ramana deekshithulu
-
‘మరో 30 ఏళ్లు వైఎస్ జగనే సీఎంగా ఉండాలి’
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీవారి ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం ఆగమ సలహా మండలి సలహా సభ్యుడిగా రమణదీక్షితులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, అర్చకులను కాపాడాలని, మరో 30 ఏళ్లు వైఎస్ జగనే సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం చేపట్టిన ధార్మిక కార్యక్రమాలతోనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. మరో వారంలో తనకు ప్రధాన అర్చక పదవి ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఆలయాలని అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. బలవంతంగా పదవీ విరమణ చేయించారు ‘వందల సంవత్సరాలుగా శ్రీవారి కైంకర్యాలలో నాలుగు కుటుంబాలు తరిస్తు వస్తున్నాం. రాజుల, బ్రిటిష్ పాలనలో, కరువుకాటకాలు వచ్చినా స్వామివారికి మేము ఎప్పుడూ లోటు చెయ్యలేదు. అయితే అనతికాలంలో వంశపారంపర్యాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. ఈ దుర్మార్గమైన చట్టాన్ని 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రద్దు చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ చట్టాన్ని విస్మరించింది. చట్టంలో, ఆగమ శాస్త్రంలో లేని రిటైర్మెంట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి మాతో బలవంతంగా పదవీ విరమణ చేయించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో అర్చకుల సమస్యను మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం బలవంతంగా పదవీ విరమణ చేయించిన వారిని తిరిగి విధుల్లోకి తీస్కోనున్నారు. దీంతో అనేక సంవత్సరాల అర్చకుల కల నెరవేరింది. దీనిలో భాగంగానే నాకు ఆగమ సలహామండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. నాతో పాటు మరో నలుగురు ప్రధాన అర్చకులకి ఈ అవకాశం ఇస్తార’ని రమణ దీక్షితులు పేర్కొన్నారు. -
శ్రీవారి సేవకు రమణదీక్షితులుకు లైన్ క్లియర్
సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా తిరుమల పూర్వ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఆలయం ప్రవేశం చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేయడంతో టీటీడీ.. రమణ దీక్షితులుకు ఆలయ ప్రవేశం కల్పించింది. ఆగమ సలహామండలి సభ్యుడితో పాటు, శ్రీవారి కైంకర్యాలు నిర్వహించడానికి అనుమతిని ఇస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఆయనకు మార్గం సుగమమైంది. మరోవైపు రమణదీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజస్వామి ఆలయం నుంచి తిరిగి తిరుమల ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో జరిగిన ఆరాచకాలు, అవినీతిపై రమణదీక్షితులు బహిరంగ ఆరోపణలు చేయడంతో ఆయనను ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా స్వామి వారి అతి పురాతనమైన ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, తవ్వకాలు జరిపారని విమర్శించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రంలో రామరాజ్యం ప్రారంభమైంది
-
రమణదీక్షితులు మళ్లీ విధులకు..?
సాక్షి, తిరుపతి: తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మళ్లీ విధులకు హాజరవుతారా.. హైకోర్టు గురువారం వెలువరించిన సంచలన తీర్పుతో సర్వత్రా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఆయన త్వరలోనే స్వామివారి సేవకు వస్తారనే ఆశావహ చర్చ జరుగుతోంది. తీర్పు అర్చకుల్లో ఆశలు నింపింది. 65 ఏళ్లు నిండాయంటూ రిటైర్మెంటు ప్రకటించడాన్ని తిరుచానూరు పద్మావతి ఆలయ అర్చకులు హైకోర్టులో సవాలు చేయడం.. వారికి సానుకూలంగా తీర్పు రావడం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో అందరి దృష్టీ రమణదీక్షితులపై మళ్లింది. త్వరలోనే తిరిగి స్వామి సేవలో కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల్లోని అర్చకులకు ఈ తీర్పు వర్తించే అవకాశముందంటూ వారంతా సంతోషంగా ఉన్నారు. టీటీడీ బోర్డు రిటైర్మెంటువిషయంపై తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఆది నుంచీ వివాదస్పదమైంది. అందువల్లే ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు న్యాయస్థానం ముందు నిలబడాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారనే రమణదీక్షితులను వయోపరిమితి సాకుతో రాత్రికి రాత్రే తొలగించారు. ఒక్కరినే తొలగిస్తే విమర్శలు వస్తాయని మరి కొంతమందిపై టీటీడీ రిటైర్మెంట్ అస్త్రం ప్రయోగించింది. దీంతో అర్చకులంతా ఏకమయ్యారు. రమణదీక్షితులు అత్యున్నత న్యాయస్థానాన్నే ఆశ్రయించారు. రాజకీయ కోణంలోనే దీక్షితులపై వేటు రమణదీక్షితులను రాజకీయ కోణంలోనే వేటు వేశారనే విమర్శలున్నాయి. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగటం లేదని, పోటులో తవ్వకాలు జరిపారని, ఆభరణాలు మాయమయ్యాయని ఆయన చెన్నై వేదికగా చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పిం చాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటారనే ముద్ర వేసినట్లు తెలిసింది. అందువల్లే తిరుమలకు దీక్షితులను దూరం చేయాలని అధికారపార్టీ పెద్దలు గత జీఓను తెరపైకి తీసుకొచ్చారు. జీఓలో చూపిస్తూ రిటైర్మెంటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. టీటీడీ పాలకమండలి ఏకపక్ష నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందని ప్రచారం జరిగింది. వయో పరిమితి అంశం టీటీడీకి సంబంధించినది కాకపోవటంతో హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ హయాంలో మిరాశీ వ్యవస్తను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంపై అర్చకులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మీరాశీ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే న్యాయస్థానం అప్పట్లో రద్దుచేసింది. వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేయలేదు. ప్రస్తుత టీటీడీ పాలకమండలి నిర్ణయాన్ని తాజాగా హైకోర్టు తీర్పు తప్పు పట్టింది. తమ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు టీటీడీ సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఏమైనప్పటికీ హైకోర్టు తీర్పుతో రమణదీక్షితులతో పాటు రిటైర్మెంట్ పేరుతో వెళ్లిపోయిన అర్చకులందరూ తిరిగి విధుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీ బోర్డు నిర్ణయం చాలా విచారకరం
-
‘నా అనుమానాలకు బలం చేకూర్చేలా ఉంది’
సాక్షి, చెన్నై : మహా సంప్రోక్షణ పేరుతో ఆగస్టు 9 నుంచి 16 వరకు ఆలయాన్ని మూసేస్తామన్న టీటీడీ నిర్ణయంపై రమణ దీక్షితులు స్పందించారు. భక్తుల నుంచి ఆగ్రహజ్వాలలు ఎదురయ్యేసరికి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ... మహా సంప్రోక్షణపై చైర్మన్‌కు అవగాహన లేదని అన్నారు. భక్తులను ఆలయానికి అనుమతించకూడదనే నిర్ణయం సరైనది కాదని, భక్తులకు భగవంతున్ని దూరం చేయాలనే ప్రయత్నమేనని తప్పుబట్టారు. గతంలో టీటీడీపై తాను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు తన ఆరోపణలకు పాలకమండలి, ప్రభుత్వం జవాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆలయంలో రహస్యంగా సంప్రోక్షణ పూజలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. స్వామి వారి సంపదను దోచుకోవాలనే ప్రయాత్నాన్ని అడ్డుకునేందుకే సీబీఐ విచారణ కోరుతున్నానని తెలిపారు. స్వామి వారకి అపచారం చేయకుండా సంప్రోక్షణ నిర్వహించండని టీటీడీని కోరారు. -
మండలి సభ్యుడిగా రమణ దీక్షితులు తొలగింపు
సాక్షి, తిరుమల : గతకొన్ని రోజులుగా రమణ దీక్షితులు టీటీడీ పాలక మండలిపై ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించిన అధికారులు.. రమణ దీక్షితులను ఆగమ సలహా మండలి సభ్యుడిగా తొలగించాలని తీర్మానించారు. ఈ సమావేశంలోనే మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. వాటిలో కొన్ని.. రమణ దీక్షితులు స్థానంలో వేణుగోపాల్ దీక్షితులు నియామకం, మీరాశి వంశీకుల నుంచి అర్హత కలిగిన 12మంది అర్చకులను నియమించడం, తిరుమలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 15కోట్లు, గోవిందరాజు స్వామి ఆలయం గోపురం బంగారు తాపడానికి 32కోట్లు, ఒంటి మిట్టలోని కోదండ స్వామి ఆలయ అభివృద్ది పనులకు రూ.36కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దివ్య దర్శనం కోసం రూ. 1.25కోట్లు, ప్రకాశం జిల్లా దుడ్డుకురు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయ పునరుద్దరణకు 25లక్షలు, అనంతపురం జిల్లా పరిగి మండలం మోద గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 75లక్షలు, రోద్దకంబ ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాల్‌కు రూ. 75లక్షలు, తిరుమలలో యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి రూ.79కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఈవో సింఘాల్ ప్రకటించారు. చిల్లర నాణేల మార్పిడిపై ఆర్బీఐతో సంప్రదింపుల కోసం కమిటీని నియమించినట్లు తెలిపారు. రమణ దీక్షితులుకు ఇచ్చిన నోటీసులపై ఇంకా వివరణ రాలేదని తెలిపారు. నూతన కళ్యాణ మండపాల నిర్మాణంపై సబ్ కమిటీ నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఈవో సింఘాల్ తెలిపారు. -
ఆ రూబీ విలువ 50 రూపాయలు: టీటీడీ
సాక్షి, తిరుమల : ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే స్వామి వారి ఆభరణాలు ప్రదర్శిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. స్వామివారి ఆభరణాలు ఒక్కగ్రాము కూడా పక్కదారి పట్టలేదని తెలిపారు. వందల ఏళ్ల క్రితం నాటి ప్రాకారాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందునే మరమత్తులు చేపట్టామని పేర్కొన్నారు. పోటు మరమత్తుల్లో భాగంగా ఫైర్ బ్రిక్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. అపవాదు వేయడం మంచిది కాదు: టీటీడీ చైర్మన్ పోటులో తవ్వకాలు జరగడం అవాస్తమని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. బొక్కసానికి సంబంధించి మూడు తాళాలు ఉంటాయని.. ఈ మూడు తాళాలు సంబంధిత మూడు విభాగాల వారి వద్ద ఉంటాయని తెలిపారు. సీక్రెట్ లాక్ వల్ల పూర్తి స్థాయి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఆభరణాలను రికార్డు ప్రకారమే పరిశీలించాం గానీ పూర్తిస్థాయిలో తనిఖీ చేయలేదని ఆయన తెలిపారు. స్వామివారి ఆభరణాల్లోని రూబీ ఒకటి విరిగిపోయిందని.. దాని విలువ 50 రూపాయలుగా నమోదు చేసి ఉందని పేర్కొన్నారు. పూర్వకాలంలో స్టీల్ రాడ్స్ లేనందువల్లే ప్రాకారాలు బలహీన పడ్డాయని అందుకే మరమత్తులు చేపట్టామన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రమణ దీక్షితులు అపవాదు వేయడం మంచిది కాదని, ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. -
అర్చకులపైనే దాడి చేస్తారా?
-
అన్ని విధాలుగా అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు
-
దీక్షితులుపై లీగల్‌గా ముందుకెళ్తాం: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల ఉద్వాసనకు గురైన దేవస్థాన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవస్థాన వ్యవహరాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న దీక్షితులుపై లీగల్‌గా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సుధాకర్ యాదవ్, ఈవో సింఘాల్ మంగళవారం మీడియాతో తిరుమలలో మాట్లాడారు. 24 ఏళ్లపాటు ప్రధాన అర్చకుడిగా ఉన్న దీక్షితులు దేవస్థాన వ్యవహారాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఛైర్మన్ మండిపడ్డారు. ఆరోపణలు చేసేముందు పాలక మండలి దృష్టికి తేవాల్సిందని అన్నారు. శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు పెడతామనీ, దీనిపై ఆగమ శాస్త్ర పండితుల సలహాలను తీసుకుంటామని ఈవో సింఘాల్ తెలిపారు. ఆభరణాల పూర్తి భద్రత టీటీడీదేనని అన్నారు. టీటీడీ పాలక మండలి తీసుకున్న పలు నిర్ణయాలను వారు వెల్లడించారు. రాష్ర్ట వ్యాప్తంగా దళిత, గిరిజన వాడలు, మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో ఒక్కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలోని నాగలాపురంలో వేద పాఠశాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. తిరుమలలో 70 ఎకరాల విస్తీర్ణంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తన్ని లోపలేస్తారా?
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ప్రశ్నిస్తే తన్ని లోపలేస్తారా అని సోమిరెడ్డిని ప్రశ్నించారు. మంత్రి చేసిన ఆరోపణపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార దర్పంతో తన్నిస్తామనడం ప్రజాస్వామ్యమేనా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. -
టీటీడీ చరిత్రలో చీకటి రోజు
-
నిరసన దేవుడిపైనా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి / తిరుమల : టీటీడీ చరిత్రలో గురువారం చీకటి రోజుగా మిగిలిపోనుంది. అర్చకుల తొలగింపు, నియామకాల్లో చోటు చేసుకున్న రాజకీయాలు శ్రీవారి గర్భగుడి వరకు వెళ్లడం భక్తులను విస్మయానికి గురిచేసింది. టీటీడీ అధికారులు, ప్రభుత్వ నిర్ణయాలను ఎత్తిచూపుతూ మాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తోన్న ఆరోపణలకు వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగులు, ఆలయ అర్చకులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావడం చూసి భక్తులు నివ్వెరపోయారు. తిరుమలలో ఈ తరహా నిరసనలను ఎన్నడూ చూడలేదన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తిరుపతిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకే పరిమితమైన ఆందోళనలు, నిరసనలు తొలిసారి ఆలయ ప్రాంగణంలో జరగడం భక్తులను విస్మయానికి గురిచేశాయి. ప్రభుత్వమే ఉద్యోగులు, అర్చకులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రమణ దీక్షితులేమన్నా రాజకీయ నాయకుడా...? ఆయన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగులందరినీ వివాదంలోకి లాగడం ఎంత వరకూ సబబన్న ప్రశ్న తలెత్తుతోంది. శ్రీవారి గర్భగుడిలోనూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఆలయ ప్రతిష్టను దిగజార్చవద్దంటూనే అధికార పార్టీ పెద్దలు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి లొంగిన టీటీడీ అధికారులు చెప్పడంతో ఇష్టంలేకపోయినా నిరసనకు దిగినట్లు ఉద్యోగులు, అర్చకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే సూత్రధారులా? ఉద్యోగులు, అర్చకులు నిరసనలకు దిగడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా తిరుమల కొండపై నిరసనలు, ఆందోళనలు నిషేధం. ఉద్యోగులుగానీ, అర్చకులుగానీ ఎవరూ తిరుమల క్షేత్రంపై నిరసనలు జరిపిన సందర్భాలు లేవు. అలాంటిది తాజాగా టీటీడీ ఉద్యోగులు జేబులకు, అర్చకులు ధోవతులకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. స్వామి వారి సేవా కైంకర్యాలకు హాజరయ్యే తమకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపడం ఇష్టం లేకపోయినా అధికారుల నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా తప్పడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని అర్చకులిద్దరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. నిరసన సరికాదన్న జేఈవో... ఇదిలా ఉండగా తిరుమల క్షేత్రంలో నల్లబ్యాడ్జీలతో నిరసన సరికాదని తెలియజేస్తూ తిరుమల జేఈవో శ్రీనివాసరాజు గురువారం మధ్యాహ్నం తరువాత సర్క్యులర్ విడుదల చేశారు. ఉద్యోగులు, అర్చకులు ఈ తరహా నిరసనలకు దిగకూడదని అందులో స్పష్టం చేశారు. రోజుకో ఘటనతో తిరుమల ప్రతిష్టకు భంగం గత వారం రోజులుగా తిరుమలలో రోజుకో కొత్త సంఘటన చోటు చేసుకుంటోంది. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ అధికారులపై ఆరోపణలు చేసిన «మరుసటి రోజే ధర్మకర్తల మండలి తిరుమలలో సమావేశమై 65 ఏళ్ల వయో పరిమితిని విధించడం అర్చకుల మధ్య రగడకు కారణమైంది. వారసత్వ అర్చకత్వాన్ని రద్దు చేసే అధికారం టీటీడీకి లేదని వాదిస్తూ రమణ దీక్షితులు తనదైన పోరాటాన్ని మొదలు పెట్టారు. ఆయన వ్యవహార శైలిపై భగ్గుమన్న టీటీడీ అధికారులు ప్రధాన అర్చకత్వ బాధ్యతల నుంచి రమణ దీక్షితులును తొలగించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. టీటీడీ నిర్ణయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానన్న రమణదీక్షితులు ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అధికారులు చేసిన పనులను ఎత్తి చూపారు. ఆభరణాలు మాయమవుతున్నాయనీ, నేలమాళిగల్లోని అరుదైన సంపద కోసం పోటులో తవ్వకాలు జరిగాయన్న దీక్షితుల ఆరోపణలు టీటీడీ అధికారులను ఇరుకున పడేశాయి. సీఎం దగ్గరకెళ్లిన టీటీడీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్, ఈవోలు సుధీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే రమణ దీక్షితులు చేస్తోన్న ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసేందుకు ప్రభుత్వం అటు అధికారులను, ఇటు అర్చకులనూ వాడుకుందన్న వాదనలు తెరమీదకు వచ్చాయి. ఎన్నడూ మీడియా ముందుకు రాని అనువంశిక అర్చకులు, జియ్యంగార్లు, పోటు కార్మికులు ఈ వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చడమే ఇందుకు నిదర్శనం. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చోటచేసుకుంటున్న ఘటనలతో తిరుమల ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో నిరసనలా..? స్వామి దర్శనానికి చాలా సార్లు వచ్చాను. ఇలా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన మొట్టమొదటిసారి చూశాను. ఏది ఏమైనా స్వామి వారి సన్నిదానంలో ఈ తరహా నిరసనలు సమంజసం కాదు కదా... – సినీనటి కవిత. ఖండించాల్సిన అంశం... ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో నిరసనలు ఉండకూడదు. అందరం ఖండించాల్సిందే. ఇలాంటి వాటిని ప్రభుత్వం నిలిపివేయాలి. టీటీడీ అధికారులే ఇలాంటివి ప్రోత్సహించడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం. ప్రభుత్వం జోక్యం చేసుకుని తిరుమలలో పెరుగుతున్న వివాదాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉంది. – భానుప్రకాశరెడ్డి, బీజేపీ నేత -
‘తిరుమల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆభరణాల మాయంపై విచారణ చేయించి టీడీపీ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. బుధవారం ఢిల్లీలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పి, భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. టీటీడీ వ్యవహారంపై ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల 26న నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుందని, అదే రోజున ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని కన్నా తెలిపారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయమని అమిత్ షా తనను ఆదేశించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించి ప్రభావవంతంగా పనిచేయాలని అమిత్ షా సూచించారని చెప్పారు. -
రమణ దీక్షితులు తొలగింపుపై సుప్రీంకు వెళ్తా
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తొలగింపు వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు, బ్రాహ్మణ, అర్చక సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని ఎండగడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు సుబ్రమణియన్ స్వామి స్పందించారు. రమణ దీక్షితులు తొలగింపులో టీటీడీ చేసిన అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. కాగా, టీటీడీలో పలు విలువైన ఆభరాణాలు, వజ్రం కనిపించడం లేదని, వంటశాలలో నిబంధనలకు విరుద్ధంగా రెండు వారాలపాటు తవ్వకాలు జరిపారని, స్వామివారి కైంకర్యాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పరిధికి మించి జోక్యం చేసుకుంటోందని రమణదీక్షితులు పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే టీటీడీ 65 ఏళ్ల నిబంధన తీసుకువచ్చి రమణ దీక్షితులును తొలగించింది. అయితే తిరుమలలో వంశపారంపర్య అర్చకత్వం చేస్తున్న తమను తొలగించే అధికారం ఎవరికీ లేదని ఆయన వాదిస్తున్నారు. తాము టీటీడీ కింద ఉద్యోగులుగా పనిచేయడం లేదని, అలాంటప్పుడు ఎలా తొలిగిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు సైతం తీర్పును వెలువరించిందని ఆయన పేర్కొంటున్నారు. -
శ్రీవారి ఆభరణాలన్నీ భద్రమే
సాక్షి, తిరుపతి: శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. అదే విధంగా ప్రభుత్వ జీవో ప్రకారమే అర్చకులకు 65 ఏళ్లకు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగమశాస్త్రం ప్రకారమే కైంకర్యాలు, సేవలు నిర్వహిస్తున్నామన్నారు. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలు... కైంకర్యాలను ప్రత్యక్ష ప్రసారాలు చేయటానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపణలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. శ్రీవారికి ప్రతిరోజు పెద్ద జియ్యంగార్, చిన్న జియ్యంగార్ ఆధ్వర్యంలోనే ఆగమోక్తంగా కైంకర్యాలు, ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పింక్ డైమండ్ కనిపించకుండా పోయిందని రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇదే విషయమై 2010లో అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని స్పష్టం చేశారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం 1987 డిసెంబర్ 16న ఇచ్చిన జీవో 1171, 2012 అక్టోబర్ 16న ఇచ్చిన జీవో నంబర్ 611 ప్రకారం అర్చకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 సంవత్సరాలుగా ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని ఈవో తెలిపారు. వయో పరిమితి కింద తొలగించిన వారి వారసులనే తిరిగి ప్రధాన అర్చకులుగా టీటీడీ నియమించిందన్నారు. అంతా ఆగమశాస్త్రం ప్రకారమే.. ఇటీవల పోటులో మరమ్మతులకు సంబంధించి ఆగమ సలహాదారులు ఎస్‌ఏకే సుందరవరదన్, తిరుమల పెద్ద జియ్యంగార్తో పాటు రమణæదీక్షితులను కూడా ముందుగా సంప్రదించినట్లు ఈవో తెలిపారు. ఆలయంలో సౌకర్యాల కోసం ఇలాంటి చిన్న, చిన్న మార్పులు చేపట్టడం సహజమేనన్నారు. శ్రీవారి కైంకర్యాలను ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహిస్తున్నామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే పరమావధిగా తాము ముందుకు వెళ్తున్నామని వివరించారు. -
సీబీఐ విచారణ చేయించండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీవారి ఆభరణాలు సురక్షితమని, అన్నీ ఆగమశాస్త్రం ప్రకారమే చేపడుతున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన కొన్ని గంటల్లోనే రమణ దీక్షితులు తన వాదనను మళ్లీ వినిపించారు. తాను చేసిన ఆరోపణలకు, విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఆయన ప్రకటించారు. వాటిపై సీబీఐతో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. అలాగే మరోసారి కొన్ని విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ టీటీడీ అధికారులు, ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఆయన ప్రశ్నించారు. కేవలం నాలుగు బండలను తొలగించడానికి 22 రోజులపాటు పోటును ఎందుకు మూసివేశారో చెప్పాలని నిలదీశారు. స్వామివారికి మూడు పూటలా అన్న ప్రసాదాలు తయారు చేసే పోటును మూసివేయడం అపచారమన్నారు. తాత్కాలికంగా మరోచోట ప్రసాదాలు తయారు చేస్తున్నారని, ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధం అన్నారు. ప్రసాదం తయారీని భక్తులు చూడకూడదని, కేవలం తయారు చేసే వ్యక్తి, అర్చకుడు మాత్రమే వాటిని పర్యవేక్షించాలని రమణ దీక్షితులు అన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ స్వామివారిని పస్తులుంచడం ఘోరమని వ్యాఖ్యానించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, రాళ్లు తొలగించాల్సిన అవసరమేముందని, వాటి కింద ఏమున్నాయని ఈ అపచారానికి పాల్పడ్డారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరమ్మతుల పేరుతో ప్రాచీన కట్టడాలను పడగొట్టడం ఎంతవరకు శ్రేయస్కరమంటూ నిలదీశారు. ఎవరి అనుమతి లేకుండా మరమ్మతులు చేయడం ఎందుకోసం అని ప్రశ్నించారు. నేలమాళిగల కోసం తవ్వారా? అన్నదానికి సమా«ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు. గులాబీ రంగు వజ్రం ఏమైంది..? గులాబీ రంగు వజ్రం దేశం దాటిపోయిందన్న తన ఆరోపణకు కట్టుబడి ఉన్నానని రమణ దీక్షితులు చెప్పారు. ఇటీవల జెనీవాలో వేలానికి వచ్చిన గులాబీ రంగు వజ్రం, శ్రీవారి ఆలయంలో భక్తులు విసిరిన నాణేలు తగిలి పగిలిందని చెబుతున్న వజ్రం ఒకటేనన్నారు. శ్రీవారి అలంకారానికి పాత నగలు ఎందుకు వాడటంలేదని నిలదీశారు. కొత్త నగలు మాత్రమే వాడడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ కింద అర్చకులు జీతగాళ్లుకాదన్నారు. కేవలం సంభావన కింద మాత్రమే పనిచేస్తున్నామని తెలిపారు. శిల్ప సంపదతో కూడిన వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించ వద్దని చెప్పినా వినిపించుకోలేదని పేర్కొన్నారు. రథ మండపాన్ని కూడా తీసేసి అపచారం చేశారన్నారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తున్నందుకే తనను ప్రధాన అర్చక హోదా నుంచి తొలగించారన్నారు. నేను తప్పులు చేస్తే శిక్షించండి... కానీ శ్రీవారి ఆస్తులను మాత్రం కాపాడండి.. అని విజ్ఞప్తి చేశారు. -
12 నామాలు పెట్టరు.. సెంట్ రాసుకొని తిరుగుతారు!
సాక్షి, తిరుమల: కలియుగదైవానికి పూజలు జరిపించే అర్చకుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. శ్రీవారి ఆభరణాలు మాయమవుతున్నాయంటూ, పోటు(వంటశాల)ను 22 రోజులపాటు మూసివేయడంలో కుట్రదాగుందంటూ తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసిన మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులుపై ప్రస్తుత అర్చకులు అంతేస్థాయిలో మండిపడ్డారు. రమణదీక్షితులు గొల్లపల్లి వంశానికి దత్తపుత్రుడని, 12 నామాలు పెట్టుకోకుండా స్వామివారికి కైకకర్యాలు చేస్తారని, కొడుకులకేమో అభిషేక విధులు అప్పగించి, మిగతావారికి ఆర్జితసేవ డ్యూటీలు వేసేవారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం తిరుమలలో ప్రధాన అర్చకులు, సంభవ అర్చకులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. (చదవండి: తొలగించిన బండల కింద ఏమున్నాయి: రమణ దీక్షితులు) ఆయన 12 నామాలు పెట్టుకోరు.. ‘‘25 ఏళ్లపాటు శ్రీవారి ఆలయం రమణదీక్షితులు ఆధ్వర్యంలోనే నడిచింది. కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చారు తప్ప మరో ఉద్దేశంలేదు. కానీ తనను, తన కుమారులను విధుల నుంచి తప్పించారని రమణదీక్షితులు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఆయనను ఆలయం నుంచి ఎవరూ బయటికి పంపలేదు. అయితే గడిచిన కాలమంతా ఆయన తీరుతో అందరూ ఇబ్బందులు పడ్డారు. నిజానికి శ్రీవారికి పంగనామాలు పెట్టిందే ఆయన. వారు ఏనాడూ 12 నామాలు పెట్టుకోలేదు. కానీ సెంటు రాసుకుని ఆడీకారులో తిరుగుతారు. అసలు 12 నామాలు లేనిదే స్వామివారికి కైకర్యాలు చేయకూడదు. ఆయన గొల్లపల్లి వంశానికి దత్త పుత్రుడు. కల్యాణోత్సవంలో కనీసం మత్రాలు చెప్పగలరా? తన కొడుకులకు మాత్రం అభిషేక విధులు వేస్తారు. మిగతావారికి ఆర్జితసేవల డ్యూటీలు కేటాయిస్తారు. స్వామివారికి బయటి నుంచి అన్నప్రసాదాలు తేవడం గతం(2001)లోనూ జరిగింది. ఇకపోతే, సౌందర రాజన్‌కు ఏం సంబంధం ఉందని ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నారు? ఆత్రయబాబు ఒక న్యాయవాది. ఆయన కూడా రమణదీక్షితులును సమర్థించడమేంటి? ముఖ్యమంత్రి ముందే కంకణ బట్ట వస్ర్తం లాక్కున్నప్పుడు వీళ్లలో ఎవరూ మాట్లాడలేదు. 2013 నుండి నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ప్రధాన అర్చకుడిగా ఒకటే కోరుతున్నాను.. మంచిని నేర్పిస్తే మేము సహకరిస్తాం. చెడుకు ఎట్టిపరిస్థితుల్లో సపోర్ట్ చేయం. స్వామివారి సేవకు మూడో తరం వారికి అవకాశం వచ్చింది. బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని వేణుగోపాల దీక్షితులు అన్నారు. (చూడండి: వజ్రం ఎక్కడైనా పగులుతుందా?) ఆరోపణల్లో నిజంలేదు.. ‘‘గత వారం రోజులుగా వినిపిస్తోన్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజంకాదు. స్వామివారికి నైవేద్యాలు, కైంకర్యాలు సకాలంలోనే జరుగుతున్నాయి. సేవల్లో మార్పులు జరిగాయంటే అది సమిష్టినిర్ణయంతో జరిగినవే. పోటులో ఇంతకుముందు కూడా చాలా మార్పులు జరిగాయి. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మరమ్మత్తులు చేసిన విషయం గుర్తే. అన్ని సందర్భాల్లోనూ ఆగమ సలహాల ప్రకారమే నిర్ణయాలు జరిగాయి’’ అని కృష్ణశేషచల దీక్షితులు పేర్కొన్నారు. రాయల నగలు చూపలేదు.. కైంకర్యపరులు 32 మందిమి ఉన్నాం. అందరికీ 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరాం. మిరాసి అర్చకుల మాదిరిగానే మాకూ నిబంధనలు వర్తింపజేయాలని అడిగాం. రిటైర్మెంట్ అనేది అర్చకులకు అవసరం. ఈ వయో పరిమితి ద్వారా వారి తర్వాతి వంశాలకు అవకాశం వస్తుంది. కైంకర్య పరుల పిల్లలకు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. స్వామివారికి కైంకర్యాల విషయంలో ఎలాంటి లోపం జరగలేదు. నగల విషయంలో వస్తున్న ఆరోపణలు కూడా నిరాధారమైనవి. రాయలవారి నగలు ఎక్కడా చూపలేదు. మైసూరు, గద్వాల్, వెంకటగిరి రాజావారలు ఇచ్చిన నగల వివరాలు మాత్రమే ఉన్నాయి. రమణదీక్షితులు నగలు తిరిగిచ్చినప్పుడు కూడా రాయల నగల ప్రస్తావనేలేదు. రమణధీక్షతుల కుమారులు కూడా కైంకర్యాలకు సరిగా రారు. ఇదేమని అడిగినందుకే అడిగినందుకే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు. తోటి అర్చకులను ఆయన హీనంగా చూస్తారు..’’ అని కాత్తి నరసింహ దీక్షితులు అన్నారు. -
తొలగించిన బండల కింద ఏమున్నాయి: రమణ దీక్షితులు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ప్రాచీన కట్టడంపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం ఆగమ శాష్త్రానికి విరుద్దమని పేర్కొన్నారు. ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఆయన ప్రశ్నించారు. కేవలం నాలుగు బండలను తొలగించడానికి 22రోజుల పాటు పోటును ఎందుకు మూసివేశారని నిలదీశారు. పోటులో స్వామివారికి మూడు పూటలా అన్న ప్రసాదాలు చేస్తారని వెల్లడించారు. ఇటీవల ఆ పోటును మూసివేశారని, తాత్కాలికంగా మరోచోట ప్రసాదాలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రసాదం తయారీని భక్తులు చూడకూడదని.. కేవలం తయారుచేసే వ్యక్తి, అర్చకుడు మాత్రమే వాటిని పర్యవేక్షించాలని రమణ దీక్షితులు అన్నారు. స్వామివారిని పస్తులుంచడం సరికాదని, ఆగమ శాష్త్రాలకు విరుద్దం అని వ్యాఖ్యానించారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న కట్టడం భాగం పడగొట్టి, రాళ్ళు తొలగించాల్సిన అవసరం ఏంటని.. వాటి కింద ఏమున్నాయని ప్రశ్నించారు. మరమ్మత్తుల పేరుతో ప్రాచీన కట్టడాలను పడగొట్టడం ఎంతవరకు శ్రేయస్కరం అంటూ నిలదీశారు. ఎవరి అనుమతి లేకుండా మరమ్మత్తులు చేయడం ఎంతవరకూ సమంజసం అని అన్నారు. -
తిరుమలలో తప్పులు రాష్ట్రానికే అరిష్టం: కోన
సాక్షి, తిరుపతి : దేవాలయాలు, అర్చకులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన రమణ దీక్షితులుకు మద్దతుగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రమణ దీక్షితులు అడుగుతున్న ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు. తిరుమలలో జరుగుతున్న తప్పుల వల్ల రాష్ట్రానికే అరిష్టమని అన్నారు. 65 ఏళ్లుకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై సీబీఐ విచారణ జరిపి, ఆయనను తక్షణమే ప్రధానార్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్లు నిండాయని ఆయనను పక్కన పెట్టడం దురదృష్టకరమని తెలిపారు. ఆయన బాధను చెప్పుకోవడానికి ఇక్కడ అవకాశం లేక పక్క రాష్ట్రానకి వెళ్లి చెప్పుకునే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. చంద్రబాబు దేవాలయాలను నాశనం చేసిన వ్యక్తి, విజయవాడలో కూల్చిన దేవాలయాలను ఎక్కడ తిరిగి నిర్మించలేదని ఆరోపించారు. దేవతా సేవల వేళల్లో ఇష్టానుసారం మార్పులు చేయడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని శాస్త్ర వ్యతిరేక పనులే చేస్తున్నారని విమర్శించారు. మిరాశీ కుటుంబీకుడు ప్రశ్నించడం తప్పా, ఆస్తుల లెక్కలు భక్తులకు చెప్పమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. 2017 డిసెంబర్లో వంటశాలను మూసివేసి తవ్వకాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ మిరాశీలను 65 ఏళ్లకే తొలగిస్తామనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మణులతో పెట్టుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. గతంలో ఐవైఆర్ కృష్ణారావును అలానే అవమానించారు. ఇప్పుడు రమణదీక్షితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. సన్నిధి గొల్లలకు కూడా చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. దేవాలయాలన్నింటికి ధూప దీప నైవేద్యాలుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులిచ్చి సంస్కృతి, సాంప్రదాయాలను బ్రతికించారని తెలిపారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అలానే హామీ ఇచ్చారని అన్నారు. -
టీటీడీ బోర్డుపై బ్రాహ్మణ సంఘాలు ఫైర్
సాక్షి, విజయవాడ: ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పట్ల టీటీడీ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. టీటీడీ బోర్డు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశాయి. టీటీడీలో జరుగుతున్న అవకతవకలను బయల పెట్టినందుకే బోర్డు రమణ దీక్షితులును తొలగించడానికి కుట్ర పన్నుతోందని తెలిపారు. ఏ హక్కుతో ఆయనను విధుల నుంచి తొలగిస్తారని బోర్డుని ప్రశ్నించారు. వెంటనే రమణ దీక్షితులుపై చర్యలను వెనక్కి తీసుకొవాలని బోర్డుని కోరారు. టీటీడీ వ్యాపార కేంద్రంగా, రాజకీయ పునరావాసంగా మారిందని బ్రాహ్మణ సంఘాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 19, 20న గుంటూరులో బ్రాహ్మణ సంఘాలు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. తొందరలోనే దీనికి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఈ ప్రభుత్వం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు. అందుకే ఓ వివాదస్పద వ్యక్తిని చైర్మన్‌గా పెట్టారని మండిపడ్డారు. -
అలజడి రేపిన రమణ దీక్షితులు...
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఏడాది కాలంగా ధర్మకర్తల మండలి లేక అభివృద్ధి పనుల విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న టీటీడీలో బుధవారం కీలక నిర్ణయాలు జరుగనున్నాయి. ఉదయం 10 గంటలకు తిరుమల అన్నమయ్య భవన్లో ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన బోర్డు సభ్యుల తొలి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించను న్నారు. 190కి పైగా అజెండా అంశాలపై చర్చించనున్నారు. అభివృద్ధి, నిధులకేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. తొలి సమావేశం.... సాధారణంగా నెలకోసారి ట్రస్ట్‌బోర్డు సమావేశం జరగాలి. చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్న ధర్మకర్తల మండలి పదవీ కాలం ఏడాది కిందట పూర్తయ్యింది. ఆ తరువాత ఇటీవలనే కొత్త బోర్డు ఏర్పాటైంది. బుధవారం తొలి సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో కీలక అంశాలకు ఈ సమావేశం వేదిక కానుంది. సభ్యులు తీసుకునే నిర్ణయాలే కీలకం కానున్నాయి. ఇటీవల టీటీడీ అధికారులు రూ.1000 కోట్ల నిధులను ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్ చేశారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్లు వేసి శ్రీవారి సొమ్ముకు భద్రత లేకుండా చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశంపై బుధవారం నాటి బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. సభ్యులు ఆమోదిస్తేనే రూ.1000 కోట్ల డిపాజిట్లు ప్రయివేటు బ్యాంకులో ఉంటాయి. లేకపోతే విత్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం రూ.10 కోట్ల టీటీడీ నిధులను తిరుపతి సుందరీకరణకు కేటాయించింది. దీనిపైనా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ మధ్యనే రూ.9 కోట్ల నిధులతో అవిలాల చెరువు అభివృద్ధి పనులు కూడా చేపట్టాలనుకున్నారు. దీనిపైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుమారు రూ.70 కోట్ల ఇంజినీరింగ్ పనులపై బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకుని ఆమోదాన్ని వ్యక్తం చేయాల్సి ఉంది. వచ్చే బ్రహ్మోత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు సంబంధించిన బడ్జెట్ కేటయింపులపైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. భక్తులకు వసతులు, టైం స్లాట్ దర్శనం, లడ్డూల తయారీ, శ్రీవారి సేవలకు వసతి, వైద్యం, ఇతరత్రా అంశాలకు నిధుల కేటాయింపు విషయంపై సభ్యులు చర్చించి ఆయా అంశాలకు ఆమోదం తెలపాల్సి ఉంది. ధర్మకర్తల మండలిలో అందరూ కొత్త వారే కావడం వల్ల అజెండాలోని అంశాలపై పెద్దగా చర్చ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో అధికారులు వ్యూహాత్మకంగా 190కి పైగా అంశాలను అజెండాలో పొందుపర్చడం విమర్శలకు తావిస్తోంది. అలజడి రేపిన రమణ దీక్షితులు... టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మంగళవారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమంటూనే ఎన్నో అవమానాలను భరించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. టీటీడీలోని అధికారులు కొంతమంది అధికార బలంతో ఆలయ నిబంధనలను విస్మరిస్తున్నారని, సినీ, రాజకీయ ప్రముఖులకు భజన చేస్తూ ఆలయ సంప్రదాయాలను, కైంకర్యాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. -
రమణ దీక్షితులుకు నోటీసులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ నలుగురు ప్రధాన అర్చకుల్లో ఒకరైన రమణ దీక్షితులుకు టీటీడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అనుమతి లేకుండా తన మనవడిని మహద్వారం నుంచి ఆలయానికి తీసుకొచ్చారు. దీనిపై గతంలోనే ఓసారి ఆలయ విభాగం రమణ దీక్షితులుకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది. తాజాగా మరోసారి ఆయన మనవడితో సహా ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో మరోసారి కూడా టీటీడీ రమణ దీక్షితులును వివరణ కోరుతూ నోటీసులిచ్చింది. ఆయన కుమారులు వెంకటపతి దీక్షితులు, రాజేష్ దీక్షితుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉండటంతో వారి ని తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
తిరుమల ప్రధాన అర్చకుడికి కోపమొచ్చింది
-
తిరుమల ప్రధాన అర్చకుడికి కోపమొచ్చింది
తిరుపతి: తిరుమలలో మరోసారి అర్చకులు అధికారుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సింహవాహన ఊరేగింపులో ఆలయ పేష్కర్పై ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మండిపడ్డారు. వాహనాల డ్యూటీలను ప్రధాన అర్చకులకు తెలియకుండా మారుస్తారా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేయడం తనను అవమానించినట్లే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఒకసారి ఓ అర్చకుడికి డ్యూటీ అప్పగించి నిర్ణయం తీసుకున్నాకా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరేగిస్తున్న ఆయా వాహనాలకు ప్రత్యేక అర్చకులకు డ్యూటీలు వేశారు. అయితే, శుక్రవారం ఊరేగించిన వాహనాలకు కూడా గతంలో విధులు నిర్వర్తించిన అర్చకులే తిరిగి కనిపించడంతో రమణ దీక్షితులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాగే రమణ దీక్షితులు వేసిన డ్యూటీలను పేష్కార్ అధికారులు మార్పులు చేశారు.