సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 551 ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు చికిత్సలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రభుత్వం కోవిడ్ చికిత్సకు అనుమతించిన ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో మొత్తం 43,498 బెడ్లు ఉన్నాయని చెప్పారు. ఈ బెడ్లలో శనివారం వరకు 32,301 బెడ్లు నిండాయని.. ఇంకా 11 వేలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆస్పత్రులను గుర్తించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించామన్నారు. కరోనా పరీక్షలు, అంబులెన్సు సౌకర్యం, ఆస్పత్రుల్లో పడకలు, వైద్య సేవలు, సందేహాలు, ఫిర్యాదులు ఇలా కరోనాకు సంబంధించిన సమస్త సమాచారం కోసం 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. బాధితులు ఫోన్ చేసిన మూడు గంటల్లోనే అధికారులు ఆస్పత్రిలో బెడ్ కేటాయించాలన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఆస్పత్రిలో సేవలు అవసరం లేదన్నారు.
ఇంటిలో లేదా కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు పొందొచ్చన్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికే ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. స్వల్ప లక్షణాలున్నవారికి కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో డిశ్చార్జి పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా కోలుకున్నవారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసి, వారి స్థానంలో వేరొకరికి అవకాశమిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 500 మంది డిశ్చార్జయ్యారన్నారు. ఇలా డిశ్చార్జి అయినవారు అవసరమనుకుంటే కోవిడ్ కేర్ సెంటర్లలో ఉండొచ్చని.. లేకుంటే ఇంటికి వెళ్లొచ్చన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ ఇంకేమన్నారంటే..
పరీక్షలు చేసిన తర్వాత రోజే ఫలితాలు
రాష్ట్రమంతా మంగళవారం నుంచి కరోనా పరీక్షలు చేసిన తర్వాత రోజే ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 24 గంటల్లోనే ఫలితాలు ఇస్తున్నారు. సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. రోజు రోజుకూ కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నాటికి కోవిడ్ కేర్ సెంటర్లలో 8,709 మంది ఉన్నారు. రాబోయే రెండు మూడ్రోజుల్లో ఈ సంఖ్య 15 వేలకు చేరుకోవచ్చు. వీటిలో కరోనా టెస్టులు చేయడంతోపాటు అక్కడే ఫలితాలు కూడా ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడా ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఆపలేదు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న శాంపిళ్ల ఫలితాలను రెండ్రోజుల్లో ఇవ్వాలని ఆదేశించాం. అంబులెన్సుల కొరత ఉన్నచోట వాటిని పెంచుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం.
రోగులకు ఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు
టెలీమెడిసిన్ కాల్ సెంటర్‌కు 2,668 మంది వైద్యులు నమోదు చేసుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 88,898 మంది ఉన్నారు. వీరందరికీ వైద్యులు ఫోన్ చేసి ఆరోగ్య సమాచారంతోపాటు సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరోవైపు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికెళ్లి కరోనా బాధితులను పరామర్శిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు అవసరమైన మేర రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల్లో 5,371 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వినియోగించగా.. ఇంకా 27,615 ఇంకా అందుబాటులో ఉన్నాయి.
104 కాల్ సెంటర్‌కు ఒక్కరోజే 13,898 మంది ఫోన్
104 కాల్ సెంటర్‌కు శనివారం ఒక్కరోజే 13,898 మంది ఫోన్ చేశారు. వారిలో 3,356 మంది పరీక్షల కోసం, 3,359 మంది వివిధ అంశాలపై సమాచారానికి, 304 మంది ఆస్పత్రుల్లో అడ్మిషన్ కోసం, 2,678 మంది పరీక్షల ఫలితాల కోసం ఫోన్ చేశారు. గత రెండు రోజుల కంటే శనివారం ఆక్సిజన్‌ను ఎక్కువగా సరఫరా చేశాం. గత 24 గంటల్లో 443 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను అందించాం. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆక్సిజన్ కేటాయింపులు మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. విజయవాడ నుంచి ఒడిశాలోని అంగుల్ ఆక్సిజన్ ప్లాంట్‌కు 2 ఖాళీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేశాం. 2 ట్యాంకర్ల ద్వారా 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి వస్తుంది. సోమవారం మళ్లీ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేస్తాం. ఆక్సిజన్ సరఫరా కోసం రాష్ట్రంలో 64 ట్యాంకర్లను వినియోగిస్తున్నాం. ఐయూసీఎల్ కంపెనీ కేటాయించిన రెండు సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) వాహనాలు రావాల్సి ఉంది. వాటి వల్ల 20 నుంచి 25 టన్నుల సామర్థ్యం పెరిగే అవకాశముంది.
వైద్య సిబ్బంది నియామకం అధికారం కలెక్టర్లకే..
జిల్లాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నియామకాలు పూర్తవగా మరికొన్ని జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియామకాలను కూడా అదే రీతిలో చేపట్టాం. గత ఏడాది కాలంలో 9 వేల మందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, బాధితుల సమాచారం సేకరించడానికి ఆరోగ్యమిత్రలను, సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను వాడుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment