శ్రీవారి ఆభరణాలన్నీ భద్రమే | TTD EO Anil Kumar SInghal Gives Clarification on Ramana Deekshitulu Allegations | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆభరణాలన్నీ భద్రమే

Published Mon, May 21 2018 1:37 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

TTD EO Anil Kumar SInghal Gives Clarification on Ramana Deekshitulu Allegations - Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ప్రభుత్వ జీవో ప్రకారమే అర్చకులకు 65 ఏళ్లకు రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగమశాస్త్రం ప్రకారమే కైంకర్యాలు, సేవలు నిర్వహిస్తున్నామన్నారు. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలు... కైంకర్యాలను ప్రత్యక్ష ప్రసారాలు చేయటానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపణలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. శ్రీవారికి ప్రతిరోజు పెద్ద జియ్యంగార్, చిన్న జియ్యంగార్‌ ఆధ్వర్యంలోనే ఆగమోక్తంగా కైంకర్యాలు, ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పింక్‌ డైమండ్‌ కనిపించకుండా పోయిందని రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇదే విషయమై 2010లో అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని స్పష్టం చేశారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం 1987 డిసెంబర్‌ 16న ఇచ్చిన జీవో 1171, 2012 అక్టోబర్‌ 16న ఇచ్చిన జీవో నంబర్‌ 611 ప్రకారం అర్చకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 సంవత్సరాలుగా ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని ఈవో తెలిపారు. వయో పరిమితి కింద తొలగించిన వారి వారసులనే తిరిగి ప్రధాన అర్చకులుగా టీటీడీ నియమించిందన్నారు. 

అంతా ఆగమశాస్త్రం ప్రకారమే.. 
ఇటీవల పోటులో మరమ్మతులకు సంబంధించి ఆగమ సలహాదారులు ఎస్‌ఏకే సుందరవరదన్, తిరుమల పెద్ద జియ్యంగార్‌తో పాటు రమణæదీక్షితులను కూడా ముందుగా సంప్రదించినట్లు ఈవో తెలిపారు. ఆలయంలో సౌకర్యాల కోసం ఇలాంటి చిన్న, చిన్న మార్పులు చేపట్టడం సహజమేనన్నారు. శ్రీవారి కైంకర్యాలను ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహిస్తున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే పరమావధిగా తాము ముందుకు వెళ్తున్నామని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement