
సాక్షి, అమరావతి: టీటీడీకి చెందిన నిరర్థక, నిరుపయోగ ఆస్తులను విక్రయించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వ సూచనతో విరమించుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హైకోర్టుకు నివేదించారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆస్తులను విక్రయించకూడదని తీర్మానం చేశామని తెలిపారు. ఆస్తుల రక్షణ కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశామని వివరించారు. 1974 నుంచి ఇప్పటివరకు విక్రయించిన ఆస్తులతో పాటు, టీటీడీకి చెందిన అన్ని ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం ప్రచురించాలని కూడా టీటీడీ తీర్మానించిందన్నారు.
టీటీడీ ఆస్తుల దుర్వినియోగం ఆరోపణలు సత్యదూరమని తెలిపారు. పిటిషనర్ ఎలాంటి ఆధారాల్లేకుండానే ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. టీటీడీకి తమిళనాడులో ఉన్న 23 ఆస్తుల వేలానికి టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ బీజేపీ నేత అమర్నాథ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో టీటీడీ ఈవో సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.
► వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించిన ఆస్తులు ఏ రకంగానూ పనికి వచ్చేవి కావని, గతంలోనూ ఇలాంటి ఆస్తులను విక్రయించారని కౌంటర్‌లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తుల విక్రయ ఆలోచనను విరమించుకున్నామని చెప్పారు.
► ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇస్తూ ధర్మాసనం తదుపరి విచారణను 24కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment