5 2021 3:02 AM | Last Updated on Wed, May 5 2021 5:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment